Monday, June 30, 2008

కుక్క కాటుకి.....


కుక్కలు వాసనను పసికడతాయని మనందరికీ తెలిసిన విషయమే. కాని రాజకీయ కుక్కలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఎం.పి ఉండవల్లి అరున్ కుమార్ గారు దీనిని ఋజువు చేసి చూపారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పైన కొంతకాలం క్రిందట ఆరోపణలు చేసినప్పుడు, వారు "తనకు కుక్కలా పసికట్టే గుణం ఉందని, అవినీతి ఎక్కడ ఉన్నా పసికట్టేస్తానని" అన్నారు. అయితే విచిత్రమేమిటంటే వీరికి తక్కినవాళ్ళ అవినీతి గురించి పసికట్టే గుణం ఉందికాని తన స్వంత కాంగ్రెస్ పార్టీవాళ్ళ అవినీతి పసిగట్టే గుణం లేదు. పాపం! ఈ విషయంలో ఈయన శక్తి కుక్కకున్న శక్తి కన్నా తక్కువన్నమాట! వీరు తాజాగా ఆంధ్రజ్యోతి అవినీతి పసిగట్టారు! వారి అక్కౌంట్లుచూడటానికి ప్రస్తుతం ఉద్యుక్తులవుతున్నారు.ఇవన్నీ రాజకీయ ప్రత్యర్ధులు, తమ కుతంత్రాలను బయటపెట్టే పత్రికలపై పగ తీర్చుకుందుకు పాలక కాంగ్రెస్ పార్టీ ఉసికొలిపిన శునకరాజాలని ప్రజలనుకుంటున్నారు.ఈ కుక్క కాటుకి మందేదో అందరికీ తెలిసిన విషయమే!
ఇక పోతే వీరు " ఈనాడు" రామోజీరావుపై కక్ష సాధించేందుకు ఒక టివి సీరియల్ తయారుచేసారు. అందులో రామోజీరావు పాత్రధారి సగంలో హాండు ఇచ్చేశాడు. వేరొకరితో తీసారు. దానిని ప్రదర్శించడానికి మొదట ఒప్పుకున్న టీవీ చానల్ వాళ్ళు కూడా తరువాత మా వల్ల కాదన్నారు. ప్రస్తుతం ఏ టివి వాళ్ళు ముందుకు వస్తారా అని చూస్తున్నారు. మరి "జగన్ టివి" వస్తే వాళ్ళు ప్రదర్శిస్తారేమో!

Saturday, June 28, 2008

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు

దోపిడీలొనూ హైటెక్ పద్ధతులు - రాష్ట్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ప్రభుత్వం తన దోపిడీ విధానానికి హైటెక్ పద్ధతులను ఆచరించటానికి తయారయ్యింది. ఇక భూముల వేలం " ఆన్ లైన్" లో నిర్వహిస్తుందట. దీని వలన పారదర్శకత పెరుగుతుందట. విదేశాలలో ఉన్నవారు సైతం వేలంలో పాల్గొనవచ్చునట.ఇవన్నీ ప్రభుత్వం వైపునుండి వినిపిస్తున్న వాదాలు. అయితే అసలు విషయం వేరన్నది తలకాయలో కాస్త బుద్ధి ఉన్న వాళ్ళెవరైనా గ్రహిస్తారు. టెండరు ప్రక్రియ వలన కాలయాపన జరిగే అవకాశం ఉంది. ప్రతి పక్షాలు అడ్డుకొనే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో అమ్మాల్సిన భూములు చాలా ఉన్నాయి. కాని తమ వద్ద ఉన్న కాలం తక్కువ. ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చు. దీని వలన తమ ఆశయాలు నెరవేరక పోవచ్చు. ఇవన్నీ ప్రభుత్వం భయాలు. అందుకే ఈ హైటెక్ దోపిడీకి తహ తహ. వీలైనన్ని భూములమ్మి డబ్బు దోచుకోవాలి. ఆ డబ్బులో కొంత భోంచేయవచ్చు. కొంత రాబోయే ఎన్నికల ఖర్చుకి పనికొస్తుంది. ఐటితో ఎన్నిలాభాలో.

విపక్షాలు తాము కూడా హైటెక్ పద్ధతిలోనే అడ్డుకుంటామని అంటున్నాయి. మరి వాళ్ళ హైటెక్ వ్యూహం ఏమిటో!

ఇదంతా చూస్తూ ఉంటే నిజంగానే వైస్ చెప్పినట్టు త్వరలోనే మన రాష్టం ఐటిలో నెంబర్ వన్ స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తొంది! శుభం!!

Thursday, June 26, 2008

చిందులువేయకురా కృష్ణా.....

ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రికాఫీసులపై దాడులు తదనంతర పరిణామాలు కొన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దలితనేతగా ఛలామనీ అవుతున్న మందకృష్ణమాదిగ వ్యవహారం ఏదో "మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు" ఉంది."బాడుగనేతల" శీర్షికతో తన రహస్యాలను బట్టబయలు చేసారన్న ఉక్రోషంతో ఆంధ్రజ్యోతి కార్యలయాల మీద తన అనుచరునలను ఉసిగొల్పి అక్కడ విధ్వంసకాండ చేయించి పైగా జర్నలిస్టులు తన దిష్టిబొమ్మను తగలపెట్టారని వాపోవడం.
ఈ విధ్వంసానికి కారకులైనవారి మీద ఏవో కేసులు పెట్టామని, చూస్తున్నామని పోలిసులు చెప్పడం, మందకృష్ణుని ఫిర్యాదుమేరకు "అట్రాసిటీ"చట్టం కింద ఆంధ్రజ్యోతి సంపాదకుడు, ఇద్దరు రిపోర్టర్లను అరెస్టు చేసామనని చెప్పడం ఇదంతా ఒక నాటకమని ప్రతిఒక్కరికి తెలుసు. ఇదంతా ప్రభుత్వంతో జతకూడి పోలిసులు చేస్తున్న పని అన్నది జగద్విదితం. ప్రతీ కధలోను ఒక నీతి ఉన్నట్టు, ఈ నాటక కధలో ఒక ప్రమాదకరమైన సంకేతం దాగి ఉంది. దలితులు అరాజకాలు చేసినా అది వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. కాదంటే "అట్రసిటీ" చట్టం క్రింద కేసులు పెట్టించి కాదన్నవారిని జైలుకు పంపవచ్చు. ఓట్లకోసం ఏ పాడుపనికైనా సిద్ధపడే ప్రభుత్వం ఇందుకు తన సహకారం ఇస్తుంది.దలితుడి దిష్టిబొమ్మ తగలపెడితే అది అన్యాయం. దలితుడు వేరేవాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెడితే అది వారికి చట్టం ప్రసాదించిన హక్కు. వాళ్ల హక్కులకోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తే మంచిదే. అంత మాత్రాన విద్రోహానికి పాల్పడటానికి ఏ రాజ్యాంగం వీరికి హక్కు ఇచ్చింది? పత్రికలు తమని, తమ చేష్టలని ఎప్పుడూ మెచ్చుకోవాలని అనుకుంటే అది అహంకారం మాత్రమే.
ఈ అహంకారం మందకృష్ణునికి బాగా తలకెక్కింది. నిప్పులు తొక్కిన కోతిలాగ గంతులు వేస్తున్నాడు."ఆంధ్రజ్యోతి" ఎండీని తక్షణమె అరెస్టు చెయ్యాలి లేదంటే ఆంధొలన తప్పదని, జర్నలిస్టు నాయకులు యాజమాన్యాలకు తొత్తులుఅనీ, చిరంజీవికి అమ్ముడు పోయారు అనీ, బాబు, కేసిఆర్ లను తిరగనివ్వం అనీ, గద్దర్ నువ్వు అసలు దలితుడవేనా అని - ఈ రకంగా చిందులు వేస్తున్నాడు.
ఈ ఉదంతం పత్రికాస్వేచ్ఛకు విఘాతం. పోలీసుల జులుంకి తార్కాణం. ప్రభుత్వ ఓటుబేంకు రాజకీయాలకు నిదర్శనం.

Wednesday, June 25, 2008

ఆంధ్రజ్యోతిపై అర్ధరాత్రి దొంగ దెబ్బ

ఇందిరమ్మ తన పదవి నిలిపుకోడానికి 1975 లో దేశం మీద అర్ధరాత్రి రుద్దిన ఎమర్జెన్‍సీ 33వ వర్ధంతి జరుపుకోబోయే శుభతరుణంలో వైస్ తన ప్రియతమ నాయకురాలి అడుగుజాడలలో అటువంటి ఒక హీనమైన చర్యకు పాల్పడ్డారు. ఆనాడు ఆవిడ తన అడుగులకు మడుగులొత్తని పత్రికల పీకనొక్కేరు. ఈ నాడు అదే దారిలో నడుస్తూ మన వైస్ ఒక కుంటి సాకుతో ఆంధ్రజ్యోతి సంపాదకుడని, ఇద్దరు రిపోర్టర్లని రాత్రిపూట అరెస్టు చేయించాడు.రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రాత్రిని ఆవిష్కరించాడు. తన కుళ్ళు బుద్ధి మరొసారి బైట పెట్టుకున్నాడు. ఆయన గులాములు పోలీసులు "ఇందులో రాజకీయమేమీ లెదు అంతా చట్ట ప్రకారమే చేసాం" అని జోకులేస్తున్నా ఇటువంటి చర్య పెద్దాయన ఆశీర్వచనం లేందే ఎవరూ సాహసించరన్నది సుస్పష్టం.తనకు సరిపడని పత్రికలను ఏదో ఒక రకంగా తన దారికి తెచ్చుకుందుకు మొదటినుండీ ప్రయత్నిస్తున్న ఈ కాంగ్రెస్ (వి)నాయకుడు నాడు "ఈ నాడు" నేడు ఆంధ్రజ్యోతి పత్రిలపై కాలు దువ్వుతున్నాడు. అందులో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయి. లేకపోతే "దొంగ వెళ్ళిన ఆర్నెల్లకు కుక్క భౌ అని ఆర్చినట్టు" అంధ్రజ్యోతి ఉద్యోగులు తన పోస్టర్లను కాలుతో తొక్కి, చెప్పులతో కొట్టి అవమానపరిచారంటూ వారిని అట్రాసిటి చట్టం కింద అరెస్ట్ చేయాలని మందకృష్ణ కేసు నమోదు చేసిన నెల తరువాత రాత్రి ఎడిషన్ తయారయ్యే సమయంలో వచ్చి పత్రికా సంపాదకుని అరెస్ట్ చేయడమేమిటి? అధికారంలో ఉన్న రాజకీయనాయకులకు తొత్తులుగా వ్యవహరించే పోలీసులకు ఇన్నాళ్ళ తర్వాత తెలివి రావడనికి కారణం ఈ మందకృష్ణుడు పోలీసుల చుట్టూ తిరుగుతూ ఆంధ్రజ్యోతి పైన చర్య తీసుకోవాలని పట్టుపట్టడం ఇదే అదను తమ పగతీర్చుకోవచ్చని ప్రభుత్వం భావించడం. తమాషా ఏమిటంటే, ముందర ఆంధ్రజ్యోతి ఆఫీసుపై దాడి చేసి విధ్వంసాన్ని సృష్టించిన వాళ్ళను, వెనుక ఉండి దానిని నడిపిన మందకృష్ణను వదిలేసారు, నీతులు వళ్ళిస్తున్న ఈ పోలీసు అధికారులు.
అట్రాసిటీ చట్టాన్ని ఇలాంటి కుంటి సాకులతో రాజకీయ ప్రయోజనాలకు వాడటం చాలా ప్రమాదకరమైన చర్య. "మాకు చట్టం ఉంది, పోలీసులు మాచుట్టాలు" అనుకొని ఇష్టారాజ్యంగా దుష్ట కార్యాలను తలపెడితే ఎవరూ హర్షించరు. దెబ్బ తినక తప్పదు. ఈ విషయాన్ని ఈ కులాలకు నాయకులమని విర్రవీగుతున్న వాళ్ళు గుర్తిస్తే వారికే మంచిది.

Monday, June 23, 2008

వార్తలు - వ్యాఖ్యలు


పాపం చిరంజీవి!
చిరంజీవి రాజకీయ ప్రవేశం కాకుండానే అతనిపై ఆరోపణల పర్వం ఆరంభమైంది.వైఎస్ మంత్రులు మారెప్ప, గీతారెడ్డి ఆయనపై దుమ్మెత్తిపోయడం ప్రారంభించేరు. బ్లడ్ బేంకుతో సమాజసేవ అని చెప్పి అభిమానుల రక్తంతోటి ధనార్జన చేస్తున్నాడని, భూములు కబ్జా చేసాడని ఇంకా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా అధినాయకుని ప్రొత్సాహంతోనే జరుగుతున్నాదని చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. యధాశక్తి వాళ్ళ దిష్టిబొమ్మలు తగలెట్టి నాయకునియందు తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు."అందరినీ కలుపుకు పోవాలి" అనే పిసిసి అద్యక్షుడు, ఎందుకేనా మంచిదనే ముందుచూపుతో కాబోలు వారిని వారించే ప్రయత్నం చేసారు. ఇప్పుడే ఇలాఉంటే ముందు ముందు తన ఇమేజ్ ఏమవుతుందో అని మెగాస్టారు ఆరాటపడటం సహజం. ఆయనకు దిశానిర్దేశం చేసే పెద్దలు ఇటువంటివి ఎలా ఎదుర్కోవాలని ఆలోచనలో పడ్డారని వినికిడి. జనంచేత జేజేలు కొట్టించుకోవడమే తెలిసిన చిరు రాజకీయలు ఇంకా వంట పట్టించుకోవసివుంది. "దున్నపోతుమీద జడివాన పడితే" అదెలా దులుపుకు పోతుందో ఆ స్వభావం బాగా జీర్ణించుకున్న మిగతా పార్టీల నాయకులను చూసి నేర్చుకోవలసి ఉంది. తప్పవు నాయనా ఇవన్నీ రాజకీయాలలో!

Thursday, June 19, 2008

మద్యం మత్తులో జోగుతున్న ప్రభుత్వం

ఎన్నికల ముందు మద్య నిషేదం అంచెలంచెలుగా అమలు చేస్తామన్న వైస్ ప్రభుత్వం మద్యం ద్వారా  ఆదాయాన్ని పెంచుకుంటోంది. మొన్న జరిగిన టెండర్ల భాగోతం ఈ ప్రభుత్వ అసలు రూపం బయట పెట్టింది. మద్యం తమ పాలిట బంగారు బాతని భావిస్తోంది సర్కారు. ఆదాయం విపరీతంగా పెరగబోతున్నందుకు చంకలు గుద్దుకుంటోంది. అధినాయకుని తెలివితేటల్ని మంత్రులు, కాంగ్రెసు (వి)నాయకులు వేనోళ్ళ ప్రసంసిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు inkanimpu మూలధనం చేకూరినందుకు అమితోత్సాహంతో పండగ చేసుకుంటున్నారు. ఇదేమి అన్యాయం అన్న వాళ్లని అడుగులకు మడుగులొత్తే పోలిసుల  సహకారంతో అరెస్టు చేయిస్తున్నారు. ఈ పాపం తమది కాదు అంతకు ముందున్న ప్రభుత్వానిదంటున్నారు.  అంతేగాని తాము ప్రభుత్వంలోకి ఏ వాగ్ధానం చేసి వచ్చేరో మద్యం మత్తులో మరచిపోయారు. గాంధీకి రాజకీయ వారసులమని చెప్పుకునే ఈ కాంగ్రెస్,  గాంధీ స్వరాజ్య సమరంతో పాటు మద్యానికి వ్యతిరేకంగా సమరం సాగించేడన్నది మరచిపోయారు.  మరపు కాదు మదం. తమర్ని ఎవరూ ఏమీ చెయ్యలేరని ధీమా.
పులి తోలు కప్పుకుంటే నక్క పులి అవుతుందా. ఖద్దరు కట్టేసి, కండువాలేసుకొని, టొఫిలు పెట్టుకొంటే గాంధీ వారసులుకారు.  పేరు చివర గాంధీ అని రాసేసుకుంటే వీళ్ళు గాంధీలు కాలేరు.

బెల్టు షాపులని ముద్దుగ పిలవబడే లైసెన్స్ లేని చిన్న సారా దుకాణాలను పెంచి పోషిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు వాళ్ళ ఆర్ధిక పరిస్తుతులతోటీ ఆటలాడుకుంటున్నారు.

మద్యం మత్తుతో జోగుతూన్న ఈ కాంగ్రసాసురల్నుండి ప్రజలను ఆ దేవుడే కాపాడాలి.

Saturday, June 14, 2008

కుప్పిగంతుల డాన్సులూ -

విరగదీసిన భామలూ

ఈ మధ్య టీవీ చానల్స్ లో ఒక కొత్త ప్రక్రియ ప్రారంభమయింది. అదే మన పల్లెటూళ్ళలో రికార్డింగ్ డాన్సులలాంటివి. ఇందులో ఒక ఆడామె ( ఈమెనే ముద్దుగా సెలిబ్రటీ అంటున్నారు) ఇంకొక మొగ పురుగు ( వీరు కొరియోగ్రాఫర్ ట) ముఖ్యంగా ఊంటారు.ఇటువంటి ఒక ప్రక్రియ ఎలా నడుస్తుందో చూద్దాం.

అది ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్. షో పేరు: "గెంతండి, గెలవండి". ముందుగా ఒక ఏంకరు కుఱ్ఱాడు ఆదరాబాదరాగా స్టేజిపైకి వచ్చి గొంతు చించుకొని ఆరిచేడు. "గెంతండి, గెలవండి షోకి స్వాగతం, సుస్వాగతం" అని. ఆహూతులైన ప్రేక్షకులు చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని ప్రదర్శించేరు. తరువాత ఏంకరు కుఱ్ఱాడు కార్యక్రమ న్యాయనిర్ణేతలకు స్వాగతం పలికేడు. ముగ్గురు జడ్జీలు ఠీవిగా స్టేజిపైకి వచ్చేరు. వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఏంకర్ చానల్ తరఫున సత్కరించేడు. జడ్జీలలో ఒకరు కొంచెం మోడరన్ గెటప్ లో తయారైన ఆడామె. రెండవ వ్యక్తి నడి వయ్స్సులో ఉన్న మొగాయన. ఈయన ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఊంటాడు. మూడవ మనిషి కౌబాయ్ లాగా ఒక టొపీ పెట్టుకొని ఉన్న ముసలాయన. తర్వాత వారు ముగ్గురు న్యాయనిర్ణేతలు తమకు నిర్దేశించిన ఆసనాల్లో సుఖాసీనులయ్యారు. ఇప్పుడు ఏంకరు ఆరిచేడు " ఈ నాటి గెంతండి, గెలవండి కార్యక్రమంలో మొట్టమొదట వస్తున్నవారు జీమ్మీ గారు ( కుక్క కాదండీ, మనిషే) లెట్ అజ్ వెల్‍కమ్ జిమ్మీ". జిమ్మీ నామధేయంగల ఆ "సెలిబ్రటీ" ఒక కొరియోగ్రాఫర్ కుర్రాడితో ( ఆమె వయస్సులో సగం కూడా ఉంటాడో ఉండడో) పరిగెడుతూ స్టేజ్‍పైకి వచ్చింది. మన కుఱ్ఱ ఏంకరు తన వాక్పటిమతో ఆమెని, ఆమె దుస్తులని పొగిడి (అసలు ఉన్నవే కొంచెం) " జిమ్మీగారూ, ఈ రోజు మీరు ఏ సాంగు చెయ్యబోతున్నారు" అని ప్రశ్నించాడు. సదరు జిమ్మీ అష్టవంకరులూ తిరిగిపోయి "నీతోనే లేచి పోతా" లో "నువ్వంటే నాకు ఇదీ అదీ " సాంగు చేస్తా అని చెప్పింది. "చాలా మంచి సాంగు సెలక్ట్ చేసుకున్నావు. ఇంక అదరగొట్టు. విష్ యూ గుడ్ లక్" అని చెప్పి ఏంకరు కుర్రాడు పరుగు పరుగున నిష్క్రమించాడు. సదరు జిమ్మీ న్యాయనిర్ణేతలకు, కార్యక్రమానికి హాజరైన ఆహూతులకీ వంగి వంగి దండాలు పెట్టి తన డాన్స్ ప్రారంభించింది.

మరి అది ఏ రకం డాన్సో తెలీదు కానీ స్టేజి అదిరిపోయేటట్టు జిమ్మీ గెంతేస్తోంది. దానికి సరిపోయేటట్టు కుర్రాడు కూడా కుప్పిగంతులు వేసేస్తునాడు. అప్పుడప్పుడు కుర్ర డాన్సరు తన శక్తినంతా కూడదీసుకొని జిమ్మీ అనే ఆ భారీ శరీరాన్ని రెండు చేతుల్తో ఎత్తి కుదేస్తున్నాడు. జనంలో కొందరు ఆడ మొగా ఆనందం పట్టలేక తమ సీట్లలోంచి లేచిపోయి ఈలలు వేసూకుంటూ వాళ్ళకొచ్చిన డాన్సు వాళ్ళు చేసేస్తున్నారు. ఇక జడ్జీల సంగతి సరే సరి. ఆడ జడ్జీ ఆనందం పట్టలేక ఈల వెయ్యటానికి చూసింది, కాని బాగుండదనుకుందేమో ఆగిపోయింది. ముసలాయన కూర్చునే, టొపీ కిందకు మీదకు తోసుకుంటూ అభినయించడం ప్రారంభించేడు. మూడో ఆయన ఏ భావమూ చూపెట్టకుండా సేరియస్ గా చూస్తున్నాడు. ఆ కుర్రాడు, జిమ్మీ స్టేజీని పశువులు కుమ్మిన కొట్టం లాగా చేసి చివరిలో ఒకరి ఒళ్ళో ఒకరు ఆయాసంతో పడిపోయి అయిందనిపించేరు. ప్రేక్షకుల చప్పట్లు, ఈలలతో తమ ఆనందాన్ని ప్రకటించేశారు. ఏంకరు కుఱ్ఱాడు పరుగు పరుగున స్టేజిపైకి వచ్చి జిమ్మీని వాటేసుకున్నంత పని చేశాడు. " అదరగొట్టాసావు కదా జిమ్మీ, నీలో ఇంత టాలెంటు ఉందని నాకు తెలీదు" అంటూ తన మామ్మూలు డైలాగ్స్ తో జిమ్మీకి షేక్‍హాండు ఇచ్చి మరీ పొగిడేశాడు. సదరు జిమ్మీ కూడా ఆయాసంతో రొప్పుతూ చెమటను చేత్తోనే తుడుచుకుంటూ ఆనందపడిపోయింది. "ఇక మన జడ్జీల కామెంట్స్ విందాం" అన్నాడు ఏంకరు. ఆడ జడ్జీగారు తమ ఆనందాన్ని ప్రకటిచ్తూనే, ఇంకా ఫ్రీగా, హుషారుగా చేస్తే బాగుంటుందన్నారు. ఈమెకు జిమ్మీగారి "ప్రదర్శన" ఇంకా చాలదట. ఇంక చిర్రుబుర్రులాయన వంతు. ఈయన మైకును ఒక వైపుకు వాల్చి సిగరట్టు తాగేవాడిలా నోటిదగ్గర పెట్టుకొని " కాన్సెప్టు అర్ధం కాలేదు, లిప్ మూవ్‌మెంటు సరిగాలేదు." అంటూ కామెంట్స్ చేశాడు, ఏదో కాన్సెప్ట్ ఉన్నట్టూ, లిప్ మూవ్‌మెంటు ఉన్నట్టూ" ఇంక ముసలాయన వంతు. ఆయన సీటులోంచి లేచి స్టేజి పైకి పేంటు పైకి లాగుకుంటూ వెళ్ళి జిమ్మీతో కలసి హుషారుగా డాన్స్‌చెయ్యటం ప్రారంభించేడు. జిమ్మీ కూడా ఆనందంతో పొంగిపోయి జత కలిపింది. పనిలోపని ఏంకరు కుఱ్ఱాడు కూడ రెండు గెంతులు గెంతాడు. ప్రేక్షకులు మహదానందంతో చప్పట్లు కొట్టి ఈలలు వేశారు. ఇంతలో తేరుకొని, ఏంకరు " నెక్స్ట్ పార్టిసిపెంటు వచ్చేముందు చిన్న బ్రేక్" అని వెళ్ళిపోయాడు.

Thursday, June 12, 2008

త్వరలో విడుదల " మీరూ భోంచెయ్యండి"

ప్రముఖ రాజకీయ చిత్ర నిర్మాత, దర్శకుడు శ్రీ వై.ఎస్ గారి మహోజ్వల చిత్రం - " మీరూ భోంచెయ్యండి" విడుదలకు సిధ్ధంగా ఉంది.

నాయకులే భోంచేస్తున్నారని, తమకు చాన్స్ రావడం లేదని కార్యకర్తలకు గుర్రుగా ఉందని కాంగ్రెస్ నాయకులు పదే పదే చెప్పడం ఈ మధ్య వ్యవసాయ శాఖామాత్యులు వారిని సంతోషపరుస్తామని హామీ కూడా ఇవ్వడంజరిగింది. దాని పర్యవసానమే రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ "మీరూ భోంచెయ్యండి" పధకం. ఇంకా "దొరికినంత తినేయండి", " దొరికినంత దోచేయండి" వంటి వినూత్న పధకాలు మన రాష్ట్రప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతుందని అభిజ్ఞవర్గాల భోగట్టా.

ఈ సందర్భంగా వై.ఎస్ గారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించటానికి ఒక మహత్తర రాజకీయ చిత్రానికి అంకురార్పణ చేసారు.

ఈ తాజా చిత్రం " మీరూ భోంచెయ్యండి" విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిత్ర నిర్మాత, దర్శకుడు అయిన శ్రీ వై.ఎస్ గారు చిత్రానికి సంబంధించిన వివరాలు అందించారు.

నిర్మాత: రాష్ట్ర ప్రభుత్వం

స్క్రీన్‍ప్లే, దర్శకత్వం : వై.ఎస్

సహకార దర్శకత్వం: ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు.

ముఖ్యనటీనటులు: రాష్ట్ర మంత్రులు.

గెస్ట్ ఆర్టిస్టులు: కాగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, జిల్లా పరిషత్తు అద్యక్షులు, గ్రామ(వి)నాయకులు మున్నగువారు.

జూనియర్ ఆర్టిస్టులు: కాంగ్రెస్ కార్యకర్తలు

ఈ మహత్తర రాజకీయ చిత్రానికి దాదాపు 992 కోట్ల వరకు ఖర్చు కాగలదని వివరించారు.
ఇందులో హీరోగా వై.ఎస్ గారే నటించడం ఒక విశేషం. హీరొయిన్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది.

ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్టుకి ఐదు లక్షల వరకు పారితోషికం ముడుతుందని వివరించారు.

ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ చిత్ర షూటింగ్ సాఫీగా జరిగేటట్టు ఆయా జిల్లాల కలక్టర్లు విధిగా సహకరించి తీరాలని ప్రభుత్వం ఆదేశాలను జారి చేసినట్టు తెలిపేరు.
వై,ఎస్ గారి అభిమాన సంఘాలు ఈ చిత్ర విడుదలకు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయని భోగట్టా.


Monday, June 9, 2008

ఆడలేక మద్దెలోడు

జలయజ్ఞం పేరుతో ఎడాపెడా సొమ్ముచేసుకుంటున్న వైఎస్ ప్రభుత్వం ఆ పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ దేవాదుల ప్రాజక్టు పైపులైను లీకేజీలు. ఒకసారి, ఒకచోట కాదు, అనేకసార్లు అనేకచోట్ల ట్రయల్‍రన్‍లో లీకేజీలు సంభవించేయి . వీటి వల్ల నీళ్ళు పంట పొలాలను తడపటానికి బదులు దగ్గరలోఉన్న పొలాలను నాశనం చేస్తున్నాయి. మొన్నటికిమొన్న పాలంపేట వద్ద ఎయిర్‍వాల్వ్ లీకేజీ వలన నీళ్ళు ఆకాశంలోకి ఎగజిమ్మేయి . అధికారుల నిర్లక్ష్యం, పనులలో నాణ్యతాలొపం వలన ముందుముందు ఈ ప్రాజక్టు పనితీరు ఎలాఉండబోతోందో రుచి చూపించాయి.

ఇది ఇలా సాగుతూవుంటే మంత్రివర్యులు పొన్నాలవారి వ్యాఖ్యానం ఇంకా దారుణం. దారుణమే కాదు, నిర్లక్ష్యానికి నిదర్శనం. " ఈ లీకేజీలు ఇంకా , ఇంకా బయటపడతాయి. ట్రయల్‍రన్ అంటేనే లోపాలను గుర్తించటం, మరోసారి రాకుండా చూడటం. ప్రాజక్ట్ నిర్మాణమై ప్రభుత్వానికి అప్పచెప్పాక కూడా రెండు సంవత్సరాలదాకా భాధ్యత కాంట్రాక్టర్లదే " అన్నారు సదరు మంత్రివర్యులు. అంటే కళ్ళుమూసుకొని ముందు పనికానిచ్చేయడం. తర్వాత వచ్చే లీకేజీలను పూడ్చుకోవడం. అంతేగాని ఇన్నిసార్లు ఇలా లీకేజీలు రావడం పనిలో లోపాన్ని సూచిస్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం కలగదు.ఈ ప్రభుత్వంలో ఎవరూ దేనికీ భాధ్యత వహించరు. అంతా సవ్యంగా ఉంటే అది మా గొప్పే అని కాలరు ఎగరేసుకొని తిరుగుతారు. తప్పు జరిగితే దాని భాధ్యత అధికార్ల మీదికి నెట్టేస్తారు. అవును మరి వాళ్ళ నైజం ఎక్కడికి ఫోతుంది. డబ్బుదండుకోవడంలో ఉన్న ఉత్సాహం తరవాత ఉండదు.
ఇంతకీ దీని కొసమెరుపు - పొన్నాలవారు లీకేజీలకు కారణం ప్రజలే అనడం.

Friday, June 6, 2008

పెట్రో ధరల పెంపు - అందులో రాజకీయాలు

ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గేసు ధరలను విపరితంగా పెంచేసింది. పాపం మన్ మోహన్ సింగ్ గారు కళ్ళ నీళ్ళ పర్యంతం అయి జాతినుద్దేశించి చావు కబురు చల్లగా చెప్పేరు " మీరు ఈ భారాన్ని మొయ్యక తప్పదు" అని. గత 2 నెలలుగా జరుగుతున్న భాగోతం ప్రజలముందుకు వచ్చేసింది. చిద్విలాసుడు చిదంబరం విజయహాసం చేసాడు. కేంద్రం పన్నులు తగ్గించేదిలేదు అని లుంగీ ఎగ్గట్టి మరీ చెప్పేసాడు.తన వాక్పటిమతో అధినేత్రి నోరు మూసేసాడు. పాపం ఆమె మాత్రం ఏమి చేస్తుంది. ఆ విషయాలన్నీ అర్ధం చేసుకొనే మేధా లేదు, ఓపికా లేదు. అన్నీ తెలిసినా, ప్రధాన మంత్రి గారు ఏమీ చెయ్యలేని పరిస్తితి. వెరసి ప్రజల నెత్తిన శఠగోపం.

ఇప్పుడే అసలు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అధినేత్రి సోనియా కాంగ్రెసు పాలనలో ఉన్న ముఖ్యమంత్రులకు "మీరు వేస్తున్న రాష్ట్ర సుంకాలను తగ్గించి ప్రజల మెప్పుపొందండని" హుకుం జారీచేసారు- . రాబోయే రాష్ట్రాల ఎన్నికలలో తమకి ఎదురుదెబ్బ తగలకుండా ఈ చర్యలు ఉపకరిస్తాయని కాంగ్రెస్ ఆశ. వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రిగారు ఉగులాడుతున్న తన పీఠం, రాబొయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని వంటగేస్‌పై పన్నులు తగ్గించి అదనపు భారం 10 రుపాయలే ఉండేటట్టు చూస్తామన్నారు. మన ముఖ్యమంత్రిగారైతే ( వీరు కొట్టమంటే నరికే రకం కదా)మొత్తం భారాన్ని తామే భరించి వంట గేస్‌పై అసలు పైసా కూడా పెరగనియ్యమన్నారు. దీనికి ఆడపడుచుల సెంటిమెంటు కూడా జతచేసారు. ఇదంతా చూసేక చేసేదిలేక కమ్యూనిష్టులు,భాజపా కూడా తమ వారిని పన్నులు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించ మన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ప్రియురాలి ప్రేమను పొందటానికి హీరో సినిమాల్లో తరచుచేసే ఫీటు గుర్తుకొస్తోంది. ముందు తను నియమించిన రౌడీలు హేరొయిన్ని ఎదుర్కుంటారు. తరవాత హీరోగారు వచ్చి హిరొయిన్ని రక్షిస్తారు. కొంచెం అటూ ఇటుగా ఇదీ అదే తంతు.

Thursday, June 5, 2008

దేశమా నీ గమ్యం ఎటు?

మన దేశానికి స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలొ మనం సాధించింది ఏమిటి? మన గమ్యం ఎటు? ఈ ప్రశ్నలు ఎంతో కలవరపాటుని కలిగిస్తాయి.దీనికి కారణం స్వరాజ్యం వచ్చిన మొదటి రోజుల్లో ఉన్న ఉత్సాహం అడుగంటిపోవడం, ప్రజా శ్రేయస్సుకు పాటుపడాలన్న ఇంగితం పాలకులలో పూర్తిగా లోపించడం, దీని స్థానం లో స్వార్ధం, అవినీతి ,ధన దాహం చోటు చేసుకోవడం. ఈనాటి ఈ దుస్తుతికి గురుతర భాద్యత వహించాల్సినది సుదీర్ఘకాలం పరిపాలన సాగించి దేశ రాజకీయాలను వక్రమార్గానికి మళ్ళించిన కాంగ్రస్ పార్టియే. స్వరాజ్యం వచ్చిన మొదటి రోజుల్లో నెహ్రు, పటేల్ వంటి నాయకులు అంకిత భావంతో జాతికి సేవలనందించారు. సంకుచిత రాజకీయాలకు అతీతంగా జాతీయభావంతో ప్రజాక్షేమానికి పాటుపడ్డారు.ప్రజలలో ఎన్నో ఆశలు రేకెత్తించేరు. కాని జరిగిందేమిటి? తరువాతి రోజుల్లో కుత్సిత రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఈనాటి ఈ దుస్తితికి ఆనాడే శంకుస్తాపన జరిగింది. శంకుస్థాపనన చేసిన ప్రాజక్టుల మాట దేవుడెరుగు, ఈ పాజక్టులు మాత్రం అవిచ్చిన్నంగా కొనసాగుతున్నాయి.
పదవినిలబెట్టుకోవడం కోసం ఎమర్జన్సీని కూడా విధించడానికి దుస్స్సాహసం చేసిన ఇందిరా గాంధీ వ్యక్తిపూజ, నియంతృత్వ ధోరణి, అనువంశిక పాలన వంటి జాడ్యాలను జాతిపై రుద్దారు. పైనుండి క్రిందివరకు అవినీతి, బంధుప్రీతి వ్యాపించి పోయాయి."లంచగొడితనం ప్రపంచమంతా ఉంది దానిగురించి పట్టించుకోనవసరం లేదు" అంటూ ఇందిరాగాంధీ శలవిఛ్ఛారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. అవినీతి అవ్చ్చిన్నంగా "ఇంతింతై వటుడింతై" అన్న చందాన పెరిగి పోయింది. రాజకీయాలకు అవినీతి పర్యాయపదంగా మారిపోయింది. ఎంత విస్తృతంగా వ్యాపించి పోయిందంటే న్యాయాధిపతులు కూడా దీనివ్యాప్తికి తమవంతు సహకారం అందించే కాలం వచ్చేసింది.
రాజకీయ (వి)నాయకులు తమ పబ్బం గడుపుకోవటానికి సమాజాన్ని ఎన్నోరకాలుగ చీల్ల్చేసారు. కులాల పేరుతోటి, మతాలపేరుతోటి ముక్కలు చెక్కలు చేసి విద్వేషాలు పెంచి పోషిస్తున్నారు. విద్య, ఆరోగ్యాలకు నామమాత్రపు నిధులు ఇచ్చి నిరక్షరాస్యతను పెంచి పోషిస్తున్నారు. ఒకడి లేమి రెండో వాడికి కలిమి కదా. ప్రజలు నిరక్షరాస్యులు అఙ్ఞానులుగా ఉంటేనే వీరి ఆటలు సాగుతాయి. దేశనిధులను పరాయి పాలకులకన్నా హేయంగా కొల్లగొట్టుకొని ఈ రాజకీయ రాబందులు స్వైర విహారం చేస్తున్నారు. తమ స్వార్ధ రాజకీయాలకోసం ప్రత్యర్ధులను నిస్సంకోచంగా మట్టుపెట్టటానికి కూడా వెరవడం లేదు.
ఒకప్పుడు ప్రజలు కన్న కలలు ఈనాడు కల్లలుగా మిగిలిపోయాయి. ప్రజల గురించి పట్టించుకొనే నాధుడే కరవయ్యాడు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఈ నాయకులు తమ భవిష్యత్తు, తమవారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రజల భవితను అగమ్యగోచరంగా చేసేసారు. దగా, దోపిడీ స్వైరవిహారం చేస్తున్నాయి. మేధకి స్థానం లేదు. హత్యలు చేసే వాళ్ళూ, ఫాక్షనిష్టులు గూండాలూ మన నాయకులు.
ఆలోచిస్తూ ఉంటే ఈ పరిస్తితులు ముందు ముందు ఎక్కడికి దారితీస్తాయో అన్న బాధ కలుగుతుంది. అందుకే అనుకోవలసి వస్తోంది "దేశమా నీ గమ్యం ఎటు?" అని.

- దూర్వాసుల పద్మనాభం