కలక్టర్లకు ముఖ్యమంత్రి సుద్దులు
మొన్నీమధ్య ముగిసిన జిల్లా కలెక్టర్ల వార్షిక సమావేశంలో మన రాజశేఖరుడు ఐఏస్ లకు రాజకీయ సుద్దులు వళ్ళించేడు. ఈ షట్ సూత్రాలను తిలకించండి
1. "ఇది ప్రభుత్వ కార్యకలాపాల సమీక్షకు సంబంధించిన సమావేశం. ఇందులో రాజకీయ ప్రసంగాలు చెయ్యకూడదు."
తాత్పర్యం: మీరు రాజకీయ ప్రసంగాలు చెయ్యకూడదు. సమావేశంలో ఆ పని చెయ్యాల్సింది నేను, నా మంత్రులు.
2. "ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడా కనిపించలేదు. పార్టీ బలహీనంగా ఉన్న చోట కూడా మంచి మెజారిటీతో గెలిచాం. మొన్న నలభయ్యో, నలభై ఒకటో అసెంబ్లీ స్తానాల పరిధిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇది నిరూపణ అయింది."
తాత్పర్యం: వ్యతిరేకించే వాళ్ళకి ఇంత విదిలించో, వీలుకాని చోట మావాళ్ళచేత కేసులు పెట్టించో ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాం. మీ తరఫున మీరు పూర్వంలాగే ఈ విషయంలో పాటుపడి ఓ రెండొందల ఏబయ్యో ఎన్నో అసంబ్లీ సీట్లు, ఓ నలభైరెందో ఎన్నో పార్లమెంటు సీట్లు వచ్చేట్టు చెయ్యాలి.
3. "కొన్ని పత్రికలు అదే పనిగా మాకు మంచి పేరు రాకూడదని ప్రచారం చేస్తున్నాయి. పనికట్టుకొని కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి."
తాత్పర్యం: ఈ ప్రజాసామ్యంలో బురద చల్లడం అందరిహక్కు. అందుకే మా సుపుత్రుడు చేత ఓ పేపరు పెట్టించా. మా తరఫున ఆ పని చెయ్యటానికి. బురద అంతగా ఎక్కువైతే కడగటానికి నా కేబినట్ సహచరులుండనే ఉన్నారు. దీనికి రోశయ్యగారి అద్యక్షతన ఓ కమిటీ కూడా వేశాం.
4. "మార్చి, ఎన్నికలకు పోవాల్సిన సమయం. అప్పటికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పనులు పూర్తి చేయండి."
తాత్పర్యం: అప్పటికి మాకు రావాల్సిన ముడుపుల వసూల్లు పూర్తిచేయండి. ప్రస్తుత వసూళ్ళు అధిష్టానానికి అర్పించడానికే సరిపోయాయి. మరి మాకు, ఎన్నికలకు డబ్బు కావాలిగా.
5. "ప్రజల సమస్యలను చర్చించేందుకే కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశాం." ఆర్ధిక మంత్రి రోశయ్య , వైస్ తరఫున వకాల్తా.
తాత్పర్యం: పార్టీ శ్రేయస్సు ప్రజల శేయస్సు కాదా? అందుకే మా వాళ్ళ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నాం. దీనిని తప్పుపట్టేవారికి రాజకీయా పరిజ్ఞానం లేదని విశదమవుతుంది. మన వైశ్యశిఖామని విశదీకరణ.
6. "అవినీతి నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఏ స్థాయిలోనూ అవినీతిని సహించ వద్దు. రాజకీయ ఒత్తిల్లకు లొంగ వద్దు."
తాత్పర్యం: ఒక్క మా విషయం లో తప్ప.
వైస్ మాటలకు అర్ధాలు వేరులే అన్నది స్ఫురద్రూపులు ఐఏస్ లు ఇట్టే గ్రహించేశారు. వారి వారి జిల్లాలకు పోయి వారి విధులలో ( అదే షట్ సూత్ర ప్రణాలిక అమలు) మునిగిపోయారు.
2 వ్యాఖ్యలు:
ఆడవారి మాటలకే....అని విన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలకె అనుకోవాలేమో!
1) కలెక్టర్ల తో రాజకీయ ప్రసంగమా ? రాజ్యాంగ విరుద్ధం!
2) తాత్పర్యాలు సూపరు.
3) నాకు తెలిసి నంత వరకూ 'స్పురద్రూపులు ' అంటే అందమైన వాళ్ళు అని అర్ధం. బహుసా.. మీ ఉద్దేశ్యం లో ఐ.ఏ.ఎస్ లు 'తెలివైన వాళ్ళు ' అనగా 'సూక్ష్మ గ్రాహులు ' (ఎవరైతే చిన్న చిన్న మైన్యూట్ విషయాలను కూడా గ్రహించ గలరో / ఎవరైతే లోపలి ఉద్దెశ్యాన్ని, భావాన్ని, మర్మాన్ని, గ్రహించ గలరో + అర్ధం చేసుకోగలరో - వాళ్ళు!) అయి ఉంటారు.
Post a Comment