"తెలుగు భాషని తెలుగు వాళ్ళే మాట్లాడటం లేదు. అలా మాట్లాడటానికి తెలుగు వాళ్ళే సిగ్గు పడుతున్నారు. మమ్మీ, డాడీ సంస్కృతి వచ్చి తెలుగుని తుడిఛిపెడుతోంది" అంటూ ఎందరో తెలుగు భాషాభిమానులు తెలుగు బ్లాగులలోనూ, తెలుగు గుంపులలోనూ ప్రతి రోజూ ఎన్నో పేజీలను నింపేస్తునారు. వేరే భాషల వాళ్ళు వాళ్ళ భాషలను ఎలా ప్రొత్సహిస్తున్నారో చెప్తున్నారు. ఈ-తెలుగు (etelugu.org) లో "తెలుగుని నిలుపుట" గురించి జరిగిన చర్చలో చాలా చాలా చెప్పేరు. కొంతమంది కొన్ని సుచనలూ చేసేరు. కాని విచిత్రమేమిటంటే, మనం ఈ విషయంలో కార్యాచరణకు పూనుకొనేందుకు ఉద్యుక్తులవుదాం, రండి ఒక చోట కూర్చొని ముఖాముఖి చర్చించి నిర్ణయాలను తీసుకుందాం అంటే ఏదో ఒక సాకుతో ముఖం చాటేస్తారు. ప్రతీ నెలా తప్పకుండా ఈ-తెలుగు (తెలుగు బ్లాగర్ల) సమావేశాలు జరుగుతున్నాయి. కాని పైన ఉదహరించిన పెద్దలు ఎంతమంది ముందుకు వచ్చేరు? సమావేశాలకు వచ్చి చర్చించేరు? తెలుగు భాష పైన అభిమానం ఇంతేనా? ఇలా అంటే కటువుగా అనిపించవచ్చు. కాని ఇది నూటికి నూరు పాళ్ళు నిజం.
ఊరకనే అభిమానం, అభిమానం అంటూ గొంతు చించుకుంటే ఏమి ప్రయోజనం? బ్లాగులలో వ్రాతలతోనూ, ఒకరినొకరు పొగుడుకోవటంతోనూ సరిపెట్టుకుంటే ఎలా? వ్రాయాలా, రాయాలా అన్న చర్చ ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యం కాదు. అసలు తెలుగు భాష ఉనికే ప్రశ్నార్ధకం అయినప్పుడు.
వేరే ప్రదేశాలలో ఉన్న వారిని ప్రక్కకు పెడితే హైదరాబాదులోనే ఉంటూ ఈ-తెలుగు (బ్లాగర్ల)సమావేశాలలో ఉత్సాహం చూపినది ఎందరు? మీకందరికీ తెలుసు. ఇది ఏదో ఒకరిద్దరి సమస్య కాదు.కాని బ్లాగులలోనూ, గుంపులలోనూ కబుర్లు చెప్పటంతో సరిపెట్టటం ఎంతవరకూ సమంజసం? పైగా ఉచిత సలహాలతో సరిపెడుతున్నారు.ఆంటే మనది ఆవేశం మాత్రమే అన్నమాట. అదే తెలుగు వాళ్ళకు పుట్టుకతో వచ్చిన బుద్ధా?
నాదొకటే కోరిక. వచ్చే 14వ తేదీన 3 గంటలకు, హైదరాబాదు యూసఫుగూడాలోని కృష్ణకాంత్ పార్కులో జరిగే సమావేశానికి రండి. మీ సూచనలకు కార్యరూపం ఇవ్వండి.వివరాలకు ఇక్కడ చూడండి
పై మాటలు మీకు కోపం తెప్పిస్తే అది నామీద చూపండి. అంతేకాని తెలుగు భాషని బ్రతకనీయండి.అందరం కలిసి భాషని నిలుపుదాం.
Monday, December 8, 2008
తెలుగు భాషాభిమానులం - ఆరంభశూరులం!
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 10:29 PM 3 వ్యాఖ్యలు
Tuesday, November 25, 2008
తెలుగెందుకు?
తెలుగెందుకు?
ఇది మనలో చాలామందికి వస్తున్న సందేహం. ఆచార్య ఆర్వీయస్. సుందరం మైసూరు విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు, విపుల, ఆగస్టు 2007 సంచికలో దీని గురించి వ్రాసిన వ్యాసం లో చర్చించారు. దాని పూర్తి పాఠం ఇది:
ఆంధ్రప్రదేశ్ లో పాలకుల దగ్గర్నుంచి, అధికారుల దగ్గర్నుంచి, సామాన్య మధ్యతరగతి ప్రజల వరకు అడిగే ప్రశ్న ‘తెలుగెందుకు’ అని. ప్రపంచీకరణ సందర్భంలో, ప్రపంచమంతా ఒక్క గ్రామమైపోతున్న తరుణంలో, అంతర్జాలం (ఇంటర్నెట్) యువతపై పెత్తనం చలాయిస్తున్న సమయంలో తెలుగును పట్టుకొని వేళ్ళాడడం అసమంజసమని కొందరి అభిప్రాయం. ఉద్యోగావకాశాల కోసం, సాంకేతికవిద్యలను అభ్యసించటం కోసం, పర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్ళటం కోసం ఇంగ్లీషు చదవక తప్పదని వీరు వాదిస్తుంటారు. ఇవన్నీ మామూలు మనిషికి నిజమే అనిపిస్తాయి. పిల్లల భవిష్యత్తుని అడ్డుకోవటం తగదనీ అనిపిస్తుంది. శ్రీమంతులు, విద్యాధికులు, ఉన్నత వర్గాలవారూ ఎలాగూ తమ పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమంలో, ప్రయివేటు పాఠశాలల్లో చదివిస్తారు కాబట్టి తెలుగు కావాలనటం కేవలం బడుగు వర్గాలకే అన్వయిస్తుందని అనేవారూ ఉన్నారు. ఇదీ నిజమే. ఈ అన్నిటినీ ఆలోచించే ‘తెలుగెందుకు’ అన్నదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.నేను ఆంధ్రప్రదేశ్ వెలుపలికి వచ్చి సరిగ్గా నలభై అయిదు ఏళ్ళయింది. నిజానికి నాకు తెలుగు అవసరం లేదు. ‘ఆంధ్రప్రదేశ్ బయట ఉన్నాడు కాబట్టే ఇతను ఎప్పుడూ తెలుగు, తెలుగు అంటుంటాడు’ అని కూడా కొందరు నన్ను ఎద్దేవా చేశారు. ‘నువ్వెక్కడో మైసూరులో ఉన్నావు. నీకు తెలుగు ప్రాచీన భాష అయితే ఏంటి? కాకపోతే ఏంటి? నీ పని నువ్వు చేసుకుని ఊరకుండరాదా’ అని నన్ను ఒక ప్రముఖ భాషాశాస్త్రవేత్త చీవాట్లు కూడా పెట్టారు. అయినా నేను తెలుగు గురించి మాట్లాడటం మానలేదు, మానను కూడా. ఎందుకంటే ప్రపంచంలో తెలుగుభాషకు దక్కాల్సిన గౌరవాన్విత స్థానం దక్కలేదు. తెలుగు భాషకుండే అర్హతలను బట్టి దానికి ఇంకా ఎంతో ఉన్నతస్థానం దొరకాల్సింది. కాని మన పాలకులకు తెలుగుభాష ఔన్నత్యాన్ని గురించిన అవగాహన లేకపోవటం వల్ల భాషా సంస్కృతుల పట్లగాని, వాటిని కలిగిన ప్రజల పట్లగాని వారికి ఏ మాత్రం గౌరవం లేకపోవటం వల్ల తెలుగుకు ఈ దుస్థితి పట్టింది.
ఇంగ్లండులోనే ఇంగ్లిష్!
ప్రపంచంలో ఒక్క ఇంగ్లీషు భాష మాత్రమే ఉందనుకోవటం మన మూర్ఖత్వం. ప్రపంచంలో అందరూ ఇంగ్లీషు వల్లనే అభ్యున్నతి సాధిస్తున్నారని భావించటం ఇంకా మూర్ఖత్వం. వీళ్లకు ప్రపంచమంటే అమెరికా మాత్రమే. అమెరికా పాలకులు ఏ తాళం వేస్తే దానికి గంతులెయ్యటం ఒక్కటే వీళ్లకి తెలిసింది. ఇంగ్లండులో తప్ప మరే ఐరోపా దేశంలోనూ ఇంగ్లీషు చదవరు. ఫ్రెంచి, జర్మను, స్విస్, ఫిన్నిష్, ఐరిష్ లాంటి భాషలే అయా దేశాల అధికార భాషలు. స్పానిష్, జపనీస్, రష్యన్, చైనీస్ భాషల వాళ్లు కూడా సాంకేతిక విద్యతోసహా వాళ్ల భాషలోనే చదువుతారు. భారతదేశం నుంచి అక్కడికి చదువుకోసం వెళ్లేవాళ్లు ఆ భాషల్ని నేర్చుకుంటారు.
మనుషులు బతకటానికి చదువొక్కటే చాలదు. పరిపాలన అంటే చదువు మాత్రమే కాదు. ప్రజలకు తెలియాల్సినవి, ప్రజలు అనుసరించాల్సినవి వందల విషయాలున్నాయి. కోట్ల మంది ప్రజలున్నప్పుడు ఆ ప్రజలు మాట్లాడే భాషలోనే వ్యవహారమంతా జరగాలి. అప్పుడే పరిపాలన సార్థకమవుతుంది. ఈ విషయాన్ని సి.పి.బ్రౌన్ లాంటి ఇంగ్లీషు పాలకులు కూడా అర్థం చేసుకున్నారు. కాని మనవాళ్లనుకొనే ఈ పాలకులకు మాత్రం అర్థం కావటంలేదు.
బోగస్ విద్యా విధానం
మన మాతృభాషకాని, మనకు అర్థంకాని సంస్కృతం, ఫ్రెంచి లాంటి భాషల్ని విద్యావిధానంలో భాగంగా చేసి వాటిని చదవకున్నా 90-100 మార్కులు వేసి, మా పిల్లలు తెలివిగలవాళ్లని చెప్పే బోగస్ విద్యావిధానం ప్రపం చంలో మరెక్కడయినా ఉందా? ఇంత ప్రాథమిక విషయమైనా అర్థంకాని ఈ విద్యావేత్తల్ని, అధికారుల్ని, పాలకుల్ని ఏమని పిలవాలి? ప్రపంచంలో 15 కోట్ల మంది మాట్లాడే ఒక భాషని ఇంతగా అవమానపరచటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? తెలుగువాడు ప్రతి ఒక్కడూ సిగ్గుతో తలవంచుకోనక్కర లేదా?
‘తెలుగు సాహిత్యం చదివితే ఒరిగేదేముంది’ అని ప్రశ్నించే ప్రబుద్ధులున్నారు. నిజమే. షేక్ స్పియర్ ని, మిల్టన్ ని, బెర్నార్డ్ షాని, రవీంద్రుడ్ని, ప్రేమ్ చంద్ ని చదివితే మనిషవుతాడు కాని నన్నయని, తిక్కనని, వేమనని, గురజాడని, శ్రీశ్రీని చదివితే లాభమేముంది? మనిషికి కావలసింది సాంకేతిక విద్య మాత్రమే. భౌతిక లాభాలు మాత్రమే అని భావించే వాళ్లుండబట్టే మన సమాజం రోజురోజుకీ దిగజారిపోతోంది. మానవ సంబంధాలు నాశనమై పోతున్నాయి.
మనిషిని కాపాడలేని విద్య, భౌతిక అవసరాలు, ఉద్యోగాలు ఏంచేసుకోవడానికి? ఏ విద్య చదివినా దానితోబాటు మానవతాగుణాల్ని కాపాడుకునేట్లు చేయాలంటే భాష, సంస్కృతి, సాహిత్యం అవసరమే. ఇది గుర్తించలేనప్పుడు మన విద్యావిధానమంతా వ్యర్థమే అవుతుంది.
ప్రపంచ స్థాయి భాష
ఇన్ని చెప్పిన తర్వాత ‘తెలుగెందుకు’ అనే ప్రశ్నకే మళ్ళీ వచ్చి దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది.
1. తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మాట్లాడే భాష. అక్కడ ఏడున్నర కోట్లమంది తెలుగు మాట్లాడుతుంటే అదే సంఖ్యతో ఇతర ప్రాంతాలలో తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఇంతమంది మాట్లాడే భాషలు ఐదారుకు మించిలేవు. అందువల్ల ఈ భాషని ప్రపంచస్థాయి భాషగా గుర్తించి దానికి తగిన స్థానాన్ని సంపాదించటం మన కర్తవ్యం.
2. భారతదేశంలో అనుసంధాన భాషగా హిందీని గుర్తించాం. నిజానికి హిందీ ఎక్కువమందికి అర్థమయ్యే భాష అనడం సమంజసం. హిందీ తెలిసిన వారిలో చాలామంది మాతృభాష వేరే ఉంటుంది. కాని తెలుగు విషయం అలా కాదు. తెలుగు మాట్లాడేవారే ఈ దేశంలో పదిహేను కోట్లమంది ఉన్నారు. అలాంటప్పుడు ఆ భాషకి జాతీయస్థాయిలో అధికార భాషగా స్థానం దక్కాలి. మన దురదృష్టం ఏమిటంటే పార్లమెంటులో తెలుగులో మాట్లాడితే దాన్ని అనువాదంచేసే దిక్కుకూడా లేదు. ఇలాంటి పరిస్థితిని గంభీరంగా పరిగణించే ప్రజాప్రతినిధులు లేకపోవటం మన దురదృష్టం.
3. మాతృభాషలో విద్య నేర్చుకుంటే చక్కగా అవగాహన అవుతుందని ఐక్యరాజ్య సమితితో సహా ఎంతోమంది నిపుణులు చెప్పారు. అయితే ఒకటో తరగతి నుంచే ఇంగ్లీషును ఇంజెక్ట్ చేస్తే మన పిల్లలు బాగుపడతారనుకునే అజ్ఞానంలో మనమున్నాం. కనీసం ఉన్నత పాఠశాలవరకైనా తెలుగులో చదువుకొని, తర్వాత తెలుగు వాడకాన్ని తెలుసుకునేలా చదివితే అలాంటివారి వల్ల తెలుగు వారికి ఉపయోగముంటుంది. అంతేకాని తెలుగువారందరినీ విదేశాలకు ఎగుమతిచేసి తెలుగువారికి మాత్రం ఏమీ మిగల్చకూడదనుకునే విద్యావేత్తలను ఏమనాలో అర్థంకావటంలేదు. ఇంగ్లీషు నేర్చుకోవటం, ఉద్యోగాలు సంపాదించటం వేరు, ఇంగ్లీషులోనే నేర్చుకోవటం వేరు. ఇంగ్లీషు నేర్చుకోవద్దని ఎవరన్నారు? బాగా నేర్చుకోండి. కాని తెలుగు వారి కోసం తెలుగును నేర్చుకోండి, తెలుగును తెలుసుకోండి
4. ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అన్న శ్రీ కృష్ణదేవరాయలకు ఉన్నపాటి పరిజ్ఞానం ఇన్ని వందలఏళ్ల తరువాత కూడా మన పాలకులకు లేదంటే మనమేమనుకోవాలి? దేశంలో ఉండేది తెలుగు వాళ్ళయినప్పుడు వాళ్లకు తెలుగులోనే చెప్పాలి, పరిపాలించాలి, విద్య నేర్పించాలి అన్నది ప్రాథమిక సూత్రం. అంతేకాదు ఏవిధంగా చూసినా తెలుగుకు సామర్థ్యం ఉన్నది అన్న విషయం గమనించాలి. భాషలో అక్షరాలున్నాయి, పదాలున్నాయి, ఏ భావాన్నయినా వ్యక్తం చేసే సామర్థ్యం ఉంది, ఎలాంటి విషయాన్నయినా ఇముడ్చుకునే శక్తి ఉంది - అలాంటప్పుడు ఆ భాషను సమర్థంగా ఉపయోగించుకోవలసిన కర్తవ్యం మనమీదుంది.
5. ప్రపంచంలో అప్పటికప్పుడు జ్ఞానం వృద్ధి అవుతుంది కదా? మరి, దాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అని ప్రశ్నించవచ్చు. ఇది తెలుగువారి సమస్యకాదు. ప్రపంచంలో జ్ఞానమంతా ఇంగ్లీషులో రాదన్నది ముందు తెలుసుకోవాలి. ఎంతోమంది మేధావులు, సాహితీవేత్తలు, విజ్ఞానులు, తత్వవేత్తలు జర్మన్ లో, ఫ్రెంచ్ లో, స్పానిష్ లో తమ జ్ఞానాన్ని వెలువరిస్తారు. అది ఎప్పుటికప్పుడు ఇంగ్లీషులోకి వస్తుంది. అలాంటి సౌకర్యాన్ని తెలుగువారికి కూడా కలుగజెయ్యాలి. అప్పుడే తెలుగు కూడా అభివృద్ధి చెందుతుంది. విస్తృత ప్రాతిపదిక మీద అనువాద అకాడమీ ఒకటి ఏర్పడాలి. ప్రతి ఒక్క విషయమూ వెంటనే తెలుగులో వెలువడేలా చెయ్యాలి. మనవారు తెలుగులో విద్య, విద్యాబోధన, పరిశోధన, పరిపాలన, ముఖ్యంగా ఆలోచన, అభివ్యక్తి జరిపేలా చేసినప్పుడు మనవారు ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశముంటుంది.
Labels: ఇంగ్లీషు, తెలుగు, విద్యావిధానం
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 10:45 PM 6 వ్యాఖ్యలు
Sunday, October 26, 2008
అభినవ నరకాసురులు
ఆ నాడు దివ్య వరాలను పొందిన నరకాసురుడు లోక కంటకుడై ప్రజలను బాధ పెట్టేడు. చివరకు శ్రీ కృష్ణుని దయ వలన నరకాసుర వధ జరిగి ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు. కాని ఇది కలియుగం. ఈ అభినవ నరకాసురుల భరతం ఎవరు పడతారు? వీళ్ళంతా ప్రజాప్రభుత్వ ముసుగులో దేశాన్ని దోచుకుంటున్న దోపిడీ దొంగలు. ఫూర్వం రాజులు యుద్ధాలు చేసి వేరే రాజుల రాజ్యాలను ఆక్రమించే వారు. కాని ఈ ముసుగు దొంగలు ప్రజల భూములనే ఆక్రమిస్తున్న ఘనులు. చేనే కంచ మెయ్యడమంటే ఇదే. ఆనాడు ఋషులు మోక్షం కోసం, ప్రజాహితం కోసం యజ్ఞాలు చేస్తే, ఈ నాడు పాలకులు తమ ఆస్తులను పెంచుకోటానికి వేల కోట్లతో ప్రజా ధనంతో ధన యజ్ఞాలను చేస్తున్నారు. ఇప్పటికే నడ్డి విరిగి బాధలపాలైన మధ్యతరగతి, బీద ప్రజలను ఈ నరకాసురుల బారినుండి కాపాడేదెవరు?
ఈ కార్యక్రమానికి దివినుండి ఏ దేవుడూ ఈ భువికి రాడు. ప్రజలే పూనుకోవాలి. కాని ప్రస్తుత పరిస్థితులలో ప్రజలకు ఇది సాధ్యమయే పని కాదు, కారణం, దారుణంగా వరుస మానభంగాలకు లోనైన ప్రజాస్వ్యామ్య వ్యవస్థ, ఓటు హక్కుని దుర్వినియోగం చేసిన, అసలే ఓటు హక్కుని వాడుకోని ప్రజలు. ఓటర్ల లిస్టులనుకూడా సరిగా తయారుచేయలేని నిర్వీర్యమైన ఎన్నికల సంఘం.
అంటే ఈ భూబకాసుర నరకాసురులను అంతమొందించాలంటే, చిన్న బకాసురులను ప్రజలు ఆశ్రయించక తప్పదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల బారిన పడి నశించక తప్పదు అన్నట్టు చిన్నాచితక రాజకీయ పార్టీలు ఉమ్మడి దాడి చేసి విషసర్పాన్ని అంతమొందించాలి. ఈ చిన్న పార్టీలనబడే రాజకీయ చలిచీమలు కూడా కుడతాయి. కాని ప్రస్తుతానికి ఏం చేస్తాం తప్పదు మరి.
అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎవరి దారి వారివన్నట్టు వ్యవహరిస్తున్నాయి. తమ పార్టీల ప్రధాన లక్ష్యం తెలంగాణా సాధనే అయినా తెలంగాణా పార్టీలు ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకోవడం లేదు. అన్ని ప్రతిపక్ష పార్టిలు కోరేది కాంగ్రస్ ఓటమే అయినా అవి కలిసే సూచనలు లేవు. కొత్తగా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ పుట్టె ముంచేటట్టు ఉంది. అభిమాన సంఘాల అండదండలతో, మూడో కుల పార్టీగా ముద్ర వేసుకొని అందలమెక్కాలన్న దానికి రాజకీయాల అనుభవం సున్నా. పైగా అభిమాన సంఘాలు "సూపర్, సూపర్" అని సినిమాలను నూరు రోజులు నడపడానికి పనికొస్తాయేమో గాని, "చిరు" పార్టీని గెలిపించి హీరోని సింహాసనం ఎక్కిస్తాయన్నది ప్రశ్నార్ధకమే! అవినీతిని అంతమొందిస్తామన్న ఆ పార్ట్తీలో అప్పుడే ఇతర పార్టీల లోని అవినితిపరులు చేరిపోతున్నారు. ఈ విధంగా ఆ పార్టీ తను పవర్ లోకి వస్తుందో లేదో కాని ఇతర పార్టీలను ముంచటానికి పనికి రావచ్చు.
పైవన్నీ అధికార పార్టీకి అక్కరకు రావచ్చు. కాని దానికి పాలించే సభ్యుల సంఖ్య రాకపోవచ్చు. తెలంగాణా సమస్య నెత్తికు చుట్టుకొని దాని ఆశలు నిరాశే కావచ్చు. పైగా ఐదేళ్ళ నిర్వాకం ఉండనే ఉంది. ఇందిరా గాంధి, రాజీవు గాంధి బొమ్మలకు ఓట్లు రాలే కాలానికి ఎప్పుడో చెల్లు చీటీ రాసేశారు. సోనియాకు అవసరార్ధం కాంగ్రెసు వాళ్ళు జై కొట్టాలి గాని ప్రజలు చీ కొట్టే పరిస్థితే.
ఇదంతా చూస్తూ ఉంటే, నరకాసుర వధ ఎవరు చేస్తారు, ఎలా జరుగుతుంది అన్నది మంచి రక్తి కట్టే సీనే.
Labels: చిరు పార్టీ, నరకాసురుడు
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 11:49 PM 5 వ్యాఖ్యలు
Saturday, August 2, 2008
తాగితే తప్పేముంది?
"పూటుగా తాగించండి" ఎక్సైజ్ శాఖకు సీఎం ఆదేశాలు
"ఇంతేనా.. జనం తాగడం లేదా? ఇంకా తాగించండి’’ ఇవీ ఎక్సైజ్ శాఖాధికారులకు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నుంచి అందిన ఆదేశాలు. దీనికి అధికారులు రెట్టించిన ఉత్సాహంతో... వచ్చేనెల నుంచి మద్యం అమ్మకాలు మరింత ఊపందుకుంటాయని సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికానికి సంబంధించి ఎక్సైజ్‌శాఖకు విధించిన రూ.1031 కోట్ల లక్ష్యంలో రూ. 1170 కోట్లు ఆదాయం లభించి లక్ష్యంలో కన్నా 113 శాతం ఆదాయం పెరిగింది.అయినా ఎక్సైజ్ ఆదాయం మరింత పెరగాలని.. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమ పథకాల( ఎవరి సంక్షేమం?) అమలుకు కావల్సిన నిధులకు ప్రధానవనరు ఎక్సైజ్‌శాఖేనని తెలిపారు. ఈ శాఖ కష్టపడి పనిచేస్తే వాణిజ్యపన్నుల శాఖ కూడా ఆదాయాన్ని పెంచుకుంటుందన్నారు. జూలై నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చి దుకాణాల లైసెన్స్ ఫీజులు పెరిగి మద్యం అమ్మకాల కన్నా రెంటల్స్ ఎక్కువ వచ్చాయి. దీన్ని అధికారులు ఎక్సైజ్ ఆదాయంగా చూపించారు. ఇది సరి కాదని, మద్యం అమ్మకాల ఆదాయం పెంచాలని ఆయన సూచించారు.
బీరు తప్ప మిగతా బ్రాండ్ల అమ్మకాలు తక్కువగా ఉండటంతో ఆదాయం తగ్గిందని అధికారులు వివరించారు. త్రైమాసిక లక్ష్యం రూ. 5660 కోట్లయితే సాధించింది రూ. 5410 కోట్లు. గత ఏడాది కన్నా 22శాతం పెరిగినా, లక్ష్యంలో 95శాతమే సాధించడంతో ఆదాయమార్గాలను మెరుగుపరచుకోవాలని సూచించారు.
ఇదీ ఏలినవారి నిర్వాకం! పూటుగా మందు పట్టించేసి సంక్షేమ పధకాల గురించి మాట్లాడటానికి సిగ్గూ లజ్జాలేని ప్రభుత్వం.
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 11:39 PM 0 వ్యాఖ్యలు
Thursday, July 31, 2008
అసలే కోతి, దానికి తోడు నిప్పులు తొక్కింది
ఇది ఒక మంత్రి సోదరుని వీరంగం గాధ
రెండు రోజుల క్రితం రవాణా శాఖ కార్యాలయంలో వీరంగం చేసిన మంత్రి దివాకర రెడ్డి తమ్ముడు ప్రభాకర రెడ్డి ఉదంతం రసవత్తరమైన మలుపు తిరిగేటట్టుంది. తన ట్రావెల్స్ బస్సును సీజ్ చేసారన్న అక్కసుతో ప్రభాకరరెడ్డి అదనపు రవాణా కమిషనర్ సి.ఎల్.ఎన్.గాంధీపై నిప్పులు చెరగి నోటికొచ్చిన దుర్భాషలాడేరు. నిప్పులు తొక్కిన్ కోతిలా గెంతి నీ అంతు చూస్తా, ఒరేయ్, నా కొడుకా .... అంటూ ఊగి పోయారు. నీ యబ్బ.. నాబస్సులే సీజ్ చేస్తారా, వాడెబ్బ వాడొస్తే సంతకాలు చేస్తారా, మేం దొంగలమయ్యామా? మావి దొంగ బస్సులా ? వాటినిక్కడే తగలబెడతా! ఏమనుకుంటున్నారు, మీరు? కేశినేనితో ’గాంధీ’ కుమ్మక్కయ్యాడంటూ చిందులు తొక్కారు.
తర్వాత కార్యాలయం మెట్లపైనే ధర్నా చెయ్యడం, కమిషనర్ బుజ్జగించడంతో విరమించడం జరిగింది. అసలు కధ ఇక్కడే ప్రారంభమయింది. ప్రభాకరరెడ్డి ప్రవర్తనపై ఆగ్రహించిన ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. నిజానికి టివీలో ఈ ఉదంతం చూసిన ఎవరికైన జుగుప్స కలగడం సహజం. నిప్పులు తొక్కిన కోతిలా గెంతుతూ ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు వాగడం, విధినిర్వహణలో ఉన్న అధికారులను దూషించడం సహించరాని విషయం. TV 9 వారు నిన్న తమ ప్రోగ్రాంలో ఈ విషయంపై చర్చ జరుపుతూ, పనిలోపనిగా దేశ రాజధాని నుండి అప్పుడే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన మందకృష్ణమాదిగతో టెలిఫోన్ సంభాషణ జరిపేరు. ఇప్పటికే ఇటువంటి విషయాలలో ఆరితేరిన ఆయనకు విషయం విశదీకరించి ఇది కులం పేరుతో దూషించడం క్రింద వస్తుంది కాబట్టి ప్రభాకరరెడ్డిపై చట్టపరమైన ఎటువంటి చర్య తీసుకో వచ్చని అడిగేరు.ఈ సంభాషణ వింటూవుంటే మందకృష్ణ కన్నTV9కే ఎక్కువ ఉత్సాహం ఉన్నట్టు అనిపించింది. ఇక మందకృష్ణునికి చేతినిండా పనే. TV9 కి కావల్సినంత కాలక్షేపం!
Labels: commissioner, transport
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 7:49 AM 1 వ్యాఖ్యలు
Saturday, July 19, 2008
హస్తినలో బొమ్మలాట
అణు ఒప్పందం ధర్మమా అని దేశ రాజధానిలో దసరా రాకుండానే బొమ్మలాట ప్రారంభమయింది. ఒక పక్క కాంగ్రెసు అధినేత సోనియా, దేశ ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ , రెండవ ప్రక్క ఎన్.డి.ఏ, యు.ఎన్.పియే, ఉభయ కమ్యునిస్టు పార్టిలు, బి.ఎస్.పి వగైరా పార్టీల అధినేతలు ఈ ఆటని రక్తి కట్టిస్తున్నారు. చిన్నా చితక పార్టీల సభ్యుల, స్వతంత్రుల గిరాకీ అమాంతంగా మన రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న భూముల రేట్ల లాగా పెరిగిపోతోంది. మామ్మోలు టైమప్పుడు గోళ్ళు గిల్లుకుంటూ ఎవరికీ పట్టని వీరు ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు. వీళ్లని పెద్ద పార్టీల వాళ్ళు పోలీసు కుక్కల్లాగా ఎక్కడ దాంకున్నారో అని వేటాడి మరీ వెతుకుతున్నారు. చివరకు మర్డర్లు చేసి జైల్లలో ఉన్న వాళ్ళు, చావు బ్రతుకుల మధ్య ఊగులాడుతూ ఆసుపత్రులలో ఉన్న వాల్లనీ బొమ్మల కొలువుకు తేవాలని నిర్ణయించేసారు. వీళ్ళందరినీ బుజ్జగించడానికి గెడ్డాలే కాదు, కాల్లేనా పట్టుకుందుకు వెరవటం లేదు. పూర్వం కప్పల్ని తూచటానికి ఎవడో ప్రయత్నించేడట. ఒకకప్పని త్రాసులో పెడుతూ ఉంటే ఇంకో కప్ప కిందకి గెంతేదట. వీళ్ళ వ్యవహారం కూడా కప్పల తక్కెడ మేళం లాగా తయారయింది. ఎవరు ఎప్పుడు ఎటు గెంతేస్తారో తెలీకుండా ఉంది.
ఒకరు ముఖ్యమంత్రిని చేస్తామంటే, ఇంకొకరు ప్రధానమంత్రిని చెయ్యటానికి అభ్యంతరం లేదంటున్నారు.మీ దివంగత తండ్రిగారి పేరు ఓ విమానాశ్రయానికి పెట్టి మీ చిరకాల కోర్కె తీరుస్తామని ఒకరంటే, మీ మీద ఉన్న పాత కేసులు మాఫీ చేస్తామని ఇంకొకరు. సందట్లొ సడేమియా అని మన చంద్రశేఖర్ గారు తెలంగాణా ఇస్తామంటే మా రెండున్నర ఓట్లూ మీకే అంటే, తెలిసో, తెలీకో సోనియమ్మ "జై ఆంధ్రప్రదేశ్" అని మొన్నటి సభలో జై కొట్టి టీఆరెస్ ఆశలమీద నీళ్ళు పోసేసింది. ఇంతకమునుపోసారి డబ్బు సంచులు పుచ్చుకొని ఓటేసిన ఒక సిగ్గు,శరం లేని పెద్దమనిషి డబ్బు సంచులా, ముఖ్యమంత్రి పదవా అని ఇటూ అటూ ఊగిలాడి ప్రస్తుతానికి డబ్బు వైపే మొగ్గు చూపేరు. రాష్ట్రరాజకియాలలో చుక్కెదురైన ఒక మాజీ ప్రధాన మంత్రిగారు తన అదీనంలో ఉన్న మూడోట్లూ ఎటువెయ్యాలా అని గురక పెట్టి నిద్రపోతూ మరీ అలోచించేస్తున్నారు. వ్యూహ, ప్రతివ్యూహాలతో రాజధానిలో బొమ్మలాట రంజుగా తయరైంది.
చిన్నపిల్లలు బొమ్మలాట సరదాకి ఆడుకుంటారు. హస్తినలో మన ప్రజాప్రతినిధులది స్వార్ధపూరిత రాజకీయ బొమ్మలాట. అది వాళ్ళకి సరదా. దేశానికి అరిష్టం.
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 8:16 PM 0 వ్యాఖ్యలు
Friday, July 18, 2008
ఆఫ్ లైన్ బ్లాగ్ ఎడిటర్స్
ఇంటర్ నెట్ కనక్క్షన్ లేకుండా బ్లాగు పోస్టు తయారుచేసుకోవడం
బ్లాగ్ ఎడిటర్ లో ( బ్లాగ్ స్పాట్, వర్డ్ ప్రెస్ వగైరా) నేరుగా టైప్ చేస్తున్నప్పుడు మీ ఇంటర్నెట్ కనక్షన్ పోతే బ్లాగు పోస్ట్ లో వ్రాసినదంతా గాలిలోకి పోయి ప్రాణం ఉసూరుమంటుంది కదూ. ఇలా కాకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక " ఆఫ్ లైన్ బ్లాగ్ ఎడిటర్" వాడక తప్పదు. అంతే కాదు. సునాయాసంగా బ్లాగు పొస్ట్ లో మీరు ఉంచిన బొమ్మలు గాని, వీడియోలుగాని ఆఫ్ లైన్ బ్లాగ్ ఎడిటర్ లోని పబ్లిష్ బటన్ నొక్కి బ్లాగుతో బాటు అప్ లోడ్ చెయ్యవచ్చు. మీరు సగం వ్రాసిన బ్లాగుని భద్రపరచుకొని తరువాత మీకు వీలుచిక్కినప్పుడు పూర్తి చేసి పబ్లిష్ చెయ్యవచ్చు. నెట్ కనక్షన్ పైన ఆధారపడటం లేదు కాబట్టి, బ్లాగు వ్రాసే పని తొందరగా చెయ్య వచ్చు. మీరు ఒకటికన్న ఎక్కువ బ్లాగులను ఒకే సారి తయారుగా చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ ఎడిటర్లు " కాపీ పేస్ట్" ప్రక్రియనూ బలపరుస్తాయి.
ఇక కొన్ని ఫ్రీ ఆఫ్ లైన్ బ్లాగ్ ఎడిటర్స్ గురించి.
1. "Windows Live Writer" : దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి .యూనికోడ్ సపోర్ట్ చేస్తుంది. అయితే దీనివి గొంతెమ్మ కోరికలు. దీనికి కావలసినవి:ఆపరేటింగ్ సిస్టం విన్డోస్ విస్టా గాని, ఎక్స్ పి ( సర్వీస్ పేక్ 2) తో
విన్డోస్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 6 సర్వీస్ పేక్ 1, ఆపైనా
విన్డోస్ ఇన్స్టాలర్
ఇవన్ని కొంచెం పెద్ద ప్రోగ్రామ్స్. ఇన్స్టల్లేషన్ కి నెట్ కనక్షన్ కావాలి.
ఒకసారి ఇన్టాల్ అయితే బాగానే పనిచేస్తుంది. కాని ఫైర్ ఫాక్స్ తో పనిచెయ్యదు.
క్రింది లింకులనుండి విండోస్ లైవ్ రైటర్ కి కావాల్సిన ప్రొగ్రామ్స్ డౌన్ లోడ్ చేసుకోండి.
1. Windows Installer:
http://www.softwarepatch.com/windows/wininstallnt.html
2. .NET Framework:
http://www.filehippo.com/download_dotnet_framework_3/
3. Windows Live writer:
http://get.live.com/WL/config_all
ముందుగా (1), (2) ఇన్స్టాల్ చేసుకొని తరవాత లైవ్ రైటర్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
2. Post2blog: ఇది చాలా చిన్న ప్రోగ్రాం. Windows Live Writer లా దీనికి గొంతెమ్మ కోరికలు లేవు. ఆపరేటింగ్ సిస్టం విన్డోస్ ఎక్స్ పి, 2000 అయితే చాలు. ఇన్స్టల్లేషన్ చాలా సులభం. యూనికోడ్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి అకౌంట్ సెట్ చేసుకుంటే చాలు.
బ్లాగ్ పోస్ట్ draft గా గాని, లేక సరాసరి పబ్లిష్ గాని చెయ్యవచ్చు. మన కంపూటరులో భద్రపరచుకోవచ్చు.బ్లాగులో బొమ్మలు ఉంచ వచ్చు. వీడియో కావాలంటే మాత్రం draft గా అప్ లోడ్ చేసి బ్లాగ్ ఎడిటర్ లో జతచెయ్యాలి. ఇది అన్ని విధాలా ఏ బాదరబందీ లేని ప్రోగ్రాం.
3. Scribefire: ఇది ఫైర్ ఫాక్స్ కి plugin. మన బ్లాగు వివరాలు నెట్ ద్వారా తీసుకున్నాక మాత్రమే ఇది off line లో పనిచేస్తుంది. ఎడిట్ చేసిన బ్లాగు పోస్ట్ ను తిరిగి నెట్ ద్వారా మన బ్లాగులో డ్రాఫ్టుగా భద్రపరచుకోవచ్చు. అయితే మన కంపూటరులో భద్రపరచుకోలేం.అంటే ఇది పూర్తిగా off line ఎడిటర్ అని చెప్పలేం.ఇవి కాక w.blog, blogdesk, flock కూడా ఉన్నాయి. అయితే అవి యూనికోడ్ ని బలపరచవు, కాబట్టి తెలుగు టైప్ చెయ్యటానికి ఉపయోగపడవు. నా ఉద్దేశంలో blog2post మనకు అన్ని విధాలా సరిపోతుంది. ప్రయత్నించి చూడండి. దీనిని http://bytescout.com/post2blog.html నుండి డౌన్ లోడ్ చేసుకోండి.
మీ బ్లాగింగ్ సుఖమయమగు గాక!
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 10:32 PM 1 వ్యాఖ్యలు
Monday, July 14, 2008
అయ్యో పాపం పసివాడు
సాక్షి దినపత్రికలో ఆదివారం ఏసుక్రీస్తును కించపరిచేలా ఉన్న చిత్రం ప్రచురితం కావడంపై రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు నిరసన వ్యక్తంచేశారు. ఒకచేతిలో సిగరెట్టు, మరోచేతిలో మద్యం గ్లాసు ఉన్నట్లు ఏసుక్రీస్తు చిత్రాన్ని ప్రచురించడం క్రైస్తవులను అవమానించేలా ఉందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ క్రైస్తవ సంఘాలు సాక్షిపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. వెంటనే పత్రిక ఛైర్మన్ జగన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి.పత్రిక ఛైర్మన్ జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు.కొన్ని చోట్ల సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేసారు.
అసలే వైస్ పైన గుర్రుగా ఉన్న "ప్రజా శాంతి పార్టీ" వ్యవస్థాపకుడు కె.ఆనంద్‌పాల్ గారు "తప్పుచేసిన వారికి క్షమించే గొప్పగుణం ప్రభువుకు ఉందని, అయితే ప్రభువు ఆత్మను కించపరిచినా, క్షోభపెట్టిన వారికి క్షమాపణ లేదనే విషయాన్ని బైబిల్ స్పష్టం చేసిందన్నారు. ఇది పొరపాటుగా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభువును ఒక వ్యసనపరుడిగా చిత్రించడం క్షమించరాని మహాపరాధంగా పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం, విలేకరులపై కేసులు పెట్టారని, ఇప్పుడు కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన సాక్షి పత్రిక ఎండీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. "
"ప్రభువా! క్షమించు" అంటూ పత్రికాధిపతి జగన్ సాక్షి 14వ తేదీ పత్రికలో వాపోయాడు.
తాజా వార్త ఏమిటంటే, తెలుగుదేశం ఎస్.సి సెల్ జగన్ పైన, మిగిలిన సాక్షి సంబంధిత అధికారులపైనా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
ఇదంతా చూస్తూ ఉంటే ఆనాడు, ఈ జగన్ పైసాచికానందంతో ఆంధ్రజ్యోతిపై విసిరిన విసుర్లు జ్ఙాపకం వస్తున్నాయి. ఆనాడు ఈ వైస్ పుత్రుడు "బాడుగ నేతలు అంటూ దళితుల మనోభావాలు దెబ్బతీసినందుకే ఈ పరిస్థితి వచ్చింది. పత్రికలు మనం రాస్తున్న వార్తలు సరైనవేనా అని ప్రశ్నించుకోవాలని "అన్నాడు. ఇంకా ముందుకు పోయి "ఒకరిపై బురద జల్లే హక్కు మనకు లేదని, ఉన్నది ఉన్నట్లు రాయటమే మన భాద్యతని ఆయన పత్రికలకు నీతులు చెప్పేడు. మరి వీరు ఉన్నది ఉన్నట్టే చూపేరా? కళ్ళుమూసుకొనే కదా ఈ పని చేశారు! ఇది గురివింద గింజ సామెతలా ఉంది. అసలు తనేంటో, ఈ వైభవం వెనుక కధేంటో ప్రభువు సన్నిధిలో ప్రశ్నించుకోవాలి.
పసివాడా! అయ్యో పాపం పసివాడా! ఎరక్కపోయి అన్నావే ఇరుక్కుపోయావే!
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 10:30 PM 7 వ్యాఖ్యలు
Saturday, July 12, 2008
పోలీసు పిల్లుల చెలగాటం - అమాయికునికి ప్రాణ సంకటం
గత రెండు నెలలనుండి మీడియాకి మేత అందించిన ఆరుషి హత్యోదంతం, యూపీ పోలీసుల నిర్వాకం చూసేక నాకు పాత తెలుగు సినిమాలలో మనం చూసే ఓ సీను గుర్తుకి వస్తోంది. గ్రామంలో నీళ్ళు పట్టుకుందుకి ఓ మధ్య వయస్కురాలు బావి వద్దకువస్తుంది. ఆవిడ ఓ పెద్ద న్యూస్ చానల్. నోటికేమొస్తే అది వాగడం ఆవిడకి పుట్టుకతో వచ్చిన విద్య. "సూరమ్మొదినా ఇది విన్నావా. ఆ మాయదారి మహలక్ష్మి కూతురు పాలేరు రంగయ్యతో సరసాలాడుతోందిట. ఎప్పుడో వాల్లిదారూ లేచిపోవడం ఖాయం. అసలు వాళ్ళ వంశమే అంత. మహలక్ష్మి ముత్తాతకి ఇంటి పనిపిల్లతో సంబంధం ఉండేదట." ఇలా సాగిపోతుంది ఆవిడ వాగ్ధాటి. అలాగా అని ముక్కుమీద వేలేసుకోవటం అక్కడున్న అమ్మలక్కల వంతు. యూ.పీ పోలిసులు, మీడియాది ఇదే తంతు.
కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే తామే న్యాయముర్తులుగా వ్యవహరించి నిందుతులకు అప్రకటిత శిక్షలు వెయ్యడం పోలీసులకు అలవాటని సరిపెట్టుకున్నా మీడియా బుద్ధి ఏమయింది? కట్టుకధలు అల్లటం, వాటికి మసాలా దట్టించి ప్రజలలోకి వదలడం మీడియాకి అలవాటయిపోయింది. రాజేష్ తల్వార్ విషయంలోనూ ఇదే జరిగింది.
ఏభై రోజుల క్రిందట నోయిడా లోని దంత వైద్యుడు రాజేష్ తల్వార్ తన స్వంత కూతురిని హత్య చేసాడంటూ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి వాళ్ళ దగ్గరున్న సాక్ష్యం ఏమిటంటే వాళ్ళు విచారించిన కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం. ఇది చాలు మన మీడియా వాళ్ళకి. ఇంక కధలు అల్లడం మొదలు పెట్టారు.రాజేష్ తల్వార్ కి మరో డాక్టరమ్మకి అక్రమ సంబంధం ఉందని. అది తెలిసి కూతురు అతనితో వాగ్వాదానికి దిగిందని, అదే హత్యకి కారణమని ఇలా. రాజేష్ తల్వార్ భార్య తన భర్త ఈ హత్య చెయ్యలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఉత్తరప్రదేశ్ ఐ.జి గారు ప్రత్యేకంగా ఓ మీడియా సమావేశం ఏర్పరచి పై వాదనలన్నిటికీ బలం చేకూరుస్తూ ఈ కేసులో తాము ఎంత వేగంగా ముందుకు పోతున్నామో విశదీకరించారు. ఈ వార్తపై స్పందిస్తూ కొందరు సంఘసేవకులు రాజేష్ తల్వార్ ని ఉరితీయాలని, అలాచేస్తే ఇంకెవరూ ఇలాంటి దుర్మార్గాలు చెయ్యరనీ ఆవేశంగా సెలవిచ్చేరు.
అయితే, సి.బి.ఐ కీ కేసు అప్పగించాక పరిస్తితులు తారుమారయ్యాయి. వాళ్ల విచారణలో తేలిందేమిటంటే రాజేష్ తల్వార్ హత్యచేసాడనటానికి నోయిడా పోలిసుల వద్ద ఏ రకమైన ఆధారాలు లేవని, ఈ హత్యకు మూలకారకుడు రాజేష్ తల్వార్ వద్ద పనిచేస్తున్న కాంపౌండరు మరి ఇద్దరు కావచ్చని.
రాజేష్ తల్వార్ ని బెయిల్ మీద వదిలేశారు. నోయిడా పొలీసులు తమ తప్పు ఏమీ లేదని, కేసుని ఓ కొలిక్కి తెస్తున్న సమయంలో సి.బి.ఐ కి బదిలీ చేశారనీ, తాము రాజేష్ తల్వార్ ని అనుమానించేమేగాని ఏ విధమైన చార్జిషీటు అతనిపై ఫైల్ చెయ్యలేదనీ చేతులు దులుపేసుకున్నారు. అయితే అతను గత ఏభై రోజులు అనుభవించిన నరకయాతనకు బాధ్యులెవరు? స్వంత కూతురిని చంపేడన్న అపవాదు ఎలా తుడుచిపెట్టుకొని పోతుంది?సంఘంలో ఉన్న పరువు మర్యాదలు మంటగలిసేక అతను తల ఎత్తుకు తిరగగలడా? సంఘంలో ఒక అంతస్తు ఉన్న వ్యక్తికే ఇలా జరిగితే మరి సామాన్యుల మాటేమిటి? పోలిసుల చిత్రహింసలను భరించలేక తప్పు తనదేనని ఒప్పుకో వలసిందే కదా? ఒక వ్యక్తి జీవితాన్ని బజారుకు ఈడ్చిన పోలీసులకి, కట్టుకధలు అల్లిన మీడియా వాళ్ళకి శిక్షలేదా? పోలీసు, న్యాయ వ్యవస్తలలో ఉన్న కుళ్ళు, లోపాలు దీనికి కారణం కాదా? అన్ని రంగాలలోను మనం పురోగమిస్తున్నామని జబ్బలు చరచుకుంటున్న ప్రభువులు ఈ రంగంలో ఎంత వెనుకబడి ఉన్నామో గ్రహించరా? సైన్సు ఇంత పురోగతి సాధించినా పాత పద్ధతులలోనే నేర పరిశోధన జరగడం మనం సిగ్గుపడాల్సిన విషయం కాదా? వందమంది నేరస్తులను వదిలేసినా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది కాగితాలకే పరిమితమా?
ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు.
Labels: media, police, Rajesh Talwar
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 10:18 PM 4 వ్యాఖ్యలు
Sunday, July 6, 2008
భారతీయ సంస్కృతిని వెక్కిరిస్తున్న సూడోసెక్యులరిస్టులు
సెక్యులరిజానికి కొత్త భాష్యం
నిజానికి సెక్యులరిజమ్ అంటే మతాలతో ఏ విధమైన సంబంధమూ లేనిది - అది మెజారిటీ ప్రజలదైనా మైనారిటీ ప్రజలదైనా. సెక్యులర్ ప్రభుత్వం ప్రతీ వ్యక్తికీ రాజ్యాంగంలో నిర్వచించిన మౌలిక సూత్రాలకు లోబడి తాను నమ్మిన మతాన్ని ఆచరించే స్వేచ్చ యిస్తుంది. సెక్క్యులరిజం అన్నది మన భారతీయ సంస్కృతిలో పురాతనంగా వస్తూన్న సంప్రదాయమే. పరమత సహనం భారతీయ జీవనంలో ఒక అంతర్భాగంగానే ఉంది.దీనిని ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీలుగాని, మేధావులమని చెప్పుకునే విషయ పరిజ్ఙానం లేని పెద్ద మనుష్యులు గాని గొంతు చించుకొని చెప్పనక్కరలేదు.
1976 లో సవరణ చేసి సెక్యులరిజమ్ అన్న పదం చొప్పించక ముందు కూడా మన రాజ్యాంగం మతాతీతమైనదే. ఈ సవరణ వెనుక ఉన్న దుర్ణీతి త్వరలోనే బయట పడింది.
సెక్యులరిజం అన్న పదానికి విపరీత భాష్యాలను చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దాని స్వరూప స్వభావాలనే మార్చేసారు. మైనారిటీలను ఆకట్టుకొని తమ వోటు బేంకుని విస్తృత పరచుకుందుకే ఈ రాజ్యాంగ సవరణ వాడుకోవటం ప్రారంభించారు. ఈ "సూడో సెక్యులరిస్టు" పార్టీలు ఈ పదానికి వేరే అర్ధాన్ని ఆపాదించి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నాయి. సెక్యులరిజమ్ అంటే మైనారిటీలను దువ్వడం, వారికి ఏవో తాయిలాలు ప్రకటించడం అన్న భావన కలిగించేరు. వారికి మతపరంగా కొన్ని సదుపాయాలను కల్పించటం రివాజు అయిపోయింది. ఈక్రమంలో హిందూమతానికి చెందినవారిని పూర్తిగా వెనక్కినెట్టేసారు. వారికి ఏవైనా సౌకర్యాలు కల్పించడమంటే మైనారిటీలను అగౌరవపరచడం "సెక్యులరిజం" పాటించకపోవడం అన్న విపరీత అర్ధాన్ని లేవనెత్తేరు.
ఈ నాడు కాంగ్రెస్, లెఫ్ట్ మరియు వాటి తోక పార్టీలు. అధికార పీఠం అధిష్టించడానికి ఏ నీచానికైనా ఒడిగట్టడానికి సిద్ధంగా ఉన్నారు.దేశంలో ఉన్న హిందూ ధార్మిక సంస్తల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. వాటి నిర్వహణ; చివరకు వాటి ఆదాయం ఖర్చు విషయాలను ప్రభుత్వమే నిర్దేసిస్తోంది.
ఇది ఎంతవరకు పోయిందంటే తిరుమల తిరుపతి దేవస్తానం చైర్‍మన్ గా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండటం ఈమధ్య తమ పదవులు పోకుండా నిలుపుకోటానికి చేసిన "ఆఫీస్ ఆప్ ప్రాఫిట్" చట్టం ప్రకారం ప్రశ్నించలేని హక్కుగా చేసేసారు. అలాగే తామేదో దేశ సెక్యులర్ వ్యవస్తకు రక్షకభటులమని కాలరెగరేస్తున్న కేరళలోని ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం శబరిమలై నిర్వహణలో వేలుపెట్టటానికి ప్రయత్నిస్తోంది. కళ్ళుండీ తన నల్ల కళ్ళజోడు నుండి చూడలేని గుడ్డివాడు తమిలనాడు ముఖ్యమంత్రి ఒక వదరబోతుగా ప్రవర్తించాడు. రాముడు ఏ కాలేజిలో చదివేడు? రాముడు తాగుబోతు కాదా? ఇటువంటి కుళ్ళుబోతు ప్రశ్నలు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతిసే ప్రయత్నంచేశాడు.
ఇది అదనుగా తీసుకొని ఈ నాడు ( కేంద్ర, రాష్ట్ర ప్ర్భుత్వాల ప్రొత్సాహంతో) క్రిష్టియన్ మిషనరీలు హిందువులను, ముఖ్యంగా గిరిజనులను మతమార్పిడికి గురుచేస్తున్నారు. తిరుపతిలో, పద్మావతీ విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటనలు ఈ నీచ ప్రవృత్తికి నిదర్శనాలు.
హిందూధర్మాన్ని ఎంత కించ పరుస్తే అంత గొప్ప సెక్యులరిజం అని వీళ్ల అభిప్రాయం. ఇదే తమకు ఓట్లు రాలుస్తుందని వీళ్ళ నమ్మకం. ఇంత నీచ సంస్కృతిని సెక్యులరిజం అనడం ఇంకా నీచం. ఈ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళూ, కమ్యునిస్టులు, వాళ్ళ తోకలు ప్రస్తుతం గుర్తెరిగే స్తితిలో లేరు. వీరంతా సెక్యులరిజం ముసుగులో భారతియ సంస్కృతిని వెక్కిరిస్తున్న జాతి విద్రోహులు.
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 8:09 AM 4 వ్యాఖ్యలు
Friday, July 4, 2008
రాజశేఖరుని సువార్తావాణి
కలక్టర్లకు ముఖ్యమంత్రి సుద్దులు
మొన్నీమధ్య ముగిసిన జిల్లా కలెక్టర్ల వార్షిక సమావేశంలో మన రాజశేఖరుడు ఐఏస్ లకు రాజకీయ సుద్దులు వళ్ళించేడు. ఈ షట్ సూత్రాలను తిలకించండి
1. "ఇది ప్రభుత్వ కార్యకలాపాల సమీక్షకు సంబంధించిన సమావేశం. ఇందులో రాజకీయ ప్రసంగాలు చెయ్యకూడదు."
తాత్పర్యం: మీరు రాజకీయ ప్రసంగాలు చెయ్యకూడదు. సమావేశంలో ఆ పని చెయ్యాల్సింది నేను, నా మంత్రులు.
2. "ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడా కనిపించలేదు. పార్టీ బలహీనంగా ఉన్న చోట కూడా మంచి మెజారిటీతో గెలిచాం. మొన్న నలభయ్యో, నలభై ఒకటో అసెంబ్లీ స్తానాల పరిధిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇది నిరూపణ అయింది."
తాత్పర్యం: వ్యతిరేకించే వాళ్ళకి ఇంత విదిలించో, వీలుకాని చోట మావాళ్ళచేత కేసులు పెట్టించో ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాం. మీ తరఫున మీరు పూర్వంలాగే ఈ విషయంలో పాటుపడి ఓ రెండొందల ఏబయ్యో ఎన్నో అసంబ్లీ సీట్లు, ఓ నలభైరెందో ఎన్నో పార్లమెంటు సీట్లు వచ్చేట్టు చెయ్యాలి.
3. "కొన్ని పత్రికలు అదే పనిగా మాకు మంచి పేరు రాకూడదని ప్రచారం చేస్తున్నాయి. పనికట్టుకొని కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి."
తాత్పర్యం: ఈ ప్రజాసామ్యంలో బురద చల్లడం అందరిహక్కు. అందుకే మా సుపుత్రుడు చేత ఓ పేపరు పెట్టించా. మా తరఫున ఆ పని చెయ్యటానికి. బురద అంతగా ఎక్కువైతే కడగటానికి నా కేబినట్ సహచరులుండనే ఉన్నారు. దీనికి రోశయ్యగారి అద్యక్షతన ఓ కమిటీ కూడా వేశాం.
4. "మార్చి, ఎన్నికలకు పోవాల్సిన సమయం. అప్పటికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పనులు పూర్తి చేయండి."
తాత్పర్యం: అప్పటికి మాకు రావాల్సిన ముడుపుల వసూల్లు పూర్తిచేయండి. ప్రస్తుత వసూళ్ళు అధిష్టానానికి అర్పించడానికే సరిపోయాయి. మరి మాకు, ఎన్నికలకు డబ్బు కావాలిగా.
5. "ప్రజల సమస్యలను చర్చించేందుకే కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశాం." ఆర్ధిక మంత్రి రోశయ్య , వైస్ తరఫున వకాల్తా.
తాత్పర్యం: పార్టీ శ్రేయస్సు ప్రజల శేయస్సు కాదా? అందుకే మా వాళ్ళ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నాం. దీనిని తప్పుపట్టేవారికి రాజకీయా పరిజ్ఞానం లేదని విశదమవుతుంది. మన వైశ్యశిఖామని విశదీకరణ.
6. "అవినీతి నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఏ స్థాయిలోనూ అవినీతిని సహించ వద్దు. రాజకీయ ఒత్తిల్లకు లొంగ వద్దు."
తాత్పర్యం: ఒక్క మా విషయం లో తప్ప.
వైస్ మాటలకు అర్ధాలు వేరులే అన్నది స్ఫురద్రూపులు ఐఏస్ లు ఇట్టే గ్రహించేశారు. వారి వారి జిల్లాలకు పోయి వారి విధులలో ( అదే షట్ సూత్ర ప్రణాలిక అమలు) మునిగిపోయారు.
Labels: కలక్టర్ల సమావేశం, సమీక్ష, సుద్దులు
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 6:27 PM 2 వ్యాఖ్యలు
Wednesday, July 2, 2008
మేధోమధనం - సాఫ్టువేర్ డెవలపర్స్ కి మంచి అవకాశం
మేఘాలను మధిస్తే వర్షం వస్తుంది. ఇదీ అందరికీ తెలిసిన విషయం. దీనికి దీటుగా ఇప్పుడు "మేధోమధనం" రాజకీయాలలో ప్రారంభమయింది. ముఖ్యంగా పార్టిలు పెట్టేవారికి ఇది తప్పనిసరి. ఎందుకంటే వాళ్లకి రాజకీయ పరిజ్ఞానం తక్కువ. అదీకాక ఓపిక, కాలం కరువయింది. వీళ్ళకి దిశానిర్దేశం చెయ్యటానికి ఈ కొత్త రాజకీయ కన్సల్టన్సీ సర్వీసులు పుట్టుకొచ్చేయి. మొన్న టి.ఆర్.యస్ చంద్రశేఖర్ నుండి నేటి దేవేందర్ గౌడ్, చిరంజీవి వరకు ఈ కన్సల్టీ సర్వీసులను ఆశ్రయించక తప్పటం లేదు. ఎలాగైతే మిగిలిన కన్సల్టన్సీ సర్వీసులు ఒకరికన్న ఎక్కువమందికి తమ సేవలను అందిస్తాయో, అలాగే ఇవి కూడా చేస్తున్నాయి. రాజకీయ కన్సల్టీ సర్వీసులో ఇదో వినూత్న ప్రక్రియ. టి. ఆర్. ఎస్. సిద్దాంత కర్తగా వ్యవహరించిన ప్రొఫెసర్ జయశంకర్ ఇప్పుడు దేవేందర్ గౌడ్ కి కూడా తమ సర్వీసుని అందిస్తున్నారు. ఈయనిది తెలంగాణా కన్సల్టీ సర్వీసు. తెలంగాణా కోసం పాటుపడే వారెవరికైనా తమ సర్వీసు ఉంటుందన్నారు. చిరంజీవి విషయంలో రాజకీయ సలహాదారు డా.మిత్ర ఈ సర్వీసు అందిస్తున్నారు. మార్క్సిస్టు మేధావులుగా చెలామణి అవుతున్న విఠల్, బ్రహ్మారెడ్డిలు సైద్ధాంతిక సహకారం ( దీనిని సైద్ధాంతిక సహకార సర్వీసు అందామా) అందిస్తున్నారట. ఇక పోతే ఆయన బంధుగణం రాబోయే పార్టీ ప్రచార సర్వీసు తీసుకున్నారు. అన్నట్టు తాజాగా వారణాసి జ్యోతిష్కులు రాజకీయ నాయకులకు అతి ముఖ్యమైన "జ్యోతిషం సర్వీసు" తీసుకున్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవతాడని జ్యోతిషం కూడా చెప్పేసారు. రాజకీయాల ధర్మమా అని ఇలా ఎన్నో కొత్త కన్సల్టన్సీ సర్వీసులు వస్తున్నాయి.
ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉండటం, వ్యాపారానికి పెట్టుబడి పెట్టే సామర్ధ్యం లేకపోవడం "ఐటి" లో మాంద్యం - ఇవన్నీ చూసిన యువకులు ఈ పెట్టుబడిలేని వ్యాపారంవైపు మొగ్గుచూపే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది. మన కంప్యూటరు నిష్ణాతులు ఈ కన్సల్టన్సీ సర్వీసులకోసం సాఫ్టువేరు కూడా తయారుచేస్తున్నారని వినికిడి.
Labels: కన్సల్టన్సీ, జ్యోతిషం, మేధోమధనం
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 10:55 PM 0 వ్యాఖ్యలు
Monday, June 30, 2008
కుక్క కాటుకి.....
ఇక పోతే వీరు " ఈనాడు" రామోజీరావుపై కక్ష సాధించేందుకు ఒక టివి సీరియల్ తయారుచేసారు. అందులో రామోజీరావు పాత్రధారి సగంలో హాండు ఇచ్చేశాడు. వేరొకరితో తీసారు. దానిని ప్రదర్శించడానికి మొదట ఒప్పుకున్న టీవీ చానల్ వాళ్ళు కూడా తరువాత మా వల్ల కాదన్నారు. ప్రస్తుతం ఏ టివి వాళ్ళు ముందుకు వస్తారా అని చూస్తున్నారు. మరి "జగన్ టివి" వస్తే వాళ్ళు ప్రదర్శిస్తారేమో!
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 10:10 PM 3 వ్యాఖ్యలు
Saturday, June 28, 2008
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
దోపిడీలొనూ హైటెక్ పద్ధతులు - రాష్ట్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ప్రభుత్వం తన దోపిడీ విధానానికి హైటెక్ పద్ధతులను ఆచరించటానికి తయారయ్యింది. ఇక భూముల వేలం " ఆన్ లైన్" లో నిర్వహిస్తుందట. దీని వలన పారదర్శకత పెరుగుతుందట. విదేశాలలో ఉన్నవారు సైతం వేలంలో పాల్గొనవచ్చునట.ఇవన్నీ ప్రభుత్వం వైపునుండి వినిపిస్తున్న వాదాలు. అయితే అసలు విషయం వేరన్నది తలకాయలో కాస్త బుద్ధి ఉన్న వాళ్ళెవరైనా గ్రహిస్తారు. టెండరు ప్రక్రియ వలన కాలయాపన జరిగే అవకాశం ఉంది. ప్రతి పక్షాలు అడ్డుకొనే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో అమ్మాల్సిన భూములు చాలా ఉన్నాయి. కాని తమ వద్ద ఉన్న కాలం తక్కువ. ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చు. దీని వలన తమ ఆశయాలు నెరవేరక పోవచ్చు. ఇవన్నీ ప్రభుత్వం భయాలు. అందుకే ఈ హైటెక్ దోపిడీకి తహ తహ. వీలైనన్ని భూములమ్మి డబ్బు దోచుకోవాలి. ఆ డబ్బులో కొంత భోంచేయవచ్చు. కొంత రాబోయే ఎన్నికల ఖర్చుకి పనికొస్తుంది. ఐటితో ఎన్నిలాభాలో.
విపక్షాలు తాము కూడా హైటెక్ పద్ధతిలోనే అడ్డుకుంటామని అంటున్నాయి. మరి వాళ్ళ హైటెక్ వ్యూహం ఏమిటో!
ఇదంతా చూస్తూ ఉంటే నిజంగానే వైస్ చెప్పినట్టు త్వరలోనే మన రాష్టం ఐటిలో నెంబర్ వన్ స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తొంది! శుభం!!
Labels: భూముల వేలం, హైటెక్ దోపిడీ
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 5:55 AM 1 వ్యాఖ్యలు
Thursday, June 26, 2008
చిందులువేయకురా కృష్ణా.....
ఈ విధ్వంసానికి కారకులైనవారి మీద ఏవో కేసులు పెట్టామని, చూస్తున్నామని పోలిసులు చెప్పడం, మందకృష్ణుని ఫిర్యాదుమేరకు "అట్రాసిటీ"చట్టం కింద ఆంధ్రజ్యోతి సంపాదకుడు, ఇద్దరు రిపోర్టర్లను అరెస్టు చేసామనని చెప్పడం ఇదంతా ఒక నాటకమని ప్రతిఒక్కరికి తెలుసు. ఇదంతా ప్రభుత్వంతో జతకూడి పోలిసులు చేస్తున్న పని అన్నది జగద్విదితం. ప్రతీ కధలోను ఒక నీతి ఉన్నట్టు, ఈ నాటక కధలో ఒక ప్రమాదకరమైన సంకేతం దాగి ఉంది. దలితులు అరాజకాలు చేసినా అది వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. కాదంటే "అట్రసిటీ" చట్టం క్రింద కేసులు పెట్టించి కాదన్నవారిని జైలుకు పంపవచ్చు. ఓట్లకోసం ఏ పాడుపనికైనా సిద్ధపడే ప్రభుత్వం ఇందుకు తన సహకారం ఇస్తుంది.దలితుడి దిష్టిబొమ్మ తగలపెడితే అది అన్యాయం. దలితుడు వేరేవాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెడితే అది వారికి చట్టం ప్రసాదించిన హక్కు. వాళ్ల హక్కులకోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తే మంచిదే. అంత మాత్రాన విద్రోహానికి పాల్పడటానికి ఏ రాజ్యాంగం వీరికి హక్కు ఇచ్చింది? పత్రికలు తమని, తమ చేష్టలని ఎప్పుడూ మెచ్చుకోవాలని అనుకుంటే అది అహంకారం మాత్రమే.
ఈ అహంకారం మందకృష్ణునికి బాగా తలకెక్కింది. నిప్పులు తొక్కిన కోతిలాగ గంతులు వేస్తున్నాడు."ఆంధ్రజ్యోతి" ఎండీని తక్షణమె అరెస్టు చెయ్యాలి లేదంటే ఆంధొలన తప్పదని, జర్నలిస్టు నాయకులు యాజమాన్యాలకు తొత్తులుఅనీ, చిరంజీవికి అమ్ముడు పోయారు అనీ, బాబు, కేసిఆర్ లను తిరగనివ్వం అనీ, గద్దర్ నువ్వు అసలు దలితుడవేనా అని - ఈ రకంగా చిందులు వేస్తున్నాడు.
ఈ ఉదంతం పత్రికాస్వేచ్ఛకు విఘాతం. పోలీసుల జులుంకి తార్కాణం. ప్రభుత్వ ఓటుబేంకు రాజకీయాలకు నిదర్శనం.
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 11:18 PM 7 వ్యాఖ్యలు
Wednesday, June 25, 2008
ఆంధ్రజ్యోతిపై అర్ధరాత్రి దొంగ దెబ్బ
అట్రాసిటీ చట్టాన్ని ఇలాంటి కుంటి సాకులతో రాజకీయ ప్రయోజనాలకు వాడటం చాలా ప్రమాదకరమైన చర్య. "మాకు చట్టం ఉంది, పోలీసులు మాచుట్టాలు" అనుకొని ఇష్టారాజ్యంగా దుష్ట కార్యాలను తలపెడితే ఎవరూ హర్షించరు. దెబ్బ తినక తప్పదు. ఈ విషయాన్ని ఈ కులాలకు నాయకులమని విర్రవీగుతున్న వాళ్ళు గుర్తిస్తే వారికే మంచిది.
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 1:11 AM 0 వ్యాఖ్యలు
Monday, June 23, 2008
వార్తలు - వ్యాఖ్యలు
పాపం చిరంజీవి!
చిరంజీవి రాజకీయ ప్రవేశం కాకుండానే అతనిపై ఆరోపణల పర్వం ఆరంభమైంది.వైఎస్ మంత్రులు మారెప్ప, గీతారెడ్డి ఆయనపై దుమ్మెత్తిపోయడం ప్రారంభించేరు. బ్లడ్ బేంకుతో సమాజసేవ అని చెప్పి అభిమానుల రక్తంతోటి ధనార్జన చేస్తున్నాడని, భూములు కబ్జా చేసాడని ఇంకా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా అధినాయకుని ప్రొత్సాహంతోనే జరుగుతున్నాదని చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. యధాశక్తి వాళ్ళ దిష్టిబొమ్మలు తగలెట్టి నాయకునియందు తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు."అందరినీ కలుపుకు పోవాలి" అనే పిసిసి అద్యక్షుడు, ఎందుకేనా మంచిదనే ముందుచూపుతో కాబోలు వారిని వారించే ప్రయత్నం చేసారు. ఇప్పుడే ఇలాఉంటే ముందు ముందు తన ఇమేజ్ ఏమవుతుందో అని మెగాస్టారు ఆరాటపడటం సహజం. ఆయనకు దిశానిర్దేశం చేసే పెద్దలు ఇటువంటివి ఎలా ఎదుర్కోవాలని ఆలోచనలో పడ్డారని వినికిడి. జనంచేత జేజేలు కొట్టించుకోవడమే తెలిసిన చిరు రాజకీయలు ఇంకా వంట పట్టించుకోవసివుంది. "దున్నపోతుమీద జడివాన పడితే" అదెలా దులుపుకు పోతుందో ఆ స్వభావం బాగా జీర్ణించుకున్న మిగతా పార్టీల నాయకులను చూసి నేర్చుకోవలసి ఉంది. తప్పవు నాయనా ఇవన్నీ రాజకీయాలలో!
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 9:04 PM 0 వ్యాఖ్యలు
Thursday, June 19, 2008
మద్యం మత్తులో జోగుతున్న ప్రభుత్వం
ఎన్నికల ముందు మద్య నిషేదం అంచెలంచెలుగా అమలు చేస్తామన్న వైస్ ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటోంది. మొన్న జరిగిన టెండర్ల భాగోతం ఈ ప్రభుత్వ అసలు రూపం బయట పెట్టింది. మద్యం తమ పాలిట బంగారు బాతని భావిస్తోంది సర్కారు. ఆదాయం విపరీతంగా పెరగబోతున్నందుకు చంకలు గుద్దుకుంటోంది. అధినాయకుని తెలివితేటల్ని మంత్రులు, కాంగ్రెసు (వి)నాయకులు వేనోళ్ళ ప్రసంసిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు మూలధనం చేకూరినందుకు అమితోత్సాహంతో పండగ చేసుకుంటున్నారు. ఇదేమి అన్యాయం అన్న వాళ్లని అడుగులకు మడుగులొత్తే పోలిసుల సహకారంతో అరెస్టు చేయిస్తున్నారు. ఈ పాపం తమది కాదు అంతకు ముందున్న ప్రభుత్వానిదంటున్నారు. అంతేగాని తాము ప్రభుత్వంలోకి ఏ వాగ్ధానం చేసి వచ్చేరో మద్యం మత్తులో మరచిపోయారు. గాంధీకి రాజకీయ వారసులమని చెప్పుకునే ఈ కాంగ్రెస్, గాంధీ స్వరాజ్య సమరంతో పాటు మద్యానికి వ్యతిరేకంగా సమరం సాగించేడన్నది మరచిపోయారు. మరపు కాదు మదం. తమర్ని ఎవరూ ఏమీ చెయ్యలేరని ధీమా.
పులి తోలు కప్పుకుంటే నక్క పులి అవుతుందా. ఖద్దరు కట్టేసి, కండువాలేసుకొని, టొఫిలు పెట్టుకొంటే గాంధీ వారసులుకారు. పేరు చివర గాంధీ అని రాసేసుకుంటే వీళ్ళు గాంధీలు కాలేరు.
Labels: గాంధీ వారసులు, మద్యం
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 12:55 AM 2 వ్యాఖ్యలు
Saturday, June 14, 2008
కుప్పిగంతుల డాన్సులూ - విరగదీసిన భామలూ
ఈ మధ్య టీవీ చానల్స్ లో ఒక కొత్త ప్రక్రియ ప్రారంభమయింది. అదే మన పల్లెటూళ్ళలో రికార్డింగ్ డాన్సులలాంటివి. ఇందులో ఒక ఆడామె ( ఈమెనే ముద్దుగా సెలిబ్రటీ అంటున్నారు) ఇంకొక మొగ పురుగు ( వీరు కొరియోగ్రాఫర్ ట) ముఖ్యంగా ఊంటారు.ఇటువంటి ఒక ప్రక్రియ ఎలా నడుస్తుందో చూద్దాం.
అది ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్. షో పేరు: "గెంతండి, గెలవండి". ముందుగా ఒక ఏంకరు కుఱ్ఱాడు ఆదరాబాదరాగా స్టేజిపైకి వచ్చి గొంతు చించుకొని ఆరిచేడు. "గెంతండి, గెలవండి షోకి స్వాగతం, సుస్వాగతం" అని. ఆహూతులైన ప్రేక్షకులు చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని ప్రదర్శించేరు. తరువాత ఏంకరు కుఱ్ఱాడు కార్యక్రమ న్యాయనిర్ణేతలకు స్వాగతం పలికేడు. ముగ్గురు జడ్జీలు ఠీవిగా స్టేజిపైకి వచ్చేరు. వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఏంకర్ చానల్ తరఫున సత్కరించేడు. జడ్జీలలో ఒకరు కొంచెం మోడరన్ గెటప్ లో తయారైన ఆడామె. రెండవ వ్యక్తి నడి వయ్స్సులో ఉన్న మొగాయన. ఈయన ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఊంటాడు. మూడవ మనిషి కౌబాయ్ లాగా ఒక టొపీ పెట్టుకొని ఉన్న ముసలాయన. తర్వాత వారు ముగ్గురు న్యాయనిర్ణేతలు తమకు నిర్దేశించిన ఆసనాల్లో సుఖాసీనులయ్యారు. ఇప్పుడు ఏంకరు ఆరిచేడు " ఈ నాటి గెంతండి, గెలవండి కార్యక్రమంలో మొట్టమొదట వస్తున్నవారు జీమ్మీ గారు ( కుక్క కాదండీ, మనిషే) లెట్ అజ్ వెల్‍కమ్ జిమ్మీ". జిమ్మీ నామధేయంగల ఆ "సెలిబ్రటీ" ఒక కొరియోగ్రాఫర్ కుర్రాడితో ( ఆమె వయస్సులో సగం కూడా ఉంటాడో ఉండడో) పరిగెడుతూ స్టేజ్‍పైకి వచ్చింది. మన కుఱ్ఱ ఏంకరు తన వాక్పటిమతో ఆమెని, ఆమె దుస్తులని పొగిడి (అసలు ఉన్నవే కొంచెం) " జిమ్మీగారూ, ఈ రోజు మీరు ఏ సాంగు చెయ్యబోతున్నారు" అని ప్రశ్నించాడు. సదరు జిమ్మీ అష్టవంకరులూ తిరిగిపోయి "నీతోనే లేచి పోతా" లో "నువ్వంటే నాకు ఇదీ అదీ " సాంగు చేస్తా అని చెప్పింది. "చాలా మంచి సాంగు సెలక్ట్ చేసుకున్నావు. ఇంక అదరగొట్టు. విష్ యూ గుడ్ లక్" అని చెప్పి ఏంకరు కుర్రాడు పరుగు పరుగున నిష్క్రమించాడు. సదరు జిమ్మీ న్యాయనిర్ణేతలకు, కార్యక్రమానికి హాజరైన ఆహూతులకీ వంగి వంగి దండాలు పెట్టి తన డాన్స్ ప్రారంభించింది.
మరి అది ఏ రకం డాన్సో తెలీదు కానీ స్టేజి అదిరిపోయేటట్టు జిమ్మీ గెంతేస్తోంది. దానికి సరిపోయేటట్టు కుర్రాడు కూడా కుప్పిగంతులు వేసేస్తునాడు. అప్పుడప్పుడు కుర్ర డాన్సరు తన శక్తినంతా కూడదీసుకొని జిమ్మీ అనే ఆ భారీ శరీరాన్ని రెండు చేతుల్తో ఎత్తి కుదేస్తున్నాడు. జనంలో కొందరు ఆడ మొగా ఆనందం పట్టలేక తమ సీట్లలోంచి లేచిపోయి ఈలలు వేసూకుంటూ వాళ్ళకొచ్చిన డాన్సు వాళ్ళు చేసేస్తున్నారు. ఇక జడ్జీల సంగతి సరే సరి. ఆడ జడ్జీ ఆనందం పట్టలేక ఈల వెయ్యటానికి చూసింది, కాని బాగుండదనుకుందేమో ఆగిపోయింది. ముసలాయన కూర్చునే, టొపీ కిందకు మీదకు తోసుకుంటూ అభినయించడం ప్రారంభించేడు. మూడో ఆయన ఏ భావమూ చూపెట్టకుండా సేరియస్ గా చూస్తున్నాడు. ఆ కుర్రాడు, జిమ్మీ స్టేజీని పశువులు కుమ్మిన కొట్టం లాగా చేసి చివరిలో ఒకరి ఒళ్ళో ఒకరు ఆయాసంతో పడిపోయి అయిందనిపించేరు. ప్రేక్షకుల చప్పట్లు, ఈలలతో తమ ఆనందాన్ని ప్రకటించేశారు. ఏంకరు కుఱ్ఱాడు పరుగు పరుగున స్టేజిపైకి వచ్చి జిమ్మీని వాటేసుకున్నంత పని చేశాడు. " అదరగొట్టాసావు కదా జిమ్మీ, నీలో ఇంత టాలెంటు ఉందని నాకు తెలీదు" అంటూ తన మామ్మూలు డైలాగ్స్ తో జిమ్మీకి షేక్‍హాండు ఇచ్చి మరీ పొగిడేశాడు. సదరు జిమ్మీ కూడా ఆయాసంతో రొప్పుతూ చెమటను చేత్తోనే తుడుచుకుంటూ ఆనందపడిపోయింది. "ఇక మన జడ్జీల కామెంట్స్ విందాం" అన్నాడు ఏంకరు. ఆడ జడ్జీగారు తమ ఆనందాన్ని ప్రకటిచ్తూనే, ఇంకా ఫ్రీగా, హుషారుగా చేస్తే బాగుంటుందన్నారు. ఈమెకు జిమ్మీగారి "ప్రదర్శన" ఇంకా చాలదట. ఇంక చిర్రుబుర్రులాయన వంతు. ఈయన మైకును ఒక వైపుకు వాల్చి సిగరట్టు తాగేవాడిలా నోటిదగ్గర పెట్టుకొని " కాన్సెప్టు అర్ధం కాలేదు, లిప్ మూవ్‌మెంటు సరిగాలేదు." అంటూ కామెంట్స్ చేశాడు, ఏదో కాన్సెప్ట్ ఉన్నట్టూ, లిప్ మూవ్‌మెంటు ఉన్నట్టూ" ఇంక ముసలాయన వంతు. ఆయన సీటులోంచి లేచి స్టేజి పైకి పేంటు పైకి లాగుకుంటూ వెళ్ళి జిమ్మీతో కలసి హుషారుగా డాన్స్‌చెయ్యటం ప్రారంభించేడు. జిమ్మీ కూడా ఆనందంతో పొంగిపోయి జత కలిపింది. పనిలోపని ఏంకరు కుఱ్ఱాడు కూడ రెండు గెంతులు గెంతాడు. ప్రేక్షకులు మహదానందంతో చప్పట్లు కొట్టి ఈలలు వేశారు. ఇంతలో తేరుకొని, ఏంకరు " నెక్స్ట్ పార్టిసిపెంటు వచ్చేముందు చిన్న బ్రేక్" అని వెళ్ళిపోయాడు.
Labels: తెలుగు టీవీ చానెల్స్, రికార్డ్ డాన్స్
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 5:57 PM 8 వ్యాఖ్యలు
Thursday, June 12, 2008
త్వరలో విడుదల " మీరూ భోంచెయ్యండి"
ప్రముఖ రాజకీయ చిత్ర నిర్మాత, దర్శకుడు శ్రీ వై.ఎస్ గారి మహోజ్వల చిత్రం - " మీరూ భోంచెయ్యండి" విడుదలకు సిధ్ధంగా ఉంది.
నాయకులే భోంచేస్తున్నారని, తమకు చాన్స్ రావడం లేదని కార్యకర్తలకు గుర్రుగా ఉందని కాంగ్రెస్ నాయకులు పదే పదే చెప్పడం ఈ మధ్య వ్యవసాయ శాఖామాత్యులు వారిని సంతోషపరుస్తామని హామీ కూడా ఇవ్వడంజరిగింది. దాని పర్యవసానమే రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ "మీరూ భోంచెయ్యండి" పధకం. ఇంకా "దొరికినంత తినేయండి", " దొరికినంత దోచేయండి" వంటి వినూత్న పధకాలు మన రాష్ట్రప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతుందని అభిజ్ఞవర్గాల భోగట్టా.
ఈ సందర్భంగా వై.ఎస్ గారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించటానికి ఒక మహత్తర రాజకీయ చిత్రానికి అంకురార్పణ చేసారు.
ఈ తాజా చిత్రం " మీరూ భోంచెయ్యండి" విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిత్ర నిర్మాత, దర్శకుడు అయిన శ్రీ వై.ఎస్ గారు చిత్రానికి సంబంధించిన వివరాలు అందించారు.
నిర్మాత: రాష్ట్ర ప్రభుత్వం
స్క్రీన్‍ప్లే, దర్శకత్వం : వై.ఎస్
సహకార దర్శకత్వం: ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు.
ముఖ్యనటీనటులు: రాష్ట్ర మంత్రులు.
గెస్ట్ ఆర్టిస్టులు: కాగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, జిల్లా పరిషత్తు అద్యక్షులు, గ్రామ(వి)నాయకులు మున్నగువారు.
జూనియర్ ఆర్టిస్టులు: కాంగ్రెస్ కార్యకర్తలు
ఈ మహత్తర రాజకీయ చిత్రానికి దాదాపు 992 కోట్ల వరకు ఖర్చు కాగలదని వివరించారు.
ఇందులో హీరోగా వై.ఎస్ గారే నటించడం ఒక విశేషం. హీరొయిన్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్టుకి ఐదు లక్షల వరకు పారితోషికం ముడుతుందని వివరించారు.
ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ చిత్ర షూటింగ్ సాఫీగా జరిగేటట్టు ఆయా జిల్లాల కలక్టర్లు విధిగా సహకరించి తీరాలని ప్రభుత్వం ఆదేశాలను జారి చేసినట్టు తెలిపేరు.
వై,ఎస్ గారి అభిమాన సంఘాలు ఈ చిత్ర విడుదలకు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయని భోగట్టా.
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 2:28 PM 3 వ్యాఖ్యలు
Monday, June 9, 2008
ఆడలేక మద్దెలోడు
జలయజ్ఞం పేరుతో ఎడాపెడా సొమ్ముచేసుకుంటున్న వైఎస్ ప్రభుత్వం ఆ పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ దేవాదుల ప్రాజక్టు పైపులైను లీకేజీలు. ఒకసారి, ఒకచోట కాదు, అనేకసార్లు అనేకచోట్ల ట్రయల్‍రన్‍లో లీకేజీలు సంభవించేయి . వీటి వల్ల నీళ్ళు పంట పొలాలను తడపటానికి బదులు దగ్గరలోఉన్న పొలాలను నాశనం చేస్తున్నాయి. మొన్నటికిమొన్న పాలంపేట వద్ద ఎయిర్‍వాల్వ్ లీకేజీ వలన నీళ్ళు ఆకాశంలోకి ఎగజిమ్మేయి . అధికారుల నిర్లక్ష్యం, పనులలో నాణ్యతాలొపం వలన ముందుముందు ఈ ప్రాజక్టు పనితీరు ఎలాఉండబోతోందో రుచి చూపించాయి.
ఇది ఇలా సాగుతూవుంటే మంత్రివర్యులు పొన్నాలవారి వ్యాఖ్యానం ఇంకా దారుణం. దారుణమే కాదు, నిర్లక్ష్యానికి నిదర్శనం. " ఈ లీకేజీలు ఇంకా , ఇంకా బయటపడతాయి. ట్రయల్‍రన్ అంటేనే లోపాలను గుర్తించటం, మరోసారి రాకుండా చూడటం. ప్రాజక్ట్ నిర్మాణమై ప్రభుత్వానికి అప్పచెప్పాక కూడా రెండు సంవత్సరాలదాకా భాధ్యత కాంట్రాక్టర్లదే " అన్నారు సదరు మంత్రివర్యులు. అంటే కళ్ళుమూసుకొని ముందు పనికానిచ్చేయడం. తర్వాత వచ్చే లీకేజీలను పూడ్చుకోవడం. అంతేగాని ఇన్నిసార్లు ఇలా లీకేజీలు రావడం పనిలో లోపాన్ని సూచిస్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం కలగదు.ఈ ప్రభుత్వంలో ఎవరూ దేనికీ భాధ్యత వహించరు. అంతా సవ్యంగా ఉంటే అది మా గొప్పే అని కాలరు ఎగరేసుకొని తిరుగుతారు. తప్పు జరిగితే దాని భాధ్యత అధికార్ల మీదికి నెట్టేస్తారు. అవును మరి వాళ్ళ నైజం ఎక్కడికి ఫోతుంది. డబ్బుదండుకోవడంలో ఉన్న ఉత్సాహం తరవాత ఉండదు.ఇంతకీ దీని కొసమెరుపు - పొన్నాలవారు లీకేజీలకు కారణం ప్రజలే అనడం.
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 11:01 PM 1 వ్యాఖ్యలు
Friday, June 6, 2008
పెట్రో ధరల పెంపు - అందులో రాజకీయాలు
ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గేసు ధరలను విపరితంగా పెంచేసింది. పాపం మన్ మోహన్ సింగ్ గారు కళ్ళ నీళ్ళ పర్యంతం అయి జాతినుద్దేశించి చావు కబురు చల్లగా చెప్పేరు " మీరు ఈ భారాన్ని మొయ్యక తప్పదు" అని. గత 2 నెలలుగా జరుగుతున్న భాగోతం ప్రజలముందుకు వచ్చేసింది. చిద్విలాసుడు చిదంబరం విజయహాసం చేసాడు. కేంద్రం పన్నులు తగ్గించేదిలేదు అని లుంగీ ఎగ్గట్టి మరీ చెప్పేసాడు.తన వాక్పటిమతో అధినేత్రి నోరు మూసేసాడు. పాపం ఆమె మాత్రం ఏమి చేస్తుంది. ఆ విషయాలన్నీ అర్ధం చేసుకొనే మేధా లేదు, ఓపికా లేదు. అన్నీ తెలిసినా, ప్రధాన మంత్రి గారు ఏమీ చెయ్యలేని పరిస్తితి. వెరసి ప్రజల నెత్తిన శఠగోపం.
ఇప్పుడే అసలు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అధినేత్రి సోనియా కాంగ్రెసు పాలనలో ఉన్న ముఖ్యమంత్రులకు "మీరు వేస్తున్న రాష్ట్ర సుంకాలను తగ్గించి ప్రజల మెప్పుపొందండని" హుకుం జారీచేసారు- . రాబోయే రాష్ట్రాల ఎన్నికలలో తమకి ఎదురుదెబ్బ తగలకుండా ఈ చర్యలు ఉపకరిస్తాయని కాంగ్రెస్ ఆశ. వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రిగారు ఉగులాడుతున్న తన పీఠం, రాబొయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని వంటగేస్‌పై పన్నులు తగ్గించి అదనపు భారం 10 రుపాయలే ఉండేటట్టు చూస్తామన్నారు. మన ముఖ్యమంత్రిగారైతే ( వీరు కొట్టమంటే నరికే రకం కదా)మొత్తం భారాన్ని తామే భరించి వంట గేస్‌పై అసలు పైసా కూడా పెరగనియ్యమన్నారు. దీనికి ఆడపడుచుల సెంటిమెంటు కూడా జతచేసారు. ఇదంతా చూసేక చేసేదిలేక కమ్యూనిష్టులు,భాజపా కూడా తమ వారిని పన్నులు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించ మన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ప్రియురాలి ప్రేమను పొందటానికి హీరో సినిమాల్లో తరచుచేసే ఫీటు గుర్తుకొస్తోంది. ముందు తను నియమించిన రౌడీలు హేరొయిన్ని ఎదుర్కుంటారు. తరవాత హీరోగారు వచ్చి హిరొయిన్ని రక్షిస్తారు. కొంచెం అటూ ఇటుగా ఇదీ అదే తంతు.
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 3:06 PM 1 వ్యాఖ్యలు
Thursday, June 5, 2008
దేశమా నీ గమ్యం ఎటు?
మన దేశానికి స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలొ మనం సాధించింది ఏమిటి? మన గమ్యం ఎటు? ఈ ప్రశ్నలు ఎంతో కలవరపాటుని కలిగిస్తాయి.దీనికి కారణం స్వరాజ్యం వచ్చిన మొదటి రోజుల్లో ఉన్న ఉత్సాహం అడుగంటిపోవడం, ప్రజా శ్రేయస్సుకు పాటుపడాలన్న ఇంగితం పాలకులలో పూర్తిగా లోపించడం, దీని స్థానం లో స్వార్ధం, అవినీతి ,ధన దాహం చోటు చేసుకోవడం. ఈనాటి ఈ దుస్తుతికి గురుతర భాద్యత వహించాల్సినది సుదీర్ఘకాలం పరిపాలన సాగించి దేశ రాజకీయాలను వక్రమార్గానికి మళ్ళించిన కాంగ్రస్ పార్టియే. స్వరాజ్యం వచ్చిన మొదటి రోజుల్లో నెహ్రు, పటేల్ వంటి నాయకులు అంకిత భావంతో జాతికి సేవలనందించారు. సంకుచిత రాజకీయాలకు అతీతంగా జాతీయభావంతో ప్రజాక్షేమానికి పాటుపడ్డారు.ప్రజలలో ఎన్నో ఆశలు రేకెత్తించేరు. కాని జరిగిందేమిటి? తరువాతి రోజుల్లో కుత్సిత రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఈనాటి ఈ దుస్తితికి ఆనాడే శంకుస్తాపన జరిగింది. శంకుస్థాపనన చేసిన ప్రాజక్టుల మాట దేవుడెరుగు, ఈ పాజక్టులు మాత్రం అవిచ్చిన్నంగా కొనసాగుతున్నాయి.
పదవినిలబెట్టుకోవడం కోసం ఎమర్జన్సీని కూడా విధించడానికి దుస్స్సాహసం చేసిన ఇందిరా గాంధీ వ్యక్తిపూజ, నియంతృత్వ ధోరణి, అనువంశిక పాలన వంటి జాడ్యాలను జాతిపై రుద్దారు. పైనుండి క్రిందివరకు అవినీతి, బంధుప్రీతి వ్యాపించి పోయాయి."లంచగొడితనం ప్రపంచమంతా ఉంది దానిగురించి పట్టించుకోనవసరం లేదు" అంటూ ఇందిరాగాంధీ శలవిఛ్ఛారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. అవినీతి అవ్చ్చిన్నంగా "ఇంతింతై వటుడింతై" అన్న చందాన పెరిగి పోయింది. రాజకీయాలకు అవినీతి పర్యాయపదంగా మారిపోయింది. ఎంత విస్తృతంగా వ్యాపించి పోయిందంటే న్యాయాధిపతులు కూడా దీనివ్యాప్తికి తమవంతు సహకారం అందించే కాలం వచ్చేసింది.
రాజకీయ (వి)నాయకులు తమ పబ్బం గడుపుకోవటానికి సమాజాన్ని ఎన్నోరకాలుగ చీల్ల్చేసారు. కులాల పేరుతోటి, మతాలపేరుతోటి ముక్కలు చెక్కలు చేసి విద్వేషాలు పెంచి పోషిస్తున్నారు. విద్య, ఆరోగ్యాలకు నామమాత్రపు నిధులు ఇచ్చి నిరక్షరాస్యతను పెంచి పోషిస్తున్నారు. ఒకడి లేమి రెండో వాడికి కలిమి కదా. ప్రజలు నిరక్షరాస్యులు అఙ్ఞానులుగా ఉంటేనే వీరి ఆటలు సాగుతాయి. దేశనిధులను పరాయి పాలకులకన్నా హేయంగా కొల్లగొట్టుకొని ఈ రాజకీయ రాబందులు స్వైర విహారం చేస్తున్నారు. తమ స్వార్ధ రాజకీయాలకోసం ప్రత్యర్ధులను నిస్సంకోచంగా మట్టుపెట్టటానికి కూడా వెరవడం లేదు.
ఒకప్పుడు ప్రజలు కన్న కలలు ఈనాడు కల్లలుగా మిగిలిపోయాయి. ప్రజల గురించి పట్టించుకొనే నాధుడే కరవయ్యాడు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఈ నాయకులు తమ భవిష్యత్తు, తమవారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రజల భవితను అగమ్యగోచరంగా చేసేసారు. దగా, దోపిడీ స్వైరవిహారం చేస్తున్నాయి. మేధకి స్థానం లేదు. హత్యలు చేసే వాళ్ళూ, ఫాక్షనిష్టులు గూండాలూ మన నాయకులు.
ఆలోచిస్తూ ఉంటే ఈ పరిస్తితులు ముందు ముందు ఎక్కడికి దారితీస్తాయో అన్న బాధ కలుగుతుంది. అందుకే అనుకోవలసి వస్తోంది "దేశమా నీ గమ్యం ఎటు?" అని.
- దూర్వాసుల పద్మనాభం
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 12:56 AM 0 వ్యాఖ్యలు