"తెలుగు భాషని తెలుగు వాళ్ళే మాట్లాడటం లేదు. అలా మాట్లాడటానికి తెలుగు వాళ్ళే సిగ్గు పడుతున్నారు. మమ్మీ, డాడీ సంస్కృతి వచ్చి తెలుగుని తుడిఛిపెడుతోంది" అంటూ ఎందరో తెలుగు భాషాభిమానులు తెలుగు బ్లాగులలోనూ, తెలుగు గుంపులలోనూ ప్రతి రోజూ ఎన్నో పేజీలను నింపేస్తునారు. వేరే భాషల వాళ్ళు వాళ్ళ భాషలను ఎలా ప్రొత్సహిస్తున్నారో చెప్తున్నారు. ఈ-తెలుగు (etelugu.org) లో "తెలుగుని నిలుపుట" గురించి జరిగిన చర్చలో చాలా చాలా చెప్పేరు. కొంతమంది కొన్ని సుచనలూ చేసేరు. కాని విచిత్రమేమిటంటే, మనం ఈ విషయంలో కార్యాచరణకు పూనుకొనేందుకు ఉద్యుక్తులవుదాం, రండి ఒక చోట కూర్చొని ముఖాముఖి చర్చించి నిర్ణయాలను తీసుకుందాం అంటే ఏదో ఒక సాకుతో ముఖం చాటేస్తారు. ప్రతీ నెలా తప్పకుండా ఈ-తెలుగు (తెలుగు బ్లాగర్ల) సమావేశాలు జరుగుతున్నాయి. కాని పైన ఉదహరించిన పెద్దలు ఎంతమంది ముందుకు వచ్చేరు? సమావేశాలకు వచ్చి చర్చించేరు? తెలుగు భాష పైన అభిమానం ఇంతేనా? ఇలా అంటే కటువుగా అనిపించవచ్చు. కాని ఇది నూటికి నూరు పాళ్ళు నిజం.
ఊరకనే అభిమానం, అభిమానం అంటూ గొంతు చించుకుంటే ఏమి ప్రయోజనం? బ్లాగులలో వ్రాతలతోనూ, ఒకరినొకరు పొగుడుకోవటంతోనూ సరిపెట్టుకుంటే ఎలా? వ్రాయాలా, రాయాలా అన్న చర్చ ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యం కాదు. అసలు తెలుగు భాష ఉనికే ప్రశ్నార్ధకం అయినప్పుడు.
వేరే ప్రదేశాలలో ఉన్న వారిని ప్రక్కకు పెడితే హైదరాబాదులోనే ఉంటూ ఈ-తెలుగు (బ్లాగర్ల)సమావేశాలలో ఉత్సాహం చూపినది ఎందరు? మీకందరికీ తెలుసు. ఇది ఏదో ఒకరిద్దరి సమస్య కాదు.కాని బ్లాగులలోనూ, గుంపులలోనూ కబుర్లు చెప్పటంతో సరిపెట్టటం ఎంతవరకూ సమంజసం? పైగా ఉచిత సలహాలతో సరిపెడుతున్నారు.ఆంటే మనది ఆవేశం మాత్రమే అన్నమాట. అదే తెలుగు వాళ్ళకు పుట్టుకతో వచ్చిన బుద్ధా?
నాదొకటే కోరిక. వచ్చే 14వ తేదీన 3 గంటలకు, హైదరాబాదు యూసఫుగూడాలోని కృష్ణకాంత్ పార్కులో జరిగే సమావేశానికి రండి. మీ సూచనలకు కార్యరూపం ఇవ్వండి.వివరాలకు ఇక్కడ చూడండి
పై మాటలు మీకు కోపం తెప్పిస్తే అది నామీద చూపండి. అంతేకాని తెలుగు భాషని బ్రతకనీయండి.అందరం కలిసి భాషని నిలుపుదాం.
Monday, December 8, 2008
తెలుగు భాషాభిమానులం - ఆరంభశూరులం!
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 10:29 PM 3 వ్యాఖ్యలు
Subscribe to:
Posts (Atom)