Thursday, July 31, 2008

అసలే కోతి, దానికి తోడు నిప్పులు తొక్కింది


ఇది ఒక మంత్రి సోదరుని వీరంగం గాధ
రెండు రోజుల క్రితం రవాణా శాఖ కార్యాలయంలో వీరంగం చేసిన మంత్రి దివాకర రెడ్డి తమ్ముడు ప్రభాకర రెడ్డి ఉదంతం రసవత్తరమైన మలుపు తిరిగేటట్టుంది. తన ట్రావెల్స్ బస్సును సీజ్ చేసారన్న అక్కసుతో ప్రభాకరరెడ్డి అదనపు రవాణా కమిషనర్ సి.ఎల్.ఎన్.గాంధీపై నిప్పులు చెరగి నోటికొచ్చిన దుర్భాషలాడేరు. నిప్పులు తొక్కిన్ కోతిలా గెంతి నీ అంతు చూస్తా, ఒరేయ్, నా కొడుకా .... అంటూ ఊగి పోయారు. నీ యబ్బ.. నాబస్సులే సీజ్‌ చేస్తారా, వాడెబ్బ వాడొస్తే సంతకాలు చేస్తారా, మేం దొంగలమయ్యామా? మావి దొంగ బస్సులా ? వాటినిక్కడే తగలబెడతా! ఏమనుకుంటున్నారు, మీరు? కేశినేనితో ’గాంధీ’ కుమ్మక్కయ్యాడంటూ చిందులు తొక్కారు.
తర్వాత కార్యాలయం మెట్లపైనే ధర్నా చెయ్యడం, కమిషనర్ బుజ్జగించడంతో విరమించడం జరిగింది. అసలు కధ ఇక్కడే ప్రారంభమయింది. ప్రభాకరరెడ్డి ప్రవర్తనపై ఆగ్రహించిన ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. నిజానికి టివీలో ఈ ఉదంతం చూసిన ఎవరికైన జుగుప్స కలగడం సహజం. నిప్పులు తొక్కిన కోతిలా గెంతుతూ ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు వాగడం, విధినిర్వహణలో ఉన్న అధికారులను దూషించడం సహించరాని విషయం. TV 9 వారు నిన్న తమ ప్రోగ్రాంలో ఈ విషయంపై చర్చ జరుపుతూ, పనిలోపనిగా దేశ రాజధాని నుండి అప్పుడే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన మందకృష్ణమాదిగతో టెలిఫోన్ సంభాషణ జరిపేరు. ఇప్పటికే ఇటువంటి విషయాలలో ఆరితేరిన ఆయనకు విషయం విశదీకరించి ఇది కులం పేరుతో దూషించడం క్రింద వస్తుంది కాబట్టి ప్రభాకరరెడ్డిపై చట్టపరమైన ఎటువంటి చర్య తీసుకో వచ్చని అడిగేరు.ఈ సంభాషణ వింటూవుంటే మందకృష్ణ కన్నTV9కే ఎక్కువ ఉత్సాహం ఉన్నట్టు అనిపించింది. ఇక మందకృష్ణునికి చేతినిండా పనే. TV9 కి కావల్సినంత కాలక్షేపం!

Saturday, July 19, 2008

హస్తినలో బొమ్మలాట

అణు ఒప్పందం ధర్మమా అని దేశ రాజధానిలో దసరా రాకుండానే బొమ్మలాట ప్రారంభమయింది. ఒక పక్క కాంగ్రెసు అధినేత సోనియా, దేశ ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ , రెండవ ప్రక్క ఎన్.డి.ఏ, యు.ఎన్.పియే, ఉభయ కమ్యునిస్టు పార్టిలు, బి.ఎస్.పి వగైరా పార్టీల అధినేతలు ఈ ఆటని రక్తి కట్టిస్తున్నారు. చిన్నా చితక పార్టీల సభ్యుల, స్వతంత్రుల గిరాకీ అమాంతంగా మన రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న భూముల రేట్ల లాగా పెరిగిపోతోంది. మామ్మోలు టైమప్పుడు గోళ్ళు గిల్లుకుంటూ ఎవరికీ పట్టని వీరు ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు. వీళ్లని పెద్ద పార్టీల వాళ్ళు పోలీసు కుక్కల్లాగా ఎక్కడ దాంకున్నారో అని వేటాడి మరీ వెతుకుతున్నారు. చివరకు మర్డర్లు చేసి జైల్లలో ఉన్న వాళ్ళు, చావు బ్రతుకుల మధ్య ఊగులాడుతూ ఆసుపత్రులలో ఉన్న వాల్లనీ బొమ్మల కొలువుకు తేవాలని నిర్ణయించేసారు. వీళ్ళందరినీ బుజ్జగించడానికి గెడ్డాలే కాదు, కాల్లేనా పట్టుకుందుకు వెరవటం లేదు. పూర్వం కప్పల్ని తూచటానికి ఎవడో ప్రయత్నించేడట. ఒకకప్పని త్రాసులో పెడుతూ ఉంటే ఇంకో కప్ప కిందకి గెంతేదట. వీళ్ళ వ్యవహారం కూడా కప్పల తక్కెడ మేళం లాగా తయారయింది. ఎవరు ఎప్పుడు ఎటు గెంతేస్తారో తెలీకుండా ఉంది.

ఒకరు ముఖ్యమంత్రిని చేస్తామంటే, ఇంకొకరు ప్రధానమంత్రిని చెయ్యటానికి అభ్యంతరం లేదంటున్నారు.మీ దివంగత తండ్రిగారి పేరు ఓ విమానాశ్రయానికి పెట్టి మీ చిరకాల కోర్కె తీరుస్తామని ఒకరంటే, మీ మీద ఉన్న పాత కేసులు మాఫీ చేస్తామని ఇంకొకరు. సందట్లొ సడేమియా అని మన చంద్రశేఖర్ గారు తెలంగాణా ఇస్తామంటే మా రెండున్నర ఓట్లూ మీకే అంటే, తెలిసో, తెలీకో సోనియమ్మ "జై ఆంధ్రప్రదేశ్" అని మొన్నటి సభలో జై కొట్టి టీఆరెస్ ఆశలమీద నీళ్ళు పోసేసింది. ఇంతకమునుపోసారి డబ్బు సంచులు పుచ్చుకొని ఓటేసిన ఒక సిగ్గు,శరం లేని పెద్దమనిషి డబ్బు సంచులా, ముఖ్యమంత్రి పదవా అని ఇటూ అటూ ఊగిలాడి ప్రస్తుతానికి డబ్బు వైపే మొగ్గు చూపేరు. రాష్ట్రరాజకియాలలో చుక్కెదురైన ఒక మాజీ ప్రధాన మంత్రిగారు తన అదీనంలో ఉన్న మూడోట్లూ ఎటువెయ్యాలా అని గురక పెట్టి నిద్రపోతూ మరీ అలోచించేస్తున్నారు. వ్యూహ, ప్రతివ్యూహాలతో రాజధానిలో బొమ్మలాట రంజుగా తయరైంది.

చిన్నపిల్లలు బొమ్మలాట సరదాకి ఆడుకుంటారు. హస్తినలో మన ప్రజాప్రతినిధులది స్వార్ధపూరిత రాజకీయ బొమ్మలాట. అది వాళ్ళకి సరదా. దేశానికి అరిష్టం.

Friday, July 18, 2008

ఆఫ్ లైన్ బ్లాగ్ ఎడిటర్స్

ఇంటర్ నెట్ కనక్క్షన్ లేకుండా బ్లాగు పోస్టు తయారుచేసుకోవడం

బ్లాగ్ ఎడిటర్ లో ( బ్లాగ్ స్పాట్, వర్డ్ ప్రెస్ వగైరా) నేరుగా టైప్ చేస్తున్నప్పుడు మీ ఇంటర్నెట్ కనక్షన్ పోతే బ్లాగు పోస్ట్ లో వ్రాసినదంతా గాలిలోకి పోయి ప్రాణం ఉసూరుమంటుంది కదూ. ఇలా కాకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక " ఆఫ్ లైన్ బ్లాగ్ ఎడిటర్" వాడక తప్పదు. అంతే కాదు. సునాయాసంగా బ్లాగు పొస్ట్ లో మీరు ఉంచిన బొమ్మలు గాని, వీడియోలుగాని ఆఫ్ లైన్ బ్లాగ్ ఎడిటర్ లోని పబ్లిష్ బటన్ నొక్కి బ్లాగుతో బాటు అప్ లోడ్ చెయ్యవచ్చు. మీరు సగం వ్రాసిన బ్లాగుని భద్రపరచుకొని తరువాత మీకు వీలుచిక్కినప్పుడు పూర్తి చేసి పబ్లిష్ చెయ్యవచ్చు. నెట్ కనక్షన్ పైన ఆధారపడటం లేదు కాబట్టి, బ్లాగు వ్రాసే పని తొందరగా చెయ్య వచ్చు. మీరు ఒకటికన్న ఎక్కువ బ్లాగులను ఒకే సారి తయారుగా చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ ఎడిటర్లు " కాపీ పేస్ట్" ప్రక్రియనూ బలపరుస్తాయి.

ఇక కొన్ని ఫ్రీ ఆఫ్ లైన్ బ్లాగ్ ఎడిటర్స్ గురించి.

1. "Windows Live Writer" : దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి .యూనికోడ్ సపోర్ట్ చేస్తుంది. అయితే దీనివి గొంతెమ్మ కోరికలు. దీనికి కావలసినవి:

ఆపరేటింగ్ సిస్టం విన్డోస్ విస్టా గాని, ఎక్స్ పి ( సర్వీస్ పేక్ 2) తో
విన్డోస్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 6 సర్వీస్ పేక్ 1, ఆపైనా
విన్డోస్ ఇన్స్టాలర్

.నెట్ ఫ్రేమ్ వర్క్ ( ఎక్స్ పి కి మాత్రం)

ఇవన్ని కొంచెం పెద్ద ప్రోగ్రామ్స్. ఇన్స్టల్లేషన్ కి నెట్ కనక్షన్ కావాలి.
ఒకసారి ఇన్టాల్ అయితే బాగానే పనిచేస్తుంది. కాని ఫైర్ ఫాక్స్ తో పనిచెయ్యదు.

క్రింది లింకులనుండి విండోస్ లైవ్ రైటర్ కి కావాల్సిన ప్రొగ్రామ్స్ డౌన్ లోడ్ చేసుకోండి.
1. Windows Installer:
http://www.softwarepatch.com/windows/wininstallnt.html

2. .NET Framework:
http://www.filehippo.com/download_dotnet_framework_3/

3. Windows Live writer:
http://get.live.com/WL/config_all

ముందుగా (1), (2) ఇన్స్టాల్ చేసుకొని తరవాత లైవ్ రైటర్ ఇన్స్టాల్ చేసుకోవాలి.

2. Post2blog: ఇది చాలా చిన్న ప్రోగ్రాం. Windows Live Writer లా దీనికి గొంతెమ్మ కోరికలు లేవు. ఆపరేటింగ్ సిస్టం విన్డోస్ ఎక్స్ పి, 2000 అయితే చాలు. ఇన్స్టల్లేషన్ చాలా సులభం. యూనికోడ్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి అకౌంట్ సెట్ చేసుకుంటే చాలు.

బ్లాగ్ పోస్ట్ draft గా గాని, లేక సరాసరి పబ్లిష్ గాని చెయ్యవచ్చు. మన కంపూటరులో భద్రపరచుకోవచ్చు.బ్లాగులో బొమ్మలు ఉంచ వచ్చు. వీడియో కావాలంటే మాత్రం draft గా అప్ లోడ్ చేసి బ్లాగ్ ఎడిటర్ లో జతచెయ్యాలి. ఇది అన్ని విధాలా ఏ బాదరబందీ లేని ప్రోగ్రాం.

3. Scribefire: ఇది ఫైర్ ఫాక్స్ కి plugin. మన బ్లాగు వివరాలు నెట్ ద్వారా తీసుకున్నాక మాత్రమే ఇది off line లో పనిచేస్తుంది. ఎడిట్ చేసిన బ్లాగు పోస్ట్ ను తిరిగి నెట్ ద్వారా మన బ్లాగులో డ్రాఫ్టుగా భద్రపరచుకోవచ్చు. అయితే మన కంపూటరులో భద్రపరచుకోలేం.అంటే ఇది పూర్తిగా off line ఎడిటర్ అని చెప్పలేం.

ఇవి కాక w.blog, blogdesk, flock కూడా ఉన్నాయి. అయితే అవి యూనికోడ్ ని బలపరచవు, కాబట్టి తెలుగు టైప్ చెయ్యటానికి ఉపయోగపడవు. నా ఉద్దేశంలో blog2post మనకు అన్ని విధాలా సరిపోతుంది. ప్రయత్నించి చూడండి. దీనిని http://bytescout.com/post2blog.html నుండి డౌన్ లోడ్ చేసుకోండి.

మీ బ్లాగింగ్ సుఖమయమగు గాక!

Monday, July 14, 2008

అయ్యో పాపం పసివాడు

సాక్షి దినపత్రికలో ఆదివారం ఏసుక్రీస్తును కించపరిచేలా ఉన్న చిత్రం ప్రచురితం కావడంపై రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు నిరసన వ్యక్తంచేశారు. ఒకచేతిలో సిగరెట్టు, మరోచేతిలో మద్యం గ్లాసు ఉన్నట్లు ఏసుక్రీస్తు చిత్రాన్ని ప్రచురించడం క్రైస్తవులను అవమానించేలా ఉందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ క్రైస్తవ సంఘాలు సాక్షిపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. వెంటనే పత్రిక ఛైర్మన్‌ జగన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాయి.పత్రిక ఛైర్మన్‌ జగన్‌ దిష్టిబొమ్మను తగులబెట్టారు.కొన్ని చోట్ల సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేసారు.

అసలే వైస్ పైన గుర్రుగా ఉన్న "ప్రజా శాంతి పార్టీ" వ్యవస్థాపకుడు కె.ఆనంద్‌పాల్‌ గారు "తప్పుచేసిన వారికి క్షమించే గొప్పగుణం ప్రభువుకు ఉందని, అయితే ప్రభువు ఆత్మను కించపరిచినా, క్షోభపెట్టిన వారికి క్షమాపణ లేదనే విషయాన్ని బైబిల్‌ స్పష్టం చేసిందన్నారు. ఇది పొరపాటుగా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభువును ఒక వ్యసనపరుడిగా చిత్రించడం క్షమించరాని మహాపరాధంగా పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం, విలేకరులపై కేసులు పెట్టారని, ఇప్పుడు కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన సాక్షి పత్రిక ఎండీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. "

"ప్రభువా! క్షమించు" అంటూ పత్రికాధిపతి జగన్ సాక్షి 14వ తేదీ పత్రికలో వాపోయాడు.
తాజా వార్త ఏమిటంటే, తెలుగుదేశం ఎస్.సి సెల్ జగన్ పైన, మిగిలిన సాక్షి సంబంధిత అధికారులపైనా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

ఇదంతా చూస్తూ ఉంటే ఆనాడు, ఈ జగన్ పైసాచికానందంతో ఆంధ్రజ్యోతిపై విసిరిన విసుర్లు జ్ఙాపకం వస్తున్నాయి. ఆనాడు ఈ వైస్ పుత్రుడు "బాడుగ నేతలు అంటూ దళితుల మనోభావాలు దెబ్బతీసినందుకే ఈ పరిస్థితి వచ్చింది. పత్రికలు మనం రాస్తున్న వార్తలు సరైనవేనా అని ప్రశ్నించుకోవాలని "అన్నాడు. ఇంకా ముందుకు పోయి "ఒకరిపై బురద జల్లే హక్కు మనకు లేదని, ఉన్నది ఉన్నట్లు రాయటమే మన భాద్యతని ఆయన పత్రికలకు నీతులు చెప్పేడు. మరి వీరు ఉన్నది ఉన్నట్టే చూపేరా? కళ్ళుమూసుకొనే కదా ఈ పని చేశారు! ఇది గురివింద గింజ సామెతలా ఉంది. అసలు తనేంటో, ఈ వైభవం వెనుక కధేంటో ప్రభువు సన్నిధిలో ప్రశ్నించుకోవాలి.

పసివాడా! అయ్యో పాపం పసివాడా! ఎరక్కపోయి అన్నావే ఇరుక్కుపోయావే!

Saturday, July 12, 2008

పోలీసు పిల్లుల చెలగాటం - అమాయికునికి ప్రాణ సంకటం

గత రెండు నెలలనుండి మీడియాకి మేత అందించిన ఆరుషి హత్యోదంతం, యూపీ పోలీసుల నిర్వాకం చూసేక నాకు పాత తెలుగు సినిమాలలో మనం చూసే ఓ సీను గుర్తుకి వస్తోంది. గ్రామంలో నీళ్ళు పట్టుకుందుకి ఓ మధ్య వయస్కురాలు బావి వద్దకువస్తుంది. ఆవిడ ఓ పెద్ద న్యూస్ చానల్. నోటికేమొస్తే అది వాగడం ఆవిడకి పుట్టుకతో వచ్చిన విద్య. "సూరమ్మొదినా ఇది విన్నావా. ఆ మాయదారి మహలక్ష్మి కూతురు పాలేరు రంగయ్యతో సరసాలాడుతోందిట. ఎప్పుడో వాల్లిదారూ లేచిపోవడం ఖాయం. అసలు వాళ్ళ వంశమే అంత. మహలక్ష్మి ముత్తాతకి ఇంటి పనిపిల్లతో సంబంధం ఉండేదట." ఇలా సాగిపోతుంది ఆవిడ వాగ్ధాటి. అలాగా అని ముక్కుమీద వేలేసుకోవటం అక్కడున్న అమ్మలక్కల వంతు. యూ.పీ పోలిసులు, మీడియాది ఇదే తంతు.
కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే తామే న్యాయముర్తులుగా వ్యవహరించి నిందుతులకు అప్రకటిత శిక్షలు వెయ్యడం పోలీసులకు అలవాటని సరిపెట్టుకున్నా మీడియా బుద్ధి ఏమయింది? కట్టుకధలు అల్లటం, వాటికి మసాలా దట్టించి ప్రజలలోకి వదలడం మీడియాకి అలవాటయిపోయింది. రాజేష్ తల్వార్ విషయంలోనూ ఇదే జరిగింది.

ఏభై రోజుల క్రిందట నోయిడా లోని దంత వైద్యుడు రాజేష్ తల్వార్ తన స్వంత కూతురిని హత్య చేసాడంటూ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి వాళ్ళ దగ్గరున్న సాక్ష్యం ఏమిటంటే వాళ్ళు విచారించిన కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం. ఇది చాలు మన మీడియా వాళ్ళకి. ఇంక కధలు అల్లడం మొదలు పెట్టారు.రాజేష్ తల్వార్ కి మరో డాక్టరమ్మకి అక్రమ సంబంధం ఉందని. అది తెలిసి కూతురు అతనితో వాగ్వాదానికి దిగిందని, అదే హత్యకి కారణమని ఇలా. రాజేష్ తల్వార్ భార్య తన భర్త ఈ హత్య చెయ్యలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఉత్తరప్రదేశ్ ఐ.జి గారు ప్రత్యేకంగా ఓ మీడియా సమావేశం ఏర్పరచి పై వాదనలన్నిటికీ బలం చేకూరుస్తూ ఈ కేసులో తాము ఎంత వేగంగా ముందుకు పోతున్నామో విశదీకరించారు. ఈ వార్తపై స్పందిస్తూ కొందరు సంఘసేవకులు రాజేష్ తల్వార్ ని ఉరితీయాలని, అలాచేస్తే ఇంకెవరూ ఇలాంటి దుర్మార్గాలు చెయ్యరనీ ఆవేశంగా సెలవిచ్చేరు.

అయితే, సి.బి.ఐ కీ కేసు అప్పగించాక పరిస్తితులు తారుమారయ్యాయి. వాళ్ల విచారణలో తేలిందేమిటంటే రాజేష్ తల్వార్ హత్యచేసాడనటానికి నోయిడా పోలిసుల వద్ద ఏ రకమైన ఆధారాలు లేవని, ఈ హత్యకు మూలకారకుడు రాజేష్ తల్వార్ వద్ద పనిచేస్తున్న కాంపౌండరు మరి ఇద్దరు కావచ్చని.

రాజేష్ తల్వార్ ని బెయిల్ మీద వదిలేశారు. నోయిడా పొలీసులు తమ తప్పు ఏమీ లేదని, కేసుని ఓ కొలిక్కి తెస్తున్న సమయంలో సి.బి.ఐ కి బదిలీ చేశారనీ, తాము రాజేష్ తల్వార్ ని అనుమానించేమేగాని ఏ విధమైన చార్జిషీటు అతనిపై ఫైల్ చెయ్యలేదనీ చేతులు దులుపేసుకున్నారు. అయితే అతను గత ఏభై రోజులు అనుభవించిన నరకయాతనకు బాధ్యులెవరు? స్వంత కూతురిని చంపేడన్న అపవాదు ఎలా తుడుచిపెట్టుకొని పోతుంది?సంఘంలో ఉన్న పరువు మర్యాదలు మంటగలిసేక అతను తల ఎత్తుకు తిరగగలడా? సంఘంలో ఒక అంతస్తు ఉన్న వ్యక్తికే ఇలా జరిగితే మరి సామాన్యుల మాటేమిటి? పోలిసుల చిత్రహింసలను భరించలేక తప్పు తనదేనని ఒప్పుకో వలసిందే కదా? ఒక వ్యక్తి జీవితాన్ని బజారుకు ఈడ్చిన పోలీసులకి, కట్టుకధలు అల్లిన మీడియా వాళ్ళకి శిక్షలేదా? పోలీసు, న్యాయ వ్యవస్తలలో ఉన్న కుళ్ళు, లోపాలు దీనికి కారణం కాదా? అన్ని రంగాలలోను మనం పురోగమిస్తున్నామని జబ్బలు చరచుకుంటున్న ప్రభువులు ఈ రంగంలో ఎంత వెనుకబడి ఉన్నామో గ్రహించరా? సైన్సు ఇంత పురోగతి సాధించినా పాత పద్ధతులలోనే నేర పరిశోధన జరగడం మనం సిగ్గుపడాల్సిన విషయం కాదా? వందమంది నేరస్తులను వదిలేసినా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది కాగితాలకే పరిమితమా?

ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు.

Sunday, July 6, 2008

భారతీయ సంస్కృతిని వెక్కిరిస్తున్న సూడోసెక్యులరిస్టులు

సెక్యులరిజానికి కొత్త భాష్యం

నిజానికి సెక్యులరిజమ్ అంటే మతాలతో ఏ విధమైన సంబంధమూ లేనిది - అది మెజారిటీ ప్రజలదైనా మైనారిటీ ప్రజలదైనా. సెక్యులర్ ప్రభుత్వం ప్రతీ వ్యక్తికీ రాజ్యాంగంలో నిర్వచించిన మౌలిక సూత్రాలకు లోబడి తాను నమ్మిన మతాన్ని ఆచరించే స్వేచ్చ యిస్తుంది. సెక్క్యులరిజం అన్నది మన భారతీయ సంస్కృతిలో పురాతనంగా వస్తూన్న సంప్రదాయమే. పరమత సహనం భారతీయ జీవనంలో ఒక అంతర్భాగంగానే ఉంది.దీనిని ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీలుగాని, మేధావులమని చెప్పుకునే విషయ పరిజ్ఙానం లేని పెద్ద మనుష్యులు గాని గొంతు చించుకొని చెప్పనక్కరలేదు.

1976 లో సవరణ చేసి సెక్యులరిజమ్ అన్న పదం చొప్పించక ముందు కూడా మన రాజ్యాంగం మతాతీతమైనదే. ఈ సవరణ వెనుక ఉన్న దుర్ణీతి త్వరలోనే బయట పడింది.
సెక్యులరిజం అన్న పదానికి విపరీత భాష్యాలను చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దాని స్వరూప స్వభావాలనే మార్చేసారు. మైనారిటీలను ఆకట్టుకొని తమ వోటు బేంకుని విస్తృత పరచుకుందుకే ఈ రాజ్యాంగ సవరణ వాడుకోవటం ప్రారంభించారు. ఈ "సూడో సెక్యులరిస్టు" పార్టీలు ఈ పదానికి వేరే అర్ధాన్ని ఆపాదించి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నాయి. సెక్యులరిజమ్ అంటే మైనారిటీలను దువ్వడం, వారికి ఏవో తాయిలాలు ప్రకటించడం అన్న భావన కలిగించేరు. వారికి మతపరంగా కొన్ని సదుపాయాలను కల్పించటం రివాజు అయిపోయింది. ఈక్రమంలో హిందూమతానికి చెందినవారిని పూర్తిగా వెనక్కినెట్టేసారు. వారికి ఏవైనా సౌకర్యాలు కల్పించడమంటే మైనారిటీలను అగౌరవపరచడం "సెక్యులరిజం" పాటించకపోవడం అన్న విపరీత అర్ధాన్ని లేవనెత్తేరు.

ఈ నాడు కాంగ్రెస్, లెఫ్ట్ మరియు వాటి తోక పార్టీలు. అధికార పీఠం అధిష్టించడానికి ఏ నీచానికైనా ఒడిగట్టడానికి సిద్ధంగా ఉన్నారు.దేశంలో ఉన్న హిందూ ధార్మిక సంస్తల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. వాటి నిర్వహణ; చివరకు వాటి ఆదాయం ఖర్చు విషయాలను ప్రభుత్వమే నిర్దేసిస్తోంది.
ఇది ఎంతవరకు పోయిందంటే తిరుమల తిరుపతి దేవస్తానం చైర్‍మన్ గా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండటం ఈమధ్య తమ పదవులు పోకుండా నిలుపుకోటానికి చేసిన "ఆఫీస్ ఆప్ ప్రాఫిట్" చట్టం ప్రకారం ప్రశ్నించలేని హక్కుగా చేసేసారు. అలాగే తామేదో దేశ సెక్యులర్ వ్యవస్తకు రక్షకభటులమని కాలరెగరేస్తున్న కేరళలోని ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం శబరిమలై నిర్వహణలో వేలుపెట్టటానికి ప్రయత్నిస్తోంది. కళ్ళుండీ తన నల్ల కళ్ళజోడు నుండి చూడలేని గుడ్డివాడు తమిలనాడు ముఖ్యమంత్రి ఒక వదరబోతుగా ప్రవర్తించాడు. రాముడు ఏ కాలేజిలో చదివేడు? రాముడు తాగుబోతు కాదా? ఇటువంటి కుళ్ళుబోతు ప్రశ్నలు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతిసే ప్రయత్నంచేశాడు.

ఇది అదనుగా తీసుకొని ఈ నాడు ( కేంద్ర, రాష్ట్ర ప్ర్భుత్వాల ప్రొత్సాహంతో) క్రిష్టియన్ మిషనరీలు హిందువులను, ముఖ్యంగా గిరిజనులను మతమార్పిడికి గురుచేస్తున్నారు. తిరుపతిలో, పద్మావతీ విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటనలు ఈ నీచ ప్రవృత్తికి నిదర్శనాలు.

హిందూధర్మాన్ని ఎంత కించ పరుస్తే అంత గొప్ప సెక్యులరిజం అని వీళ్ల అభిప్రాయం. ఇదే తమకు ఓట్లు రాలుస్తుందని వీళ్ళ నమ్మకం. ఇంత నీచ సంస్కృతిని సెక్యులరిజం అనడం ఇంకా నీచం. ఈ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళూ, కమ్యునిస్టులు, వాళ్ళ తోకలు ప్రస్తుతం గుర్తెరిగే స్తితిలో లేరు. వీరంతా సెక్యులరిజం ముసుగులో భారతియ సంస్కృతిని వెక్కిరిస్తున్న జాతి విద్రోహులు.

Friday, July 4, 2008

రాజశేఖరుని సువార్తావాణి

కలక్టర్లకు ముఖ్యమంత్రి సుద్దులు

మొన్నీమధ్య ముగిసిన జిల్లా కలెక్టర్ల వార్షిక సమావేశంలో మన రాజశేఖరుడు ఐఏస్ లకు రాజకీయ సుద్దులు వళ్ళించేడు. ఈ షట్ సూత్రాలను తిలకించండి

1. "ఇది ప్రభుత్వ కార్యకలాపాల సమీక్షకు సంబంధించిన సమావేశం. ఇందులో రాజకీయ ప్రసంగాలు చెయ్యకూడదు."

తాత్పర్యం: మీరు రాజకీయ ప్రసంగాలు చెయ్యకూడదు. సమావేశంలో ఆ పని చెయ్యాల్సింది నేను, నా మంత్రులు.

2. "ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడా కనిపించలేదు. పార్టీ బలహీనంగా ఉన్న చోట కూడా మంచి మెజారిటీతో గెలిచాం. మొన్న నలభయ్యో, నలభై ఒకటో అసెంబ్లీ స్తానాల పరిధిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇది నిరూపణ అయింది."

తాత్పర్యం: వ్యతిరేకించే వాళ్ళకి ఇంత విదిలించో, వీలుకాని చోట మావాళ్ళచేత కేసులు పెట్టించో ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాం. మీ తరఫున మీరు పూర్వంలాగే ఈ విషయంలో పాటుపడి ఓ రెండొందల ఏబయ్యో ఎన్నో అసంబ్లీ సీట్లు, ఓ నలభైరెందో ఎన్నో పార్లమెంటు సీట్లు వచ్చేట్టు చెయ్యాలి.

3. "కొన్ని పత్రికలు అదే పనిగా మాకు మంచి పేరు రాకూడదని ప్రచారం చేస్తున్నాయి. పనికట్టుకొని కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి."

తాత్పర్యం: ఈ ప్రజాసామ్యంలో బురద చల్లడం అందరిహక్కు. అందుకే మా సుపుత్రుడు చేత ఓ పేపరు పెట్టించా. మా తరఫున ఆ పని చెయ్యటానికి. బురద అంతగా ఎక్కువైతే కడగటానికి నా కేబినట్ సహచరులుండనే ఉన్నారు. దీనికి రోశయ్యగారి అద్యక్షతన ఓ కమిటీ కూడా వేశాం.

4. "మార్చి, ఎన్నికలకు పోవాల్సిన సమయం. అప్పటికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పనులు పూర్తి చేయండి."

తాత్పర్యం: అప్పటికి మాకు రావాల్సిన ముడుపుల వసూల్లు పూర్తిచేయండి. ప్రస్తుత వసూళ్ళు అధిష్టానానికి అర్పించడానికే సరిపోయాయి. మరి మాకు, ఎన్నికలకు డబ్బు కావాలిగా.

5. "ప్రజల సమస్యలను చర్చించేందుకే కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశాం." ఆర్ధిక మంత్రి రోశయ్య , వైస్ తరఫున వకాల్తా.

తాత్పర్యం: పార్టీ శ్రేయస్సు ప్రజల శేయస్సు కాదా? అందుకే మా వాళ్ళ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నాం. దీనిని తప్పుపట్టేవారికి రాజకీయా పరిజ్ఞానం లేదని విశదమవుతుంది. మన వైశ్యశిఖామని విశదీకరణ.

6. "అవినీతి నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఏ స్థాయిలోనూ అవినీతిని సహించ వద్దు. రాజకీయ ఒత్తిల్లకు లొంగ వద్దు."

తాత్పర్యం: ఒక్క మా విషయం లో తప్ప.

వైస్ మాటలకు అర్ధాలు వేరులే అన్నది స్ఫురద్రూపులు ఐఏస్ లు ఇట్టే గ్రహించేశారు. వారి వారి జిల్లాలకు పోయి వారి విధులలో ( అదే షట్ సూత్ర ప్రణాలిక అమలు) మునిగిపోయారు.

Wednesday, July 2, 2008

మేధోమధనం

- సాఫ్టువేర్ డెవలపర్స్ కి మంచి అవకాశం

మేఘాలను మధిస్తే వర్షం వస్తుంది. ఇదీ అందరికీ తెలిసిన విషయం. దీనికి దీటుగా ఇప్పుడు "మేధోమధనం" రాజకీయాలలో ప్రారంభమయింది. ముఖ్యంగా పార్టిలు పెట్టేవారికి ఇది తప్పనిసరి. ఎందుకంటే వాళ్లకి రాజకీయ పరిజ్ఞానం తక్కువ. అదీకాక ఓపిక, కాలం కరువయింది. వీళ్ళకి దిశానిర్దేశం చెయ్యటానికి ఈ కొత్త రాజకీయ కన్సల్టన్సీ సర్వీసులు పుట్టుకొచ్చేయి. మొన్న టి.ఆర్.యస్ చంద్రశేఖర్ నుండి నేటి దేవేందర్ గౌడ్, చిరంజీవి వరకు ఈ కన్సల్టీ సర్వీసులను ఆశ్రయించక తప్పటం లేదు. ఎలాగైతే మిగిలిన కన్సల్టన్సీ సర్వీసులు ఒకరికన్న ఎక్కువమందికి తమ సేవలను అందిస్తాయో, అలాగే ఇవి కూడా చేస్తున్నాయి. రాజకీయ కన్సల్టీ సర్వీసులో ఇదో వినూత్న ప్రక్రియ. టి. ఆర్. ఎస్. సిద్దాంత కర్తగా వ్యవహరించిన ప్రొఫెసర్ జయశంకర్ ఇప్పుడు దేవేందర్ గౌడ్ కి కూడా తమ సర్వీసుని అందిస్తున్నారు. ఈయనిది తెలంగాణా కన్సల్టీ సర్వీసు. తెలంగాణా కోసం పాటుపడే వారెవరికైనా తమ సర్వీసు ఉంటుందన్నారు. చిరంజీవి విషయంలో రాజకీయ సలహాదారు డా.మిత్ర ఈ సర్వీసు అందిస్తున్నారు. మార్క్సిస్టు మేధావులుగా చెలామణి అవుతున్న విఠల్‌, బ్రహ్మారెడ్డిలు సైద్ధాంతిక సహకారం ( దీనిని సైద్ధాంతిక సహకార సర్వీసు అందామా) అందిస్తున్నారట. ఇక పోతే ఆయన బంధుగణం రాబోయే పార్టీ ప్రచార సర్వీసు తీసుకున్నారు. అన్నట్టు తాజాగా వారణాసి జ్యోతిష్కులు రాజకీయ నాయకులకు అతి ముఖ్యమైన "జ్యోతిషం సర్వీసు" తీసుకున్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవతాడని జ్యోతిషం కూడా చెప్పేసారు. రాజకీయాల ధర్మమా అని ఇలా ఎన్నో కొత్త కన్సల్టన్సీ సర్వీసులు వస్తున్నాయి.
ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉండటం, వ్యాపారానికి పెట్టుబడి పెట్టే సామర్ధ్యం లేకపోవడం "ఐటి" లో మాంద్యం - ఇవన్నీ చూసిన యువకులు ఈ పెట్టుబడిలేని వ్యాపారంవైపు మొగ్గుచూపే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది. మన కంప్యూటరు నిష్ణాతులు ఈ కన్సల్టన్సీ సర్వీసులకోసం సాఫ్టువేరు కూడా తయారుచేస్తున్నారని వినికిడి.