ఆ నాడు దివ్య వరాలను పొందిన నరకాసురుడు లోక కంటకుడై ప్రజలను బాధ పెట్టేడు. చివరకు శ్రీ కృష్ణుని దయ వలన నరకాసుర వధ జరిగి ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు. కాని ఇది కలియుగం. ఈ అభినవ నరకాసురుల భరతం ఎవరు పడతారు? వీళ్ళంతా ప్రజాప్రభుత్వ ముసుగులో దేశాన్ని దోచుకుంటున్న దోపిడీ దొంగలు. ఫూర్వం రాజులు యుద్ధాలు చేసి వేరే రాజుల రాజ్యాలను ఆక్రమించే వారు. కాని ఈ ముసుగు దొంగలు ప్రజల భూములనే ఆక్రమిస్తున్న ఘనులు. చేనే కంచ మెయ్యడమంటే ఇదే. ఆనాడు ఋషులు మోక్షం కోసం, ప్రజాహితం కోసం యజ్ఞాలు చేస్తే, ఈ నాడు పాలకులు తమ ఆస్తులను పెంచుకోటానికి వేల కోట్లతో ప్రజా ధనంతో ధన యజ్ఞాలను చేస్తున్నారు. ఇప్పటికే నడ్డి విరిగి బాధలపాలైన మధ్యతరగతి, బీద ప్రజలను ఈ నరకాసురుల బారినుండి కాపాడేదెవరు?
ఈ కార్యక్రమానికి దివినుండి ఏ దేవుడూ ఈ భువికి రాడు. ప్రజలే పూనుకోవాలి. కాని ప్రస్తుత పరిస్థితులలో ప్రజలకు ఇది సాధ్యమయే పని కాదు, కారణం, దారుణంగా వరుస మానభంగాలకు లోనైన ప్రజాస్వ్యామ్య వ్యవస్థ, ఓటు హక్కుని దుర్వినియోగం చేసిన, అసలే ఓటు హక్కుని వాడుకోని ప్రజలు. ఓటర్ల లిస్టులనుకూడా సరిగా తయారుచేయలేని నిర్వీర్యమైన ఎన్నికల సంఘం.
అంటే ఈ భూబకాసుర నరకాసురులను అంతమొందించాలంటే, చిన్న బకాసురులను ప్రజలు ఆశ్రయించక తప్పదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల బారిన పడి నశించక తప్పదు అన్నట్టు చిన్నాచితక రాజకీయ పార్టీలు ఉమ్మడి దాడి చేసి విషసర్పాన్ని అంతమొందించాలి. ఈ చిన్న పార్టీలనబడే రాజకీయ చలిచీమలు కూడా కుడతాయి. కాని ప్రస్తుతానికి ఏం చేస్తాం తప్పదు మరి.
అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎవరి దారి వారివన్నట్టు వ్యవహరిస్తున్నాయి. తమ పార్టీల ప్రధాన లక్ష్యం తెలంగాణా సాధనే అయినా తెలంగాణా పార్టీలు ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకోవడం లేదు. అన్ని ప్రతిపక్ష పార్టిలు కోరేది కాంగ్రస్ ఓటమే అయినా అవి కలిసే సూచనలు లేవు. కొత్తగా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ పుట్టె ముంచేటట్టు ఉంది. అభిమాన సంఘాల అండదండలతో, మూడో కుల పార్టీగా ముద్ర వేసుకొని అందలమెక్కాలన్న దానికి రాజకీయాల అనుభవం సున్నా. పైగా అభిమాన సంఘాలు "సూపర్, సూపర్" అని సినిమాలను నూరు రోజులు నడపడానికి పనికొస్తాయేమో గాని, "చిరు" పార్టీని గెలిపించి హీరోని సింహాసనం ఎక్కిస్తాయన్నది ప్రశ్నార్ధకమే! అవినీతిని అంతమొందిస్తామన్న ఆ పార్ట్తీలో అప్పుడే ఇతర పార్టీల లోని అవినితిపరులు చేరిపోతున్నారు. ఈ విధంగా ఆ పార్టీ తను పవర్ లోకి వస్తుందో లేదో కాని ఇతర పార్టీలను ముంచటానికి పనికి రావచ్చు.
పైవన్నీ అధికార పార్టీకి అక్కరకు రావచ్చు. కాని దానికి పాలించే సభ్యుల సంఖ్య రాకపోవచ్చు. తెలంగాణా సమస్య నెత్తికు చుట్టుకొని దాని ఆశలు నిరాశే కావచ్చు. పైగా ఐదేళ్ళ నిర్వాకం ఉండనే ఉంది. ఇందిరా గాంధి, రాజీవు గాంధి బొమ్మలకు ఓట్లు రాలే కాలానికి ఎప్పుడో చెల్లు చీటీ రాసేశారు. సోనియాకు అవసరార్ధం కాంగ్రెసు వాళ్ళు జై కొట్టాలి గాని ప్రజలు చీ కొట్టే పరిస్థితే.
ఇదంతా చూస్తూ ఉంటే, నరకాసుర వధ ఎవరు చేస్తారు, ఎలా జరుగుతుంది అన్నది మంచి రక్తి కట్టే సీనే.
Sunday, October 26, 2008
అభినవ నరకాసురులు
Labels: చిరు పార్టీ, నరకాసురుడు
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 11:49 PM 5 వ్యాఖ్యలు
Subscribe to:
Posts (Atom)