Saturday, July 12, 2008

పోలీసు పిల్లుల చెలగాటం - అమాయికునికి ప్రాణ సంకటం

గత రెండు నెలలనుండి మీడియాకి మేత అందించిన ఆరుషి హత్యోదంతం, యూపీ పోలీసుల నిర్వాకం చూసేక నాకు పాత తెలుగు సినిమాలలో మనం చూసే ఓ సీను గుర్తుకి వస్తోంది. గ్రామంలో నీళ్ళు పట్టుకుందుకి ఓ మధ్య వయస్కురాలు బావి వద్దకువస్తుంది. ఆవిడ ఓ పెద్ద న్యూస్ చానల్. నోటికేమొస్తే అది వాగడం ఆవిడకి పుట్టుకతో వచ్చిన విద్య. "సూరమ్మొదినా ఇది విన్నావా. ఆ మాయదారి మహలక్ష్మి కూతురు పాలేరు రంగయ్యతో సరసాలాడుతోందిట. ఎప్పుడో వాల్లిదారూ లేచిపోవడం ఖాయం. అసలు వాళ్ళ వంశమే అంత. మహలక్ష్మి ముత్తాతకి ఇంటి పనిపిల్లతో సంబంధం ఉండేదట." ఇలా సాగిపోతుంది ఆవిడ వాగ్ధాటి. అలాగా అని ముక్కుమీద వేలేసుకోవటం అక్కడున్న అమ్మలక్కల వంతు. యూ.పీ పోలిసులు, మీడియాది ఇదే తంతు.
కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే తామే న్యాయముర్తులుగా వ్యవహరించి నిందుతులకు అప్రకటిత శిక్షలు వెయ్యడం పోలీసులకు అలవాటని సరిపెట్టుకున్నా మీడియా బుద్ధి ఏమయింది? కట్టుకధలు అల్లటం, వాటికి మసాలా దట్టించి ప్రజలలోకి వదలడం మీడియాకి అలవాటయిపోయింది. రాజేష్ తల్వార్ విషయంలోనూ ఇదే జరిగింది.

ఏభై రోజుల క్రిందట నోయిడా లోని దంత వైద్యుడు రాజేష్ తల్వార్ తన స్వంత కూతురిని హత్య చేసాడంటూ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి వాళ్ళ దగ్గరున్న సాక్ష్యం ఏమిటంటే వాళ్ళు విచారించిన కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం. ఇది చాలు మన మీడియా వాళ్ళకి. ఇంక కధలు అల్లడం మొదలు పెట్టారు.రాజేష్ తల్వార్ కి మరో డాక్టరమ్మకి అక్రమ సంబంధం ఉందని. అది తెలిసి కూతురు అతనితో వాగ్వాదానికి దిగిందని, అదే హత్యకి కారణమని ఇలా. రాజేష్ తల్వార్ భార్య తన భర్త ఈ హత్య చెయ్యలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఉత్తరప్రదేశ్ ఐ.జి గారు ప్రత్యేకంగా ఓ మీడియా సమావేశం ఏర్పరచి పై వాదనలన్నిటికీ బలం చేకూరుస్తూ ఈ కేసులో తాము ఎంత వేగంగా ముందుకు పోతున్నామో విశదీకరించారు. ఈ వార్తపై స్పందిస్తూ కొందరు సంఘసేవకులు రాజేష్ తల్వార్ ని ఉరితీయాలని, అలాచేస్తే ఇంకెవరూ ఇలాంటి దుర్మార్గాలు చెయ్యరనీ ఆవేశంగా సెలవిచ్చేరు.

అయితే, సి.బి.ఐ కీ కేసు అప్పగించాక పరిస్తితులు తారుమారయ్యాయి. వాళ్ల విచారణలో తేలిందేమిటంటే రాజేష్ తల్వార్ హత్యచేసాడనటానికి నోయిడా పోలిసుల వద్ద ఏ రకమైన ఆధారాలు లేవని, ఈ హత్యకు మూలకారకుడు రాజేష్ తల్వార్ వద్ద పనిచేస్తున్న కాంపౌండరు మరి ఇద్దరు కావచ్చని.

రాజేష్ తల్వార్ ని బెయిల్ మీద వదిలేశారు. నోయిడా పొలీసులు తమ తప్పు ఏమీ లేదని, కేసుని ఓ కొలిక్కి తెస్తున్న సమయంలో సి.బి.ఐ కి బదిలీ చేశారనీ, తాము రాజేష్ తల్వార్ ని అనుమానించేమేగాని ఏ విధమైన చార్జిషీటు అతనిపై ఫైల్ చెయ్యలేదనీ చేతులు దులుపేసుకున్నారు. అయితే అతను గత ఏభై రోజులు అనుభవించిన నరకయాతనకు బాధ్యులెవరు? స్వంత కూతురిని చంపేడన్న అపవాదు ఎలా తుడుచిపెట్టుకొని పోతుంది?సంఘంలో ఉన్న పరువు మర్యాదలు మంటగలిసేక అతను తల ఎత్తుకు తిరగగలడా? సంఘంలో ఒక అంతస్తు ఉన్న వ్యక్తికే ఇలా జరిగితే మరి సామాన్యుల మాటేమిటి? పోలిసుల చిత్రహింసలను భరించలేక తప్పు తనదేనని ఒప్పుకో వలసిందే కదా? ఒక వ్యక్తి జీవితాన్ని బజారుకు ఈడ్చిన పోలీసులకి, కట్టుకధలు అల్లిన మీడియా వాళ్ళకి శిక్షలేదా? పోలీసు, న్యాయ వ్యవస్తలలో ఉన్న కుళ్ళు, లోపాలు దీనికి కారణం కాదా? అన్ని రంగాలలోను మనం పురోగమిస్తున్నామని జబ్బలు చరచుకుంటున్న ప్రభువులు ఈ రంగంలో ఎంత వెనుకబడి ఉన్నామో గ్రహించరా? సైన్సు ఇంత పురోగతి సాధించినా పాత పద్ధతులలోనే నేర పరిశోధన జరగడం మనం సిగ్గుపడాల్సిన విషయం కాదా? వందమంది నేరస్తులను వదిలేసినా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది కాగితాలకే పరిమితమా?

ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు.

4 వ్యాఖ్యలు:

తెలుగు'వాడి'ని said...

చాలా చక్కగా రాశారు. అభినందనలు.

మీడియాకి కావలసింది వాళ్ల టి.అర్.పి రేటింగ్స్ అండి అందుకు వాళ్లు దేనికీ వెనుకాడరు. ఇందుకు నిదర్శనాలు కోకొల్లలు.... పోలీసులకి కావలసింది ప్రజల, మీడియాల, ప్రభుత్వాల, రాజకీయనాయకుల నుండి తప్పించుకోవటానికి ఏదో పొడిచేశామని చెప్పుకోవటానికి, ఉన్న అరకొర సౌకర్యాలతో(ముఖ్యంగా సాంకేతికంగా) ఏదో నడిసిపోతుంది కదా అని లాగే ఉద్యోగాలలో, ఒకవేళ ఏదన్నా చించేసి కనిపెట్టేసినా మరలా పైనుంచి ఏదో ఒత్తిళ్లు వస్తాయని తెలుసు కాబట్టి అప్పటికి ఏది తోస్తే అది చెప్పెయ్యటమే, ఎవడు కనపడితే వాడి మీదకు నెట్టెయ్యటమే ... ప్రభుత్వాలు/రాజకీయనాయకులేమో ప్రతిపక్షాల నుండి, మీడియా, ప్రజల నుండి విమర్శలు రాకుండా చూసుకోవటానికి, వీళ్లు తెగ ఉధ్ధరిస్తున్నారని బిల్డప్ ఇవ్వటానికి పోలీసుల మీద ఒత్తిడి తేవటం ...

ఇదంతా ఒక విషవలయం.

నాకు తోచిన పరిష్కారం ఏమిటి అంటే ...

ముందు మీడియా వారి సంగతి చూద్దాం :

ఇలాంటి ఆరోపణలు చేసిన, ప్రకటించిన వారందరినీ ఒక కట్టగట్టి సమూహంగా వీరందరి మీద 'పరువు నష్టం, మానసిక క్షోభ' మొదలగునవి అన్నీ కలిపి కేసు వేయాలి. ఎంత మొత్తానికి అంటే, ఈ వార్తలు ప్రసారం చేసిన ఛానల్స్ యొక్క టి.ఆర్.పి రేటింగ్స్ తెప్పించి (ఎన్ని సమయాలలో ప్రసారం చేస్తే అన్నీనూ) ఆయా సమయాలలో వారికొచ్చిన ఆదాయం మొత్తానికి ఒక పది/వంద రెట్లు వేయాలి. ఇలాంటి కేసులన్నింటినీ సత్వరం పరిష్కరించే వ్యవస్థ ఉండాలి. అప్పీలు లాంటివి ఉండకూడదు.

కొంచెం అతిగా అనిపించినా ఇలాంటి ఊహాగానపు/నిరాధారమైన వార్తలు ప్రసారం చేసినప్పుడు ఏయే వ్యాపార ప్రకటనలు వస్తాయో వాళ్లని కూడా ఈ కేసులో జతచేయాలి. సరే ముందుగానే వీళ్లకి తెలియదు కదా అంటారా ... అందుకే వీళ్లు ఈ వ్యాపార ప్రకటనల ఒప్పందంలో ఒక నియమం (ఒకవేళ మీ వార్తలను మీరు ప్రూవ్ చేసుకోలేకపోతే అంటే ఊహాజనితం/నిరాధారం/గాలికబుర్లు లాంటి వార్తలు ప్రసారం చేసినట్లైతే .. ఎవరన్నా మా మమ్మల్ని కూడా కేసులో జత చేస్తే ఆ డబ్బులు కూడా మీరే కట్టాలి) చేర్చాలి.

ఈ మొత్తంలో రెండో/మూడో వంతులు ఎవరి మీద ఆరోపణలు చేస్తే వారికి, ఆ మిగిలిన ఒకటో/రెండో వంతులు ప్రజాసేవకు సంబంధించి మరియు ఇలాంటి న్యాయవ్యవస్థకు నిధులుగా ఉపయోగించేలా చేయాలి.

ఇంకొకసారి ఎప్పుడైనా పోలీసులు, ప్రభుత్వాలు, రాజకీయనాయకుల సంగతి చూద్దాం.

Sujata M said...

మంచి విషయం రాసారు.

1) నాకో పెద్ద డౌటు.. మీడియా వాళ్ళ మీద న్యాయపరమైన చర్యలు ఏమీ తీసుకోలేమా ? సంఘం లో ఎవరైనా ఖర్మ కాలి క్రైం విక్టింస్ అయితే (అది రేప్పొద్దున్న మనమే కూడా కావొచ్చు) వారి జీవితాలను అతలాకుతలం చేసే హక్కు మీడియాకు ఎందుకు ఇస్తున్నాం ? ప్రతీదీ సెన్సెషనల్ చేసుకునే మీడియా వాళ్ళు, మన దేశం లో విపరీతంగా పెరిగిపోయిన అవినీతినో, ఏ ప్రోజెక్టుల లోనో అక్రమాలనో ఎందుకు ఇన్వెస్టిగేట్ చెయ్యవు ?

2) ఇంకో విషయం. మీడియా తలచుకుంటే, మంచి పనులు కూడా చెయ్యగలదు. జెస్సికా లాల్ హత్య కేసు, ప్రియదర్సిని హత్య కేసు లను తిరగదోడి, న్యాయస్థానాలలో న్యాయం జరిగేలా చెసింది మీడియానే.

3) అసలు మనం ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తాం ? సహజంగానే మనిషికి పక్కవాడి ఇంట్లో ఏమి జరుగుతుందా అని కుతూహలం. అందుకే, రక రకాల ట్విస్టులూ, రాజకీయాలతో నడిచే, ఘర్ ఘర్ కీ కహానీ లు సీరియల్లు గా ఇంట్లో చూస్తాం. మీడియా వాళ్ళు, సాధారణ వార్తల నే, నాటకీయం చేసి చూపిస్తున్నారు. తెలుగు మీడియా లో మరీనూ.. నేరాలు ఎలా జరుగుతాయో చూపిస్తున్నారు. చిన్నప్పుడు రాష్త్ర పోలీసుల మాగజీను ''సురక్ష '' అని చదువుతూ ఉండేదాన్ని. దాన్లో ఒక క్రైం స్టోరీ ఉండేది. నిజానికి అది పోలీసుల మాగజీను కాబట్టి, నేరం ఎలా జరిగిందో, నేర పరిశోధన ఎలా జరిగిందో, నేరం అసలు ఎందుకు జరుగుతుందో.. ఇలా అన్ని విశ్లేషణాత్మక వివరణలతో, కేసు డీటైల్స్ ఇచ్చి, ఎవరు హత్య చేసారో, వాడు ఇప్పుడు ఏ జైల్లో ఉన్నడో చక్కగా రాసి ఉండేది. అది తప్పకుండా చదివేదాన్ని.

ఇంకోటి, ఈనాడు లో ఆదివారం అనుబంధం లో 'ఇది కధ కాదు ' అని ఇంకో క్రైం స్టోరీ !(అజయ్ శంతి అని ఆడో, మగో తెలియని పేరు గల రచయిత రాసేవారు) అసలు ఈనాడు సర్క్యులెషన్ పెరగడానికి కారణం అదే. ఇలా మనకి గాసిప్, క్రైం అంటే, ఇష్టం కాబట్టే, అలాంటి వార్తలను నోరెళ్ళబెట్టుకుని చూస్తాం. ఇలాంటి గొడవ లేకుండా వేరే ప్రొగ్రాములు బోరు కొట్టించకుండా వస్తే, (సినిమా పాటలు, సినిమాలూ కాకుండా) చూస్తామెమో !

మన నాడి తెలుసుకున్న మీడియా బాధితుల జీవితాల తో ఆటలు ఆడుతున్నయి. మనం కాస్త మారి, కొంచెం సెన్సిబుల్ టీ వీ వైపు తిరిగితే గానీ ఈ నేరాల తరవాతి మీడియా ఘోరాలు ఆగవు.

పద్మనాభం దూర్వాసుల said...

తెలుగు’వాడి’ని, సుజాత గార్లకు ధన్యవాదములు.
మీడియా, పొలిసులపై చర్య తీసుకోవటానికి ఉన్న చట్టాలు చాలు.ఐతే పోలీసులు వాళ్ళంతట వాళ్ళు చర్య తీసుకుంటారని అనుకోలేం.అన్యాయంగా శిక్ష అనుభవించినవాళ్ళు కేసు పెట్టాలి. పట్టువదలని విక్రమార్కుడిలా దానిని నడపాలి.పోలిసు, రాజకీయ వేధింపులను తట్టుకునే శక్తి ఉండాలి. ఇటువంటి కేసులు ఏళ్ళ తరబడి నడుస్తాయి.ఇదంతా మన న్యాయ వ్యవస్తలో ఉన్న లోపం.

సుజాత వేల్పూరి said...

చాలా మంచి విషయం మీద చక్కగా రాశారు. మీడియా అత్యుత్సాహం మీద చాలా చర్చ జరగాల్సి ఉంది. ఏమన్నా అంటే విరుచుకు పడతారు గానీ, ఎలక్ట్రానిక్ మీడీయా విజృంభించాక, పోటీ కారణంగా సరిగా విచారించకుండానే వార్తలను తెరకెక్కిస్తున్నారు. వీరిని నియంత్రించడానికి ఒక ప్రత్యేక చట్టం ఉండాల్సిందే! ఇది చాలా అనారోగ్యకర ధోరణి. ఈ టపా ఇంకా చాలా మంది చదవాల్సిన అవసరం ఉంది. తిరిగి కూడలి లో మరో సారి పోస్ట్ చేయండి.