Saturday, June 14, 2008

కుప్పిగంతుల డాన్సులూ -

విరగదీసిన భామలూ

ఈ మధ్య టీవీ చానల్స్ లో ఒక కొత్త ప్రక్రియ ప్రారంభమయింది. అదే మన పల్లెటూళ్ళలో రికార్డింగ్ డాన్సులలాంటివి. ఇందులో ఒక ఆడామె ( ఈమెనే ముద్దుగా సెలిబ్రటీ అంటున్నారు) ఇంకొక మొగ పురుగు ( వీరు కొరియోగ్రాఫర్ ట) ముఖ్యంగా ఊంటారు.ఇటువంటి ఒక ప్రక్రియ ఎలా నడుస్తుందో చూద్దాం.

అది ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్. షో పేరు: "గెంతండి, గెలవండి". ముందుగా ఒక ఏంకరు కుఱ్ఱాడు ఆదరాబాదరాగా స్టేజిపైకి వచ్చి గొంతు చించుకొని ఆరిచేడు. "గెంతండి, గెలవండి షోకి స్వాగతం, సుస్వాగతం" అని. ఆహూతులైన ప్రేక్షకులు చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని ప్రదర్శించేరు. తరువాత ఏంకరు కుఱ్ఱాడు కార్యక్రమ న్యాయనిర్ణేతలకు స్వాగతం పలికేడు. ముగ్గురు జడ్జీలు ఠీవిగా స్టేజిపైకి వచ్చేరు. వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఏంకర్ చానల్ తరఫున సత్కరించేడు. జడ్జీలలో ఒకరు కొంచెం మోడరన్ గెటప్ లో తయారైన ఆడామె. రెండవ వ్యక్తి నడి వయ్స్సులో ఉన్న మొగాయన. ఈయన ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఊంటాడు. మూడవ మనిషి కౌబాయ్ లాగా ఒక టొపీ పెట్టుకొని ఉన్న ముసలాయన. తర్వాత వారు ముగ్గురు న్యాయనిర్ణేతలు తమకు నిర్దేశించిన ఆసనాల్లో సుఖాసీనులయ్యారు. ఇప్పుడు ఏంకరు ఆరిచేడు " ఈ నాటి గెంతండి, గెలవండి కార్యక్రమంలో మొట్టమొదట వస్తున్నవారు జీమ్మీ గారు ( కుక్క కాదండీ, మనిషే) లెట్ అజ్ వెల్‍కమ్ జిమ్మీ". జిమ్మీ నామధేయంగల ఆ "సెలిబ్రటీ" ఒక కొరియోగ్రాఫర్ కుర్రాడితో ( ఆమె వయస్సులో సగం కూడా ఉంటాడో ఉండడో) పరిగెడుతూ స్టేజ్‍పైకి వచ్చింది. మన కుఱ్ఱ ఏంకరు తన వాక్పటిమతో ఆమెని, ఆమె దుస్తులని పొగిడి (అసలు ఉన్నవే కొంచెం) " జిమ్మీగారూ, ఈ రోజు మీరు ఏ సాంగు చెయ్యబోతున్నారు" అని ప్రశ్నించాడు. సదరు జిమ్మీ అష్టవంకరులూ తిరిగిపోయి "నీతోనే లేచి పోతా" లో "నువ్వంటే నాకు ఇదీ అదీ " సాంగు చేస్తా అని చెప్పింది. "చాలా మంచి సాంగు సెలక్ట్ చేసుకున్నావు. ఇంక అదరగొట్టు. విష్ యూ గుడ్ లక్" అని చెప్పి ఏంకరు కుర్రాడు పరుగు పరుగున నిష్క్రమించాడు. సదరు జిమ్మీ న్యాయనిర్ణేతలకు, కార్యక్రమానికి హాజరైన ఆహూతులకీ వంగి వంగి దండాలు పెట్టి తన డాన్స్ ప్రారంభించింది.

మరి అది ఏ రకం డాన్సో తెలీదు కానీ స్టేజి అదిరిపోయేటట్టు జిమ్మీ గెంతేస్తోంది. దానికి సరిపోయేటట్టు కుర్రాడు కూడా కుప్పిగంతులు వేసేస్తునాడు. అప్పుడప్పుడు కుర్ర డాన్సరు తన శక్తినంతా కూడదీసుకొని జిమ్మీ అనే ఆ భారీ శరీరాన్ని రెండు చేతుల్తో ఎత్తి కుదేస్తున్నాడు. జనంలో కొందరు ఆడ మొగా ఆనందం పట్టలేక తమ సీట్లలోంచి లేచిపోయి ఈలలు వేసూకుంటూ వాళ్ళకొచ్చిన డాన్సు వాళ్ళు చేసేస్తున్నారు. ఇక జడ్జీల సంగతి సరే సరి. ఆడ జడ్జీ ఆనందం పట్టలేక ఈల వెయ్యటానికి చూసింది, కాని బాగుండదనుకుందేమో ఆగిపోయింది. ముసలాయన కూర్చునే, టొపీ కిందకు మీదకు తోసుకుంటూ అభినయించడం ప్రారంభించేడు. మూడో ఆయన ఏ భావమూ చూపెట్టకుండా సేరియస్ గా చూస్తున్నాడు. ఆ కుర్రాడు, జిమ్మీ స్టేజీని పశువులు కుమ్మిన కొట్టం లాగా చేసి చివరిలో ఒకరి ఒళ్ళో ఒకరు ఆయాసంతో పడిపోయి అయిందనిపించేరు. ప్రేక్షకుల చప్పట్లు, ఈలలతో తమ ఆనందాన్ని ప్రకటించేశారు. ఏంకరు కుఱ్ఱాడు పరుగు పరుగున స్టేజిపైకి వచ్చి జిమ్మీని వాటేసుకున్నంత పని చేశాడు. " అదరగొట్టాసావు కదా జిమ్మీ, నీలో ఇంత టాలెంటు ఉందని నాకు తెలీదు" అంటూ తన మామ్మూలు డైలాగ్స్ తో జిమ్మీకి షేక్‍హాండు ఇచ్చి మరీ పొగిడేశాడు. సదరు జిమ్మీ కూడా ఆయాసంతో రొప్పుతూ చెమటను చేత్తోనే తుడుచుకుంటూ ఆనందపడిపోయింది. "ఇక మన జడ్జీల కామెంట్స్ విందాం" అన్నాడు ఏంకరు. ఆడ జడ్జీగారు తమ ఆనందాన్ని ప్రకటిచ్తూనే, ఇంకా ఫ్రీగా, హుషారుగా చేస్తే బాగుంటుందన్నారు. ఈమెకు జిమ్మీగారి "ప్రదర్శన" ఇంకా చాలదట. ఇంక చిర్రుబుర్రులాయన వంతు. ఈయన మైకును ఒక వైపుకు వాల్చి సిగరట్టు తాగేవాడిలా నోటిదగ్గర పెట్టుకొని " కాన్సెప్టు అర్ధం కాలేదు, లిప్ మూవ్‌మెంటు సరిగాలేదు." అంటూ కామెంట్స్ చేశాడు, ఏదో కాన్సెప్ట్ ఉన్నట్టూ, లిప్ మూవ్‌మెంటు ఉన్నట్టూ" ఇంక ముసలాయన వంతు. ఆయన సీటులోంచి లేచి స్టేజి పైకి పేంటు పైకి లాగుకుంటూ వెళ్ళి జిమ్మీతో కలసి హుషారుగా డాన్స్‌చెయ్యటం ప్రారంభించేడు. జిమ్మీ కూడా ఆనందంతో పొంగిపోయి జత కలిపింది. పనిలోపని ఏంకరు కుఱ్ఱాడు కూడ రెండు గెంతులు గెంతాడు. ప్రేక్షకులు మహదానందంతో చప్పట్లు కొట్టి ఈలలు వేశారు. ఇంతలో తేరుకొని, ఏంకరు " నెక్స్ట్ పార్టిసిపెంటు వచ్చేముందు చిన్న బ్రేక్" అని వెళ్ళిపోయాడు.

8 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar said...

బాగా ఏకారు. ఇలాంటి కార్యక్రమాలు ఛానల్ కొకటి తయారై ప్రేక్షకుల ప్రణాలు తీస్తున్నాయ్.

ఏదో భారత ప్రభుత్వం రూలు పెట్టిన తర్వాత "మిడ్ నైట్ మసాలా" కార్యక్రమాన్ని తీసేసారుగానీ, ఈ అడ్డదిడ్డమైన సెక్సీడ్యాంసులు వాటిని మించిపోయాయి. అదీ ఫామిలీ టైంలో.

తెలుగు సినిమాలతో పాటూ ఛానళ్ళనీ ఆ దేవుడే కాపాడాలి.

కొత్త పాళీ said...

సెటైర్ చాలా బావుంద్ పద్మనాభం గారూ.
ఇక్కడ (అమెరికాలో) ఒక టీవీ డాన్సు పోటీ జరుగుతుంది .. డాన్స్ విత్ ద స్టార్స్ అనుకుంటా దాని పేరు. ఎప్పుడో ఇరవై ముప్పయ్యేళ్ళ క్రితం దేణికో కాస్త పేరు సంపాయించి ఇప్పుడు పని లేక గోళ్ళు గిల్లుకుంటున్న "సెలెబ్రిటీ"లని తెచ్చి, ఒక్కొక్కరికీ ఆపోజిట్ సెక్సు కొరియాగ్రాఫర్ పార్ట్నర్ ని తగిలించి గెంతించడాలు .. మన ఖర్మ. ఊరుకున్నంత ఉత్తమం లేదని సామెత. .. కళ్ళు చెవులూ మూసుకున్నంత సౌఖం లేదు అని సవరించుకోవాలి.

teresa said...

అవును ఇది 'Dancing with the stars' యే! పని లేని మంగలాడు పిల్లి తల గొరిగిన type!

ఓ బ్రమ్మీ said...

గురువుగారు,

సదురు కార్యక్రమం 'గెంతండీ, గెలవండీ..' కాదండీ.. దాని పేరు.. 'గే.గే. 2'


అలాగే, సదురు జిమ్మీగారు ఈ కార్యక్రమం ఫైనల్‌కి రావటంలేదు. వారి మీద అప్పుడెప్పుడో పెద్ద దుమారం అన్ని చానల్ వాళ్ళు ఒక రోజంతా లైవ్ టెలీకాస్ట్ చేసారు.. దానిమీద కూడా మీ అభిప్రాయాన్ని తెలియ జేయగలరని మనవి .

Sujata M said...

'Dancing With the Stars' laane 'So.. Do you think you can Dance!' koodaa undi. veetilo, rendodi kaasta okay. avi, sariggaa alaane, hindee lo choosaaka ave, telugu lo choodaalante, aa baadha varninchalenidi. asale, telugu lo paatalu baagovu. inka choodaali mana paatlu.

వేణూశ్రీకాంత్ said...

హ హ ఒక రేంజ్ లో ఏకి పారేసారు పద్మనాభం గారు. "స్టేజీ ని పశువులు కుమ్మిన కొట్టం లా చేసి" అదుర్స్.

పద్మనాభం దూర్వాసుల said...

అభిప్రాయాలను తెలిపిన మీ అందరికీ ధన్యవాదములు
- పద్మనాభం

Prashanth.M said...

ఆ "ప్రేక్షకులు" కూడా....filmnagar నుండి అద్దెకుతెచ్చిన వళ్ళే!!

వినాశకాలే విపరీతబుద్దిహి!!

మంచి అర్టికెల్ వ్రాసారు keep it up...మరి మన నెక్స్ట్ పర్టిచిపెంట్ ని చూద్దామా??