అణు ఒప్పందం ధర్మమా అని దేశ రాజధానిలో దసరా రాకుండానే బొమ్మలాట ప్రారంభమయింది. ఒక పక్క కాంగ్రెసు అధినేత సోనియా, దేశ ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ , రెండవ ప్రక్క ఎన్.డి.ఏ, యు.ఎన్.పియే, ఉభయ కమ్యునిస్టు పార్టిలు, బి.ఎస్.పి వగైరా పార్టీల అధినేతలు ఈ ఆటని రక్తి కట్టిస్తున్నారు. చిన్నా చితక పార్టీల సభ్యుల, స్వతంత్రుల గిరాకీ అమాంతంగా మన రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న భూముల రేట్ల లాగా పెరిగిపోతోంది. మామ్మోలు టైమప్పుడు గోళ్ళు గిల్లుకుంటూ ఎవరికీ పట్టని వీరు ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు. వీళ్లని పెద్ద పార్టీల వాళ్ళు పోలీసు కుక్కల్లాగా ఎక్కడ దాంకున్నారో అని వేటాడి మరీ వెతుకుతున్నారు. చివరకు మర్డర్లు చేసి జైల్లలో ఉన్న వాళ్ళు, చావు బ్రతుకుల మధ్య ఊగులాడుతూ ఆసుపత్రులలో ఉన్న వాల్లనీ బొమ్మల కొలువుకు తేవాలని నిర్ణయించేసారు. వీళ్ళందరినీ బుజ్జగించడానికి గెడ్డాలే కాదు, కాల్లేనా పట్టుకుందుకు వెరవటం లేదు. పూర్వం కప్పల్ని తూచటానికి ఎవడో ప్రయత్నించేడట. ఒకకప్పని త్రాసులో పెడుతూ ఉంటే ఇంకో కప్ప కిందకి గెంతేదట. వీళ్ళ వ్యవహారం కూడా కప్పల తక్కెడ మేళం లాగా తయారయింది. ఎవరు ఎప్పుడు ఎటు గెంతేస్తారో తెలీకుండా ఉంది.
ఒకరు ముఖ్యమంత్రిని చేస్తామంటే, ఇంకొకరు ప్రధానమంత్రిని చెయ్యటానికి అభ్యంతరం లేదంటున్నారు.మీ దివంగత తండ్రిగారి పేరు ఓ విమానాశ్రయానికి పెట్టి మీ చిరకాల కోర్కె తీరుస్తామని ఒకరంటే, మీ మీద ఉన్న పాత కేసులు మాఫీ చేస్తామని ఇంకొకరు. సందట్లొ సడేమియా అని మన చంద్రశేఖర్ గారు తెలంగాణా ఇస్తామంటే మా రెండున్నర ఓట్లూ మీకే అంటే, తెలిసో, తెలీకో సోనియమ్మ "జై ఆంధ్రప్రదేశ్" అని మొన్నటి సభలో జై కొట్టి టీఆరెస్ ఆశలమీద నీళ్ళు పోసేసింది. ఇంతకమునుపోసారి డబ్బు సంచులు పుచ్చుకొని ఓటేసిన ఒక సిగ్గు,శరం లేని పెద్దమనిషి డబ్బు సంచులా, ముఖ్యమంత్రి పదవా అని ఇటూ అటూ ఊగిలాడి ప్రస్తుతానికి డబ్బు వైపే మొగ్గు చూపేరు. రాష్ట్రరాజకియాలలో చుక్కెదురైన ఒక మాజీ ప్రధాన మంత్రిగారు తన అదీనంలో ఉన్న మూడోట్లూ ఎటువెయ్యాలా అని గురక పెట్టి నిద్రపోతూ మరీ అలోచించేస్తున్నారు. వ్యూహ, ప్రతివ్యూహాలతో రాజధానిలో బొమ్మలాట రంజుగా తయరైంది.
చిన్నపిల్లలు బొమ్మలాట సరదాకి ఆడుకుంటారు. హస్తినలో మన ప్రజాప్రతినిధులది స్వార్ధపూరిత రాజకీయ బొమ్మలాట. అది వాళ్ళకి సరదా. దేశానికి అరిష్టం.
0 వ్యాఖ్యలు:
Post a Comment