Showing posts with label police. Show all posts
Showing posts with label police. Show all posts

Saturday, July 12, 2008

పోలీసు పిల్లుల చెలగాటం - అమాయికునికి ప్రాణ సంకటం

గత రెండు నెలలనుండి మీడియాకి మేత అందించిన ఆరుషి హత్యోదంతం, యూపీ పోలీసుల నిర్వాకం చూసేక నాకు పాత తెలుగు సినిమాలలో మనం చూసే ఓ సీను గుర్తుకి వస్తోంది. గ్రామంలో నీళ్ళు పట్టుకుందుకి ఓ మధ్య వయస్కురాలు బావి వద్దకువస్తుంది. ఆవిడ ఓ పెద్ద న్యూస్ చానల్. నోటికేమొస్తే అది వాగడం ఆవిడకి పుట్టుకతో వచ్చిన విద్య. "సూరమ్మొదినా ఇది విన్నావా. ఆ మాయదారి మహలక్ష్మి కూతురు పాలేరు రంగయ్యతో సరసాలాడుతోందిట. ఎప్పుడో వాల్లిదారూ లేచిపోవడం ఖాయం. అసలు వాళ్ళ వంశమే అంత. మహలక్ష్మి ముత్తాతకి ఇంటి పనిపిల్లతో సంబంధం ఉండేదట." ఇలా సాగిపోతుంది ఆవిడ వాగ్ధాటి. అలాగా అని ముక్కుమీద వేలేసుకోవటం అక్కడున్న అమ్మలక్కల వంతు. యూ.పీ పోలిసులు, మీడియాది ఇదే తంతు.
కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే తామే న్యాయముర్తులుగా వ్యవహరించి నిందుతులకు అప్రకటిత శిక్షలు వెయ్యడం పోలీసులకు అలవాటని సరిపెట్టుకున్నా మీడియా బుద్ధి ఏమయింది? కట్టుకధలు అల్లటం, వాటికి మసాలా దట్టించి ప్రజలలోకి వదలడం మీడియాకి అలవాటయిపోయింది. రాజేష్ తల్వార్ విషయంలోనూ ఇదే జరిగింది.

ఏభై రోజుల క్రిందట నోయిడా లోని దంత వైద్యుడు రాజేష్ తల్వార్ తన స్వంత కూతురిని హత్య చేసాడంటూ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి వాళ్ళ దగ్గరున్న సాక్ష్యం ఏమిటంటే వాళ్ళు విచారించిన కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం. ఇది చాలు మన మీడియా వాళ్ళకి. ఇంక కధలు అల్లడం మొదలు పెట్టారు.రాజేష్ తల్వార్ కి మరో డాక్టరమ్మకి అక్రమ సంబంధం ఉందని. అది తెలిసి కూతురు అతనితో వాగ్వాదానికి దిగిందని, అదే హత్యకి కారణమని ఇలా. రాజేష్ తల్వార్ భార్య తన భర్త ఈ హత్య చెయ్యలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఉత్తరప్రదేశ్ ఐ.జి గారు ప్రత్యేకంగా ఓ మీడియా సమావేశం ఏర్పరచి పై వాదనలన్నిటికీ బలం చేకూరుస్తూ ఈ కేసులో తాము ఎంత వేగంగా ముందుకు పోతున్నామో విశదీకరించారు. ఈ వార్తపై స్పందిస్తూ కొందరు సంఘసేవకులు రాజేష్ తల్వార్ ని ఉరితీయాలని, అలాచేస్తే ఇంకెవరూ ఇలాంటి దుర్మార్గాలు చెయ్యరనీ ఆవేశంగా సెలవిచ్చేరు.

అయితే, సి.బి.ఐ కీ కేసు అప్పగించాక పరిస్తితులు తారుమారయ్యాయి. వాళ్ల విచారణలో తేలిందేమిటంటే రాజేష్ తల్వార్ హత్యచేసాడనటానికి నోయిడా పోలిసుల వద్ద ఏ రకమైన ఆధారాలు లేవని, ఈ హత్యకు మూలకారకుడు రాజేష్ తల్వార్ వద్ద పనిచేస్తున్న కాంపౌండరు మరి ఇద్దరు కావచ్చని.

రాజేష్ తల్వార్ ని బెయిల్ మీద వదిలేశారు. నోయిడా పొలీసులు తమ తప్పు ఏమీ లేదని, కేసుని ఓ కొలిక్కి తెస్తున్న సమయంలో సి.బి.ఐ కి బదిలీ చేశారనీ, తాము రాజేష్ తల్వార్ ని అనుమానించేమేగాని ఏ విధమైన చార్జిషీటు అతనిపై ఫైల్ చెయ్యలేదనీ చేతులు దులుపేసుకున్నారు. అయితే అతను గత ఏభై రోజులు అనుభవించిన నరకయాతనకు బాధ్యులెవరు? స్వంత కూతురిని చంపేడన్న అపవాదు ఎలా తుడుచిపెట్టుకొని పోతుంది?సంఘంలో ఉన్న పరువు మర్యాదలు మంటగలిసేక అతను తల ఎత్తుకు తిరగగలడా? సంఘంలో ఒక అంతస్తు ఉన్న వ్యక్తికే ఇలా జరిగితే మరి సామాన్యుల మాటేమిటి? పోలిసుల చిత్రహింసలను భరించలేక తప్పు తనదేనని ఒప్పుకో వలసిందే కదా? ఒక వ్యక్తి జీవితాన్ని బజారుకు ఈడ్చిన పోలీసులకి, కట్టుకధలు అల్లిన మీడియా వాళ్ళకి శిక్షలేదా? పోలీసు, న్యాయ వ్యవస్తలలో ఉన్న కుళ్ళు, లోపాలు దీనికి కారణం కాదా? అన్ని రంగాలలోను మనం పురోగమిస్తున్నామని జబ్బలు చరచుకుంటున్న ప్రభువులు ఈ రంగంలో ఎంత వెనుకబడి ఉన్నామో గ్రహించరా? సైన్సు ఇంత పురోగతి సాధించినా పాత పద్ధతులలోనే నేర పరిశోధన జరగడం మనం సిగ్గుపడాల్సిన విషయం కాదా? వందమంది నేరస్తులను వదిలేసినా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది కాగితాలకే పరిమితమా?

ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు.