Tuesday, November 25, 2008

తెలుగెందుకు?

తెలుగెందుకు?
ఇది మనలో చాలామందికి వస్తున్న సందేహం. ఆచార్య ఆర్వీయస్. సుందరం మైసూరు విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు, విపుల, ఆగస్టు 2007 సంచికలో దీని గురించి వ్రాసిన వ్యాసం లో చర్చించారు. దాని పూర్తి పాఠం ఇది:

ఆంధ్రప్రదేశ్ లో పాలకుల దగ్గర్నుంచి, అధికారుల దగ్గర్నుంచి, సామాన్య మధ్యతరగతి ప్రజల వరకు అడిగే ప్రశ్న ‘తెలుగెందుకు’ అని. ప్రపంచీకరణ సందర్భంలో, ప్రపంచమంతా ఒక్క గ్రామమైపోతున్న తరుణంలో, అంతర్జాలం (ఇంటర్నెట్) యువతపై పెత్తనం చలాయిస్తున్న సమయంలో తెలుగును పట్టుకొని వేళ్ళాడడం అసమంజసమని కొందరి అభిప్రాయం. ఉద్యోగావకాశాల కోసం, సాంకేతికవిద్యలను అభ్యసించటం కోసం, పర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్ళటం కోసం ఇంగ్లీషు చదవక తప్పదని వీరు వాదిస్తుంటారు. ఇవన్నీ మామూలు మనిషికి నిజమే అనిపిస్తాయి. పిల్లల భవిష్యత్తుని అడ్డుకోవటం తగదనీ అనిపిస్తుంది. శ్రీమంతులు, విద్యాధికులు, ఉన్నత వర్గాలవారూ ఎలాగూ తమ పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమంలో, ప్రయివేటు పాఠశాలల్లో చదివిస్తారు కాబట్టి తెలుగు కావాలనటం కేవలం బడుగు వర్గాలకే అన్వయిస్తుందని అనేవారూ ఉన్నారు. ఇదీ నిజమే. ఈ అన్నిటినీ ఆలోచించే ‘తెలుగెందుకు’ అన్నదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.నేను ఆంధ్రప్రదేశ్ వెలుపలికి వచ్చి సరిగ్గా నలభై అయిదు ఏళ్ళయింది. నిజానికి నాకు తెలుగు అవసరం లేదు. ‘ఆంధ్రప్రదేశ్ బయట ఉన్నాడు కాబట్టే ఇతను ఎప్పుడూ తెలుగు, తెలుగు అంటుంటాడు’ అని కూడా కొందరు నన్ను ఎద్దేవా చేశారు. ‘నువ్వెక్కడో మైసూరులో ఉన్నావు. నీకు తెలుగు ప్రాచీన భాష అయితే ఏంటి? కాకపోతే ఏంటి? నీ పని నువ్వు చేసుకుని ఊరకుండరాదా’ అని నన్ను ఒక ప్రముఖ భాషాశాస్త్రవేత్త చీవాట్లు కూడా పెట్టారు. అయినా నేను తెలుగు గురించి మాట్లాడటం మానలేదు, మానను కూడా. ఎందుకంటే ప్రపంచంలో తెలుగుభాషకు దక్కాల్సిన గౌరవాన్విత స్థానం దక్కలేదు. తెలుగు భాషకుండే అర్హతలను బట్టి దానికి ఇంకా ఎంతో ఉన్నతస్థానం దొరకాల్సింది. కాని మన పాలకులకు తెలుగుభాష ఔన్నత్యాన్ని గురించిన అవగాహన లేకపోవటం వల్ల భాషా సంస్కృతుల పట్లగాని, వాటిని కలిగిన ప్రజల పట్లగాని వారికి ఏ మాత్రం గౌరవం లేకపోవటం వల్ల తెలుగుకు ఈ దుస్థితి పట్టింది.

ఇంగ్లండులోనే ఇంగ్లిష్!

ప్రపంచంలో ఒక్క ఇంగ్లీషు భాష మాత్రమే ఉందనుకోవటం మన మూర్ఖత్వం. ప్రపంచంలో అందరూ ఇంగ్లీషు వల్లనే అభ్యున్నతి సాధిస్తున్నారని భావించటం ఇంకా మూర్ఖత్వం. వీళ్లకు ప్రపంచమంటే అమెరికా మాత్రమే. అమెరికా పాలకులు ఏ తాళం వేస్తే దానికి గంతులెయ్యటం ఒక్కటే వీళ్లకి తెలిసింది. ఇంగ్లండులో తప్ప మరే ఐరోపా దేశంలోనూ ఇంగ్లీషు చదవరు. ఫ్రెంచి, జర్మను, స్విస్, ఫిన్నిష్, ఐరిష్ లాంటి భాషలే అయా దేశాల అధికార భాషలు. స్పానిష్, జపనీస్, రష్యన్, చైనీస్ భాషల వాళ్లు కూడా సాంకేతిక విద్యతోసహా వాళ్ల భాషలోనే చదువుతారు. భారతదేశం నుంచి అక్కడికి చదువుకోసం వెళ్లేవాళ్లు ఆ భాషల్ని నేర్చుకుంటారు.
మనుషులు బతకటానికి చదువొక్కటే చాలదు. పరిపాలన అంటే చదువు మాత్రమే కాదు. ప్రజలకు తెలియాల్సినవి, ప్రజలు అనుసరించాల్సినవి వందల విషయాలున్నాయి. కోట్ల మంది ప్రజలున్నప్పుడు ఆ ప్రజలు మాట్లాడే భాషలోనే వ్యవహారమంతా జరగాలి. అప్పుడే పరిపాలన సార్థకమవుతుంది. ఈ విషయాన్ని సి.పి.బ్రౌన్ లాంటి ఇంగ్లీషు పాలకులు కూడా అర్థం చేసుకున్నారు. కాని మనవాళ్లనుకొనే ఈ పాలకులకు మాత్రం అర్థం కావటంలేదు.

బోగస్ విద్యా విధానం

మన మాతృభాషకాని, మనకు అర్థంకాని సంస్కృతం, ఫ్రెంచి లాంటి భాషల్ని విద్యావిధానంలో భాగంగా చేసి వాటిని చదవకున్నా 90-100 మార్కులు వేసి, మా పిల్లలు తెలివిగలవాళ్లని చెప్పే బోగస్ విద్యావిధానం ప్రపం చంలో మరెక్కడయినా ఉందా? ఇంత ప్రాథమిక విషయమైనా అర్థంకాని ఈ విద్యావేత్తల్ని, అధికారుల్ని, పాలకుల్ని ఏమని పిలవాలి? ప్రపంచంలో 15 కోట్ల మంది మాట్లాడే ఒక భాషని ఇంతగా అవమానపరచటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? తెలుగువాడు ప్రతి ఒక్కడూ సిగ్గుతో తలవంచుకోనక్కర లేదా?
‘తెలుగు సాహిత్యం చదివితే ఒరిగేదేముంది’ అని ప్రశ్నించే ప్రబుద్ధులున్నారు. నిజమే. షేక్ స్పియర్ ని, మిల్టన్ ని, బెర్నార్డ్ షాని, రవీంద్రుడ్ని, ప్రేమ్ చంద్ ని చదివితే మనిషవుతాడు కాని నన్నయని, తిక్కనని, వేమనని, గురజాడని, శ్రీశ్రీని చదివితే లాభమేముంది? మనిషికి కావలసింది సాంకేతిక విద్య మాత్రమే. భౌతిక లాభాలు మాత్రమే అని భావించే వాళ్లుండబట్టే మన సమాజం రోజురోజుకీ దిగజారిపోతోంది. మానవ సంబంధాలు నాశనమై పోతున్నాయి.
మనిషిని కాపాడలేని విద్య, భౌతిక అవసరాలు, ఉద్యోగాలు ఏంచేసుకోవడానికి? ఏ విద్య చదివినా దానితోబాటు మానవతాగుణాల్ని కాపాడుకునేట్లు చేయాలంటే భాష, సంస్కృతి, సాహిత్యం అవసరమే. ఇది గుర్తించలేనప్పుడు మన విద్యావిధానమంతా వ్యర్థమే అవుతుంది.

ప్రపంచ స్థాయి భాష

ఇన్ని చెప్పిన తర్వాత ‘తెలుగెందుకు’ అనే ప్రశ్నకే మళ్ళీ వచ్చి దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది.
1. తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మాట్లాడే భాష. అక్కడ ఏడున్నర కోట్లమంది తెలుగు మాట్లాడుతుంటే అదే సంఖ్యతో ఇతర ప్రాంతాలలో తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఇంతమంది మాట్లాడే భాషలు ఐదారుకు మించిలేవు. అందువల్ల ఈ భాషని ప్రపంచస్థాయి భాషగా గుర్తించి దానికి తగిన స్థానాన్ని సంపాదించటం మన కర్తవ్యం.
2. భారతదేశంలో అనుసంధాన భాషగా హిందీని గుర్తించాం. నిజానికి హిందీ ఎక్కువమందికి అర్థమయ్యే భాష అనడం సమంజసం. హిందీ తెలిసిన వారిలో చాలామంది మాతృభాష వేరే ఉంటుంది. కాని తెలుగు విషయం అలా కాదు. తెలుగు మాట్లాడేవారే ఈ దేశంలో పదిహేను కోట్లమంది ఉన్నారు. అలాంటప్పుడు ఆ భాషకి జాతీయస్థాయిలో అధికార భాషగా స్థానం దక్కాలి. మన దురదృష్టం ఏమిటంటే పార్లమెంటులో తెలుగులో మాట్లాడితే దాన్ని అనువాదంచేసే దిక్కుకూడా లేదు. ఇలాంటి పరిస్థితిని గంభీరంగా పరిగణించే ప్రజాప్రతినిధులు లేకపోవటం మన దురదృష్టం.
3. మాతృభాషలో విద్య నేర్చుకుంటే చక్కగా అవగాహన అవుతుందని ఐక్యరాజ్య సమితితో సహా ఎంతోమంది నిపుణులు చెప్పారు. అయితే ఒకటో తరగతి నుంచే ఇంగ్లీషును ఇంజెక్ట్ చేస్తే మన పిల్లలు బాగుపడతారనుకునే అజ్ఞానంలో మనమున్నాం. కనీసం ఉన్నత పాఠశాలవరకైనా తెలుగులో చదువుకొని, తర్వాత తెలుగు వాడకాన్ని తెలుసుకునేలా చదివితే అలాంటివారి వల్ల తెలుగు వారికి ఉపయోగముంటుంది. అంతేకాని తెలుగువారందరినీ విదేశాలకు ఎగుమతిచేసి తెలుగువారికి మాత్రం ఏమీ మిగల్చకూడదనుకునే విద్యావేత్తలను ఏమనాలో అర్థంకావటంలేదు. ఇంగ్లీషు నేర్చుకోవటం, ఉద్యోగాలు సంపాదించటం వేరు, ఇంగ్లీషులోనే నేర్చుకోవటం వేరు. ఇంగ్లీషు నేర్చుకోవద్దని ఎవరన్నారు? బాగా నేర్చుకోండి. కాని తెలుగు వారి కోసం తెలుగును నేర్చుకోండి, తెలుగును తెలుసుకోండి
4. ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అన్న శ్రీ కృష్ణదేవరాయలకు ఉన్నపాటి పరిజ్ఞానం ఇన్ని వందలఏళ్ల తరువాత కూడా మన పాలకులకు లేదంటే మనమేమనుకోవాలి? దేశంలో ఉండేది తెలుగు వాళ్ళయినప్పుడు వాళ్లకు తెలుగులోనే చెప్పాలి, పరిపాలించాలి, విద్య నేర్పించాలి అన్నది ప్రాథమిక సూత్రం. అంతేకాదు ఏవిధంగా చూసినా తెలుగుకు సామర్థ్యం ఉన్నది అన్న విషయం గమనించాలి. భాషలో అక్షరాలున్నాయి, పదాలున్నాయి, ఏ భావాన్నయినా వ్యక్తం చేసే సామర్థ్యం ఉంది, ఎలాంటి విషయాన్నయినా ఇముడ్చుకునే శక్తి ఉంది - అలాంటప్పుడు ఆ భాషను సమర్థంగా ఉపయోగించుకోవలసిన కర్తవ్యం మనమీదుంది.
5. ప్రపంచంలో అప్పటికప్పుడు జ్ఞానం వృద్ధి అవుతుంది కదా? మరి, దాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అని ప్రశ్నించవచ్చు. ఇది తెలుగువారి సమస్యకాదు. ప్రపంచంలో జ్ఞానమంతా ఇంగ్లీషులో రాదన్నది ముందు తెలుసుకోవాలి. ఎంతోమంది మేధావులు, సాహితీవేత్తలు, విజ్ఞానులు, తత్వవేత్తలు జర్మన్ లో, ఫ్రెంచ్ లో, స్పానిష్ లో తమ జ్ఞానాన్ని వెలువరిస్తారు. అది ఎప్పుటికప్పుడు ఇంగ్లీషులోకి వస్తుంది. అలాంటి సౌకర్యాన్ని తెలుగువారికి కూడా కలుగజెయ్యాలి. అప్పుడే తెలుగు కూడా అభివృద్ధి చెందుతుంది. విస్తృత ప్రాతిపదిక మీద అనువాద అకాడమీ ఒకటి ఏర్పడాలి. ప్రతి ఒక్క విషయమూ వెంటనే తెలుగులో వెలువడేలా చెయ్యాలి. మనవారు తెలుగులో విద్య, విద్యాబోధన, పరిశోధన, పరిపాలన, ముఖ్యంగా ఆలోచన, అభివ్యక్తి జరిపేలా చేసినప్పుడు మనవారు ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశముంటుంది.