Wednesday, July 2, 2008

మేధోమధనం

- సాఫ్టువేర్ డెవలపర్స్ కి మంచి అవకాశం

మేఘాలను మధిస్తే వర్షం వస్తుంది. ఇదీ అందరికీ తెలిసిన విషయం. దీనికి దీటుగా ఇప్పుడు "మేధోమధనం" రాజకీయాలలో ప్రారంభమయింది. ముఖ్యంగా పార్టిలు పెట్టేవారికి ఇది తప్పనిసరి. ఎందుకంటే వాళ్లకి రాజకీయ పరిజ్ఞానం తక్కువ. అదీకాక ఓపిక, కాలం కరువయింది. వీళ్ళకి దిశానిర్దేశం చెయ్యటానికి ఈ కొత్త రాజకీయ కన్సల్టన్సీ సర్వీసులు పుట్టుకొచ్చేయి. మొన్న టి.ఆర్.యస్ చంద్రశేఖర్ నుండి నేటి దేవేందర్ గౌడ్, చిరంజీవి వరకు ఈ కన్సల్టీ సర్వీసులను ఆశ్రయించక తప్పటం లేదు. ఎలాగైతే మిగిలిన కన్సల్టన్సీ సర్వీసులు ఒకరికన్న ఎక్కువమందికి తమ సేవలను అందిస్తాయో, అలాగే ఇవి కూడా చేస్తున్నాయి. రాజకీయ కన్సల్టీ సర్వీసులో ఇదో వినూత్న ప్రక్రియ. టి. ఆర్. ఎస్. సిద్దాంత కర్తగా వ్యవహరించిన ప్రొఫెసర్ జయశంకర్ ఇప్పుడు దేవేందర్ గౌడ్ కి కూడా తమ సర్వీసుని అందిస్తున్నారు. ఈయనిది తెలంగాణా కన్సల్టీ సర్వీసు. తెలంగాణా కోసం పాటుపడే వారెవరికైనా తమ సర్వీసు ఉంటుందన్నారు. చిరంజీవి విషయంలో రాజకీయ సలహాదారు డా.మిత్ర ఈ సర్వీసు అందిస్తున్నారు. మార్క్సిస్టు మేధావులుగా చెలామణి అవుతున్న విఠల్‌, బ్రహ్మారెడ్డిలు సైద్ధాంతిక సహకారం ( దీనిని సైద్ధాంతిక సహకార సర్వీసు అందామా) అందిస్తున్నారట. ఇక పోతే ఆయన బంధుగణం రాబోయే పార్టీ ప్రచార సర్వీసు తీసుకున్నారు. అన్నట్టు తాజాగా వారణాసి జ్యోతిష్కులు రాజకీయ నాయకులకు అతి ముఖ్యమైన "జ్యోతిషం సర్వీసు" తీసుకున్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవతాడని జ్యోతిషం కూడా చెప్పేసారు. రాజకీయాల ధర్మమా అని ఇలా ఎన్నో కొత్త కన్సల్టన్సీ సర్వీసులు వస్తున్నాయి.
ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉండటం, వ్యాపారానికి పెట్టుబడి పెట్టే సామర్ధ్యం లేకపోవడం "ఐటి" లో మాంద్యం - ఇవన్నీ చూసిన యువకులు ఈ పెట్టుబడిలేని వ్యాపారంవైపు మొగ్గుచూపే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది. మన కంప్యూటరు నిష్ణాతులు ఈ కన్సల్టన్సీ సర్వీసులకోసం సాఫ్టువేరు కూడా తయారుచేస్తున్నారని వినికిడి.


0 వ్యాఖ్యలు: